English | Telugu

ఎన్‌.టి.ఆర్‌., చిరంజీవి కాంబినేషన్‌ అనగానే ఇండస్ట్రీ షాక్‌.. రంగంలోకి దిగిన మోహన్‌బాబు.!

ప్రేమకథా చిత్రాలు, సెంటిమెంట్‌ సినిమాలు రూపొందుతున్న రోజుల్లో ‘అడవిరాముడు’ చిత్రంతో కమర్షియల్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టారు ఎన్‌.టి.ఆర్‌, కె.రాఘవేంద్రరావు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో కేడీ నెం.1, డ్రైవర్‌రాముడు, వేటగాడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, గజదొంగ, తిరుగులేని మనిషి, సత్యం శివం చిత్రాలు వచ్చాయి. ‘వేటగాడు’ 1979లో రిలీజ్‌ అయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన అర్జునరాజు, శివరామరాజు మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌తో సినిమా చెయ్యడానికి రెండేళ్ళు ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మళ్ళీ సినిమా చేద్దామని, మంచి కథ రెడీ చేసుకోమని ఎన్టీఆర్‌ చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమిళ్‌లో శివాజీ గణేశన్‌ మూడు పాత్రల్లో నటించిన ‘దైవమగన్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందని రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్టీఆర్‌ దానికి ఒప్పుకోలేదు. శివాజీ గణేశన్‌ కెరీర్‌లో అదో మైలురాయిలాంటి సినిమా అనీ, ఆ పాత్రలు పోషించడం శివాజీకే సాధ్యమనీ, దాన్ని టచ్‌ చేయడం తనకి ఇష్టం లేదని చెప్పారు ఎన్టీఆర్‌.

1974లో శివాజీగణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘తంగపతకం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలని అల్లు రామలింగయ్య హక్కులు తీసుకున్నారు. దాన్ని ఎన్టీఆర్‌తో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. కానీ, దానికి శివాజీ గణేశన్‌ ఒప్పుకోలేదు. ‘తంగపతకం’ చిత్రాన్నే ‘బంగారు పతకం’ పేరుతో డబ్‌ చేయించారు. తమిళ్‌లో, తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అలా ఎన్టీఆర్‌ తెలుగులో చెయ్యాల్సిన ఈ సినిమా మిస్‌ అయింది. ఆ సినిమాలోని కొన్ని అంశాలను తీసుకొని ‘కొండవీటి సింహం’ కథను సిద్ధం చేశారు . మంచివాడైన తండ్రి, చెడ్డవాడైన కొడుకు మధ్య జరిగే కథ ఇది. అప్పుడు ఒకే హీరో తండ్రీకొడుకులుగా నటించడం అనే ట్రెండ్‌ నడుస్తోంది. ఎన్టీఆర్‌ ఆ రెండు క్యారెక్టర్లు చెయ్యడం కరెక్ట్‌ కాదని భావించి కొడుకు క్యారెక్టర్‌ కోసం చిరంజీవిని తీసుకున్నారు. ఎన్టీఆర్‌ కోసం మరో యంగ్‌ హీరో క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేశారు. చిరంజీవి, గీతలపై ఒక పాటను కూడా ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఈ వార్త విని ఇండస్ట్రీలోని వారు షాక్‌ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తిరుగులేని మనిషి’ చిత్రం వచ్చింది. దాన్ని కూడా రాఘవేంద్రరావే డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఫ్లాప్‌ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా చెయ్యకూడదన్న సెంటిమెంట్‌తో చిరంజీవిని ‘కొండవీటి సింహం’ చిత్రం నుంచి తప్పించారు. ఆ స్థానంలో మోహన్‌బాబుని తీసుకున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

1969లో విడుదలైన ఎం.జి.ఆర్‌. సినిమా ‘అడిమై పెన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘కొండవీటి సింహం’ పేరుతో విడుదల చేశారు. అదే టైటిల్‌ను ఈ సినిమాకి ఖరారు చేశారు. ‘తంగపతకం’ చిత్రంలో చెడ్డవాడైన కొడుకును సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన తండ్రి చంపేస్తాడు. అది ఆ సినిమా క్లైమాక్స్‌. వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం ఆ తండ్రికి బంగారు పతకం బహూకరిస్తుంది. ‘కొండవీటి సింహం’ చిత్రం క్లైమాక్స్‌ని కూడా మొదట అలాగే తీశారు. అయితే కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే సెంటిమెంట్‌ మరింత పండుతుందని భావించారు రాఘవేంద్రరావు. అప్పటికే ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ అయిపోయాయి. అయినా రాఘవేంద్రరావు అభ్యర్థన మేరకు మరో వారం రోజులు డేట్స్‌ ఇచ్చారు. కొత్త క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. అయిపోయిన సినిమాని మళ్ళీ షూట్‌ చేస్తున్నారని తెలియడంతో ఇండస్ట్రీలో అనుమానాలు మొదలయ్యాయి. సినిమా బాగా రాకపోవడంవల్లే రీషూట్‌ చేశారని ప్రచారం జరిగింది. ఈ సినిమాను 1981 అక్టోబర్‌ 7న విడుదల చేశారు. అందరి అనుమానాల్ని పక్కన పెడుతూ సినిమా ఘనవిజయం సాధించింది. ‘అడవిరాముడు’ 50 రోజులకు రూ.81 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ‘వేటగాడు’ 50 రోజులకు రూ.96 లక్షలు కలెక్ట్‌ చేసింది. ‘కొండవీటి సింహం’ 1 కోటి 25 లక్షల రూపాయలు వసూలు చేసి అంతకుముందు రికార్డులను క్రాస్‌ చేసింది. అప్పటికి అది ఇండస్ట్రీ రికార్డు.