English | Telugu
యంగ్ హీరోలకు కృష్ణ లాగా ఎదగమని దాసరి ఎందుకు చెప్పేవారంటే...
Updated : May 4, 2021
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు. 150 సినిమాల దర్శకుడిగా టాలీవుడ్‌లో ఆయన చరిత్ర సృష్టించారు. వాటిలో ఎన్ని మైలురాళ్లలాంటి సినిమాలున్నాయో! ఎంతోమంది యంగ్ హీరోలను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. విశేషమేమంటే ఆ యంగ్ హీరోలను ఆయన ఎన్టీఆర్ లానో, ఏఎన్నార్ లానో, చిరంజీవి లానో ఎదగమని చెప్పేవారు కాదు, కృష్ణ లాగా ఎదగమని చెప్పేవారు. దీనికి రీజన్ ఏంటనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురయ్యింది.
"కృష్ణగారు, నేను ఒకేసారి ఇండస్ట్రీకి 1964లో వచ్చాం. ఆయన 'తేనె మనసులు' సినిమాకి వర్క్ చేస్తే, నేను రైటర్ పాలగుమ్మి పద్మరాజుగారి దగ్గర 'రంగుల రాట్నం' సినిమాకు పనిచేశాను. కృష్ణగారు తన మూడో సినిమా 'గూఢచారి 116' తర్వాత చాలా పాపులర్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ ఆయన వెంటపడ్డారు. ఎవరినీ ఆయన డిజప్పాయింట్ చేయలేదు. వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్‌కూ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. రోజూ మూడు షిఫ్టుల చొప్పున పనిచేసేవారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఒకటి, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 దాకా ఒకటి, రాత్రి 10 గంటల నుంచి 2 గంటల దాకా ఒకటి! అలా ఆయన పని గంటలు పెంచుకున్నారు. దాని వల్ల ఎంత ఔట్‌పుట్ వచ్చిందో తెలిసిందేగా. నెలకో సినిమా పూర్తిచేసేవారు. అందుకే ఆయనలా కష్టపడి ఎదగమనీ, ఇండస్ట్రీకి మేలు చేయమనీ కొత్త హీరోలకు చెప్తుంటాను." అని దాసరి నారాయణరావు చెప్పుకొచ్చారు.
సందర్భవశాత్తూ డైరెక్టర్‌గా తన తొలి సినిమా 'తాత మనవడు' హిట్టయ్యాక దాసరి వెంట కూడా ప్రొడ్యూసర్లు పడ్డారు. ఆయన కూడా వారినెవరినీ డిజప్పాయింట్ చేయకుండా అందరికీ సినిమాలు చేసిపెట్టారు. తాను కూడా మూడు షిఫ్టులు పనిచేశారు. అందువల్లే తొలి 50 సినిమాలు పూర్తి చేయడానికి ఆయనకు పట్టిన కాలం తొమ్మిదేళ్లే. ఇవాళ్టి దర్శకులు అంత సమయంలో తొమ్మిది సినిమాలు కూడా చేయట్లేదనే విషయం తెలిసిందే. పని విషయంలో హీరోల్లో సూపర్‌స్టార్ కృష్ణ, దర్శకుల్లో దాసరి నారాయణరావు రోల్‌మోడల్స్‌గా టాలీవుడ్‌లో నిలిచిపోయారు.