English | Telugu
అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా హీరో కృష్ణ!
Updated : Jun 1, 2021
తెలుగు సినీ రంగంలో ప్రయోగాలు, సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్‌స్టార్ కృష్ణ. అనేక జానర్ సినిమాలకు, అనేక ఫార్మట్లకు ఆయన సినిమాలే పునాది రాళ్లు వేశాయి. అదే తరహాలో తొలిసారిగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న సినిమా కూడా కృష్ణ నటించిందే. ఆ సినిమా 'హరేకృష్ణ హలోరాధ' (1980). ఒక పాట, అతి కొద్ది సీన్లు మినహా 90 శాతం షూటింగ్‌ను అమెరికాలోనే జరుపుకున్న సినిమా ఇది. శ్రీప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్. భరణీరెడ్డి నిర్మించగా ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ విలన్లుగా నటించారు. రతి, ప్రకాశ్ మరో జోడీగా నటించారు.
అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జరపాలనే ఉద్దేశంతో కథను అక్కడి బ్యాక్‌డ్రాప్‌తో డైరెక్టర్ శ్రీధర్ స్వయంగా రాశాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి ఈ సినిమాని నిర్మించారు. తమిళ వెర్షన్‌లో హీరోగా శివచంద్రన్ నటించాడు. లాస్ ఏంజెల్స్‌లోని శాంతామోనికా బీచ్, శాండియాగో బీచ్, లాస్ వేగాస్, ఫీనిక్స్ లాంటి లొకేషన్లలో సీన్లు, పాటలు తీశారు. క్లైమాక్స్ సీన్లను గ్రాండ్ కాన్యన్‌లో చిత్రీకరించారు. 'మెకన్నాస్ గోల్డ్' షూటింగ్ జరుపుకున్న ప్రదేశంగా గ్రాండ్ కాన్యన్ ఆ రోజుల్లో బాగా ఫేమస్.
ఫీనిక్స్ సిటీ 'రోడియో' అనే గుర్రాల ఆటకు ఫేమస్. పొగరుబోతు గుర్రాలను లొంగదీసుకోవడానికి హార్స్ రైడర్స్ పడే పాట్లే ఆ రోడియో ఆట. ఆ ఆటను చిత్రీకించడం కోసమే ఫీనిక్స్‌లో షూటింగ్ చేశారు. ఆ ఆటను చూస్తూ, ఎవరూ లొంగదీయలేని గుర్రాన్ని హీరో కృష్ణ లొంగదీసే సీన్లను అక్కడ తీశారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభవాన్నిచ్చింది.
డైరెక్టర్ శ్రీధర్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తావించదగ్గది. అదేమంటే.. ఆదుర్తి సుబ్బారావు 'తేనెమనసులు' (1965)తో కృష్ణను హీరోగా పరిచయం చేశారనే విషయం మనందరికీ తెలుసు. కానీ దానికంటే ముందు ఓ తమిళ చిత్రంతో కృష్ణను హీరోగా పరిచయం చేయాలనుకున్నారు శ్రీధర్. అది మిస్సయ్యింది. ఆ తర్వాత 15 సంవత్సరాలకు కానీ, 'హరేకృష్ణ హలోరాధ' సినిమాతో కృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం శ్రీధర్‌కు రాలేదు.