Read more!

English | Telugu

పవన్‌కళ్యాణ్‌ చేతిలో గన్‌ చూసి.. కథ నచ్చకపోతే కాల్చేస్తాడేమోనని భయపడిన డైరెక్టర్‌.!

ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతున్న హీరోల కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేసి ఉంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం వారి మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి అత్యంత ఇష్టమైన సినిమా, ఆయన అభిమానులు సైతం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ‘తొలిప్రేమ’. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఆ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తూనే ఉంది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ఇష్టంగా వింటున్నారంటే ‘తొలిప్రేమ’ చిత్రానికి వారి మనసుల్లో ఎలాంటి స్థానం ఇచ్చారో అర్థమవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలను కరుణాకరన్‌ తెలియజేశారు. 

1996లో కదిర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిన కరుణాకరన్‌ ఒక్క ఏడాదిలోనే కోడైరెక్టర్‌ అయిపోయాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఒక మేగజైన్‌లో పవన్‌కళ్యాణ్‌ ఫోటో చూసి తన కథకు అతనే హీరో అనుకున్నాడు. పవన్‌ని కలిసి కథ చెప్పేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. అతని అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి ఏడు నెలలు పట్టింది. మొత్తానికి ఒకరోజు సాయంత్రం 7 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయింది. కరుణాకరన్‌ బయల్దేరిన కాసేపటికే అతని కారుకి ప్రాబ్లమ్‌ రావడంతో గంటన్నర ఆలస్యంగా పవన్‌ని కలిసాడు. అప్పటికే పవన్‌ కోపంగా ఉన్నారు. చేతిలో గన్‌ కూడా ఉంది. ‘అన్నయ్యా.. మీకు కథ నచ్చకపోతే కాల్చేయరు కదా’ అన్నారు. ఆ మాటతో పవన్‌ కోపం మొత్తం పోయింది. హాయిగా నవ్వేశారు. 

పవన్‌కి కథ చెప్పడం మొదలు పెట్టాడు కరుణాకరన్‌. తను రాసుకున్న ప్రతి సీన్‌కి స్టోరీబోర్డ్‌ వేయడం కరుణకు అలవాటు. దాని ప్రకారమే అన్నీ చూపిస్తూ కథ చెప్పాడు. పవన్‌కు కథ విపరీతంగా నచ్చేసింది. కరుణను అప్రిషియేట్‌ చేసి సినిమా చేస్తున్నాం అన్నారు. నిర్మాత జి.వి.జి.రాజును పరిచయం చేశారు. అంతా ఓకే అయిపోయింది. షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. డైరెక్టర్‌గా మొదటి సినిమా కావడంతో ఎంతో టెన్షన్‌ పడుతున్న కరుణాకరన్‌కి ధైర్యం చెప్పారు పవన్‌. సినిమా పూర్తయ్యే వరకు తను చేసే సీన్స్‌ లేకపోయినా సెట్‌లోనే ఉండి కరుణాకరన్‌కి సపోర్ట్‌ చేశారట పవన్‌. పవన్‌కళ్యాణ్‌కి సినిమా అంటే ఎంత ప్యాషన్‌ ఉందో ఆ సమయంలో కరుణాకరన్‌కి అర్థమైంది. 

పవన్‌కళ్యాణ్‌ డెడికేషన్‌ కరుణాకరన్‌కి బాగా నచ్చింది. తను చేసే సీన్స్‌గానీ, పాటలుగానీ ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవడానికి పవన్‌ ఎంత క్యూరియాసిటీతో ఉంటారో తెలిపే ఓ సంఘటన గురించి చెప్పారు కరుణాకరన్‌. సినిమాకి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఎడిటింగ్‌ వర్క్‌లో పూర్తిగా బిజీ అయిపోయాడు కరుణ. అందులో భాగంగానే సినిమాలో వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ ‘నీ మనసే..’ పాటను ఎడిట్‌ చేస్తున్నారు. ఆ పాటంటే పవన్‌కు ఎంతో ఇష్టం. ఆ పాటకు సంబంధించిన ఎడిటింగ్‌ జరుగుతోందని తెలుసుకొని రామానాయుడు స్టూడియోకి సాయంత్రం 8 గంటలకు వచ్చారు పవన్‌. ఆ పాటను చూడాలని ఉంది. ఒకసారి చూపిస్తావా అని కరుణను అడిగారు పవన్‌. ‘అన్నయ్యా.. ఇంకా ఎడిటింగ్‌ జరుగుతోంది కొంచెం వెయిట్‌ చెయ్యండి’ అని చెప్పారు కరుణ. ఆ పాట ఎడిటింగ్‌ పూర్తయ్యేసరికి అర్థరాత్రి 2 అయింది. బయటకు వచ్చి చూసేసరికి పవన్‌ అక్కడే ఓ బల్లపై కూర్చొని కనిపించారు. అది చూసి షాక్‌ అయిన కరుణ ‘మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అన్నయ్యా’ అని అడిగాడు. ‘ఆ పాట చూసి వెళ్దామని ఉన్నాను’ అన్నారు పవన్‌. వెంటనే ఆ పాటను చూపించారు కరుణ. అది చూసిన పవన్‌ సంతోషానికి అవధుల్లేవు. కరుణను గట్టిగా హగ్‌ చేసుకొని చాలా బాగా చేశావు అని మెచ్చుకున్నారు. 

తను చేసే సినిమాలకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలియజేస్తూ ‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోని సీన్స్‌ ఎక్కువ శాతం రియల్‌ లైఫ్‌ నుంచి తీసుకున్నవి లేదా వాటి నుంచి స్ఫూర్తి పొందినవి అయి ఉంటాయి. సినిమాటిక్‌గా ఉండే సీన్స్‌ కంటే నిజజీవితంలోని సంఘటనలే నా సినిమాలో ఉంటాయి. ‘తొలిప్రేమ’ చిత్రంలో హీరోయిన్‌ కీర్తిరెడ్డి ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్‌ అయింది. అది నా జీవితంలో జరిగింది. దీపావళి పండగకు చెన్నయ్‌ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు.. ఆ రాత్రివేళ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అటు తిరిగి చూస్తే చిచ్చుబుడ్డి వెలుగులో ఒక్కసారిగా ఆ అమ్మాయి ముఖం కనిపించి ఆ తర్వాత అంతా చీకటైపోయింది. అది నా మనసులో చెరగని ముద్ర వేసింది. వెంటనే ఆ సీన్‌ను పేపర్‌పై భద్రపరుచుకున్నాను. దాన్ని ఛోటా కె.నాయుడు అద్భుతమైన లైటింగ్స్‌తో ఎక్స్‌లెంట్‌గా తీశారు. నా స్కూల్‌ డేస్‌లో ఓ అమ్మాయి ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌కి ఏంజెల్‌లా రెడీ అయి స్కూటర్‌పై వెళుతూ కనిపించింది. అదే సీన్‌ని ‘డార్లింగ్‌’ చిత్రంలో కాజల్‌తో చేశాను’ అని వివరించారు కరుణాకరన్‌.