English | Telugu
సినిమాల్లోకి రాకముందు సురభి నాటకాల్లో నటించిన 'కత్తివీరుడు' కాంతారావు!
Updated : Jun 2, 2021
'కత్తివీరుడు'గా పేరుపొందిన దివంగత నటుడు కాంతారావు.. ఒకానొకప్పుడు జానపద చిత్రాల విషయంలో జగద్విఖ్యాత నందమూరి తారకరామారావుతో సమానమైన పాపులారిటీ సంపాదించారు. కాలక్రమంలో జానపద చిత్రాల స్థానంలో ఎక్కువగా సాంఘిక చిత్రాలు నిర్మాణం కావడంతో ఆయన ప్రాభవం తగ్గిపోయి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. కాగా చాలామందికి తెలీని విషయం.. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రఖ్యాత నాటక సమాజం 'సురభి'లో పనిచేశాడనేది!
మైనర్‌గా ఉన్నప్పుడే ఆయనకు వారసత్వంగా 'మాలీ పటేల్' పదవి లభించింది. అంటే గ్రామ మునసబు అన్నమాట. ఆ టైమ్‌లో వారి ఊరికి సురభి నాటక కంపెనీ వచ్చింది. అప్పట్లోనే కాంతారావుకు నటుడు కావాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. మిత్రులతో కలిసి 'బాలమిత్ర నాటక మండలి' అనే నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి 'గయోపాఖ్యానం', పానుగంటివారి 'మధుసేవ' లాంటి నాటకాలను ఆడేవారు. సురభి నాటక కంపెనీ ఆ ఊరికి వచ్చాక ఆ కంపెనీలో చేరాలనే కోరికను నిర్వాహకుల దగ్గర బయటపెట్టారు కాంతారావు.
వాళ్లు ఆయనను తమ సమాజంలోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. "మీ కులంలో నాటకాల్లో నటించడం మహాపరాధం. పైగా మీరు గ్రామాధికారి పదవిలో ఉన్నారు. మిమ్మల్ని మా సమాజంలోకి తీసుకుంటే మీ ఊరి పెద్దలు మమ్మల్ని బ్రతకనివ్వరు. మీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్నిలా వదిలేయండి." అని వారు కాంతారావును బతిమలాడారు. కానీ ఆయన మొండిమనిషి. "మీరు నన్ను మీ సమాజంలోకి తీసుకోకపోతే.. ఈ ఊళ్లోనే కాకుండా, చుట్టుపక్కల ఊళ్లల్లో కూడా నాటకాలు వేయకుండా చేస్తాను జాగ్రత్త." అని బెదిరించారు.
దాంతో గత్యంతరం లేక వాళ్లు ఆయనను తమ నాటక సమాజంలోకి తీసుకున్నారు. ఆ సమాజంలో చేరాక కాంతారావు వేసిన తొలి పాత్ర 'శ్రీకృష్ణ లీలలు' నాటకంలో బ్రహ్మ పాత్ర. ఆ తర్వాత 'మధుసేవ', 'కనకతార', 'తెలుగుతల్లి' లాంటి నాటకాలను ఆడారు కాంతారావు. అక్కడే 'గయోపాఖ్యానం' నాటకంలో తొలిసారి నారద పాత్ర ధరించారు. ఆ నాటకానుభవమే అనంతర కాలంలో ఆయనకు 'సీతారామ కల్యాణం', 'శ్రీకృష్ణ తులాభారం' లాంటి సినిమాల్లో నారద పాత్రను అమోఘంగా పోషించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కారణమైంది.