English | Telugu
సూపర్‌స్టార్ సినిమాకు ఘోస్ట్ రైటర్స్‌గా పనిచేసిన పరుచూరి బ్రదర్స్!
Updated : Jun 1, 2021
సూపర్‌స్టార్ కృష్ణ, సూపర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్ సూపర్ హిట్. పరుచూరి బ్రదర్స్ ఎక్కువగా రచన చేసింది కృష్ణ హీరోగా నటించిన సినిమాలకే. ఏకంగా 43 చిత్రాలకు కృష్ణతో కలిసి పనిచేశారు పరుచూరి సోదరులు. అయితే వారు మొదటగా కృష్ణ నటించిన సినిమాకు పనిచేసింది ఘోస్ట్ రైటర్స్‌గా కావడం గమనార్హం. ఆ సినిమా 'బంగారు భూమి' (1982). శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాకు పి. చంద్రశేఖరరెడ్డి (పి.సి. రెడ్డి) డైరెక్టర్. ఆ సినిమాకు రైటర్స్‌గా పనిచేసింది మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య. వారికి ఘోస్ట్ రైటర్స్‌గా పరుచూరి బ్రదర్స్ వర్క్ చేశారు. అందుకే ఆ సినిమా టైటిల్స్‌లో బ్రదర్స్ పేరు కనిపించదు.
నవభారత్ బాబూరావుకు ఒక సినిమా కథ రాసిచ్చి, మద్రాస్ నుంచి ఉయ్యూరుకు బయలుదేరబోతున్నారు బ్రదర్స్‌లో చిన్నవాడైన గోపాలకృష్ణ. అప్పుడు 'బంగారు భూమి' సినిమాకు కోడైరెక్టర్‌గా పనిచేస్తున్న మన్నెం రాధాకృష్ణ కలిసి "రేపు 26 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంది. రైటర్స్ మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య గార్లు అందుబాటులో లేరు. ఆ ఒక్క సీన్ రాసి వెళ్లండి." అని రిక్వెస్ట్ చేశారు. అంతకముందే ఆ సినిమా కథాచర్చల్లో గోపాలకృష్ణ పాల్గొని ఉన్నారు. చూస్తే.. స్క్రిప్టులో ఒకటి కాదు 16 సీన్లు రాయాల్సి ఉన్నట్లు గమనించారు గోపాలకృష్ణ. ఆ రాత్రి నిద్రను పక్కన పెట్టేసి ఏకబిగిన 16 సీన్లు రాసేశారు.
పొద్దున్నే ఆ సీన్లు డైరెక్టర్ పి.సి. రెడ్డితో పాటు విన్న నిర్మాత వెంకన్నబాబు ఆశ్చర్యపోయి, అప్పటికప్పుడు తాంబూలం తెప్పించి, అందులో రూ. 1,116 పెట్టి గోపాలకృష్ణకు ఇచ్చారు. ఇది తాను డబ్బుల కోసం రాయలేదనీ, పి.సి. రెడ్డిగారి కోసం రాశాననీ ఆయన ఎంత చెప్పినా వినకుండా తన హస్తవాసి మంచిదంటూ బలవంతంగా ఆ డబ్బు గోపాలకృష్ణ చేతిలో పెట్టారు వెంకన్నబాబు.
దాని తర్వాత పి.సి. రెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన మరో చిత్రం 'భోగభాగ్యాలు'లో ఓ పాట రాశారు పరుచూరి బ్రదర్స్. ఇంతదాకా వాళ్లు రాసిన దాదాపు 350 చిత్రాలలో ఒకే ఒక్క పాట మాత్రమే రాసిన చిత్రం అదే. "ఇదిగిదిగో డింబకా.. నీవు మెచ్చిన మేనక" అంటూ వారు రాసిన పాటకు చక్రవర్తి సంగీతం సమకూర్చారు. సినిమాలో కృష్ణ, శ్రీదేవి జంటపై ఆ పాటను తీశారు. ఇక టైటిల్ కార్డ్స్‌లో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ అనే పేరు వచ్చిన తొలి కృష్ణ సినిమా 'ఈనాడు'. అది కృష్ణ 200వ చిత్రం కావడం, బాక్సాఫీస్ దగ్గర అది చరిత్ర సృష్టించడం ఇంకో విశేషం.