Read more!

English | Telugu

6 భాషల్లో రీమేక్‌ అయిన రెండో భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన తెలుగు సినిమా!

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేవి. దర్శకులు కూడా అలాంటి కథల్లోనే వైవిధ్యం చూపిస్తూ సినిమాలు రూపొందించేవారు. గత 30 సంవత్సరాలుగా అలాంటి కథలతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో వెంకటేష్‌ ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ పక్క యాక్షన్‌ మూవీస్‌ చేస్తూ.. ఫ్యామిలీ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు వెంకటేష్‌. అతను చేసిన ఫ్యామిలీ సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ అయినవే ఉండడం విశేషం. అలాంటి సినిమాల్లో ప్రథమంగా చెప్పుకోదగిన సినిమా ‘పవిత్రబంధం’. 

వెంకటేష్‌ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్‌ చేశారు. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని పాటలు, మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యూత్‌ని ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌, మహిళలకు నచ్చే కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌ ఈ సినిమాలో లెక్కకు మించి ఉంటాయి. భూపతిరాజా ఈ సినిమాకి కథను అందించారు. ఈ కథ విన్న ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి కాస్తయినా ఆలోచిస్తారు. కానీ, వెంకటేశ్‌ ఇలాంటి విభిన్నమైన కథలతోనే ఎన్నో సూపర్‌హిట్స్‌ సాధించారు. అందుకే మొదటి సిట్టింగ్‌లోనే కథను ఓకే చేసేశారు. 

విదేశాల్లో పెరిగి అక్కడి కల్చర్‌కి అలవాటు పడిన ఓ యువకుడి కథ ఇది. జీవితం, ప్రేమ అనే మాటలకు అర్థం తెలియని ఆ యువకుడికి అవేమిటో, వాటి ప్రాధాన్యం ఏమిటో తెలియజెప్పిన సినిమా ఇది. స్థూలంగా కథ గురించి చెప్పాలంటే.. విజయ్‌(వెంకటేష్‌)కి పెళ్లి, సంసారం వంటి విషయాల మీద అస్సలు నమ్మకం లేదు. తండ్రి విశ్వనాథ్‌ (ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం) పోరు పడలేక తమ ఆఫీసులోనే పనిచేసే రాధ(సౌందర్య) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే సంవత్సరం మాత్రమే ఆమెతో కాపురం చేస్తానని, దాని కోసం అగ్రిమెంట్‌ చేసుకుంటానని తండ్రితో చెబుతాడు. రాధలాంటి అమ్మాయితో సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఆమె మంచితనాన్ని చూసి తప్పకుండా జీవితాంతం ఆమెను భార్యగా అంగీకరిస్తాడన్న నమ్మకంతో అగ్రిమెంట్‌ విషయం రాధకు చెప్పకుండా విజయ్‌ని పెళ్లి చేసుకోమని రాధను అడుగుతాడు విశ్వనాథ్‌. సంతోషంగా అంగీకరిస్తుంది రాధ. ఆ తర్వాత అగ్రిమెంట్‌ విషయం తెలసుకొని విజయ్‌ని, విశ్వనాథ్‌ని అసహ్యించుకుంటుంది. అయితే ఆ తర్వాత తన కుటుంబ పరిస్థితుల వల్ల తప్పనిసరై పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ ఏడాది కాలంలో విజయ్‌ని రాధ మార్చగలిగిందా? వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అనేది ఎంతో అర్థవంతంగా, మరెంతో వైవిధ్యంగా తెరకెక్కించారు దర్శకులు ముత్యాల సుబ్బయ్య. 

ఈ తరహా కథతో సినిమా చేసి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న ముత్యాల సుబ్బయ్య ఎంతో పకడ్బందీగా స్క్రిప్‌ని సిద్ధం చేసుకున్నారు. దానికి ఆర్టిస్టుల అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ తోడై సినిమాని సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందించింది. అంతేకాదు, ఉత్తమనటిగా సౌందర్య, ఉత్తమ సహాయనటుడిగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా నంది అవార్డులు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో రీమేక్‌ చెయ్యడం అనేది అన్నింటికంటే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, తమిళ్‌, బెంగాలీ భాషల్లో రీమేక్‌ అయిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్‌హిట్‌ కావడం మరో విశేషం. కన్నడ చిత్రం ‘అనురాగ అరలితు’ చిత్రం తర్వాత ఆరు భాషల్లో రీమేక్‌ అయిన రెండవ భారతీయ చిత్రంగా ‘పవిత్రబంధం’ రికార్డు సృష్టించింది.