English | Telugu
కమల్ హాసన్‌ను వాళ్లు గుర్తుపట్టలేదు!
Updated : May 4, 2021
సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక్కొక్క మెట్టే అధిగమిస్తూ, హీరో స్థాయికి చేరుకున్న తర్వాత మొదటిసారిగా తమవూరు తమిళనాడులోని పరమకుడి వెళ్లారు కమల్ హాసన్. అంటే 1976లో అన్నమాట. వాళ్ల సొంతూరు పరమకుడి అయినా, కమల్ పుట్టింది రామనాథపురంలోని రామ్‌బాగ్ ప్యాలెస్‌లో. ఆయన నటుడిగా స్థిరపడిన తర్వాత మద్రాసులో రామ్‌బాగ్ అనే ఇల్లు కొన్నారనుకోండి.. అది వేరే విషయం.
సొంతూరు పరమకుడిలో రైలు దిగాలని కమల్ ప్రయత్నిస్తుంటే.. అభిమానులు దిగనిస్తే కదా.. సొతూరిలో తనకు జరగనున్న సత్కార సభకు కమల్ వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు తెలిసిపోవడం వల్ల, రైల్వే స్టేషన్‌కు వందల సంఖ్యలో వచ్చేశారు. వాళ్లల్లో విద్యార్థులే ఎక్కువమంది. కమల్ వాళ్ల నాన్నగారు కూడా స్టేషన్‌కు వచ్చారు, కొడుకును రిసీవ్ చేసుకోవడానికి. కానీ ఆయన కొడుకు దగ్గరకు చేరుకోలేకపోయారు. అయితే అంతమంది జనం.. ఆ కోలాహలం చూశాక ఆయన కళ్లు చెమర్చాయి. "నువ్వు పుట్టి పెరిగిన ఊళ్లో నీకింత ఘన స్వాగతం, అభిమానుల ఆదరాభిమానాలు లభించడం నాకు చాలా ఆనందంగా ఉందిరా." అని ఆ తర్వాత ఆయన అన్నారు.
కమల్‌కు సన్మానం జరిగింది. రామనాథపురం రాజుగారే "కళాతిలకం" అనే బిరుదు ప్రదానం చేశారు. ఆ తర్వాత రోజు పరమకుడిలో తన ఇష్టం వచ్చినట్లు తిరిగారు కమల్. బాల్యమిత్రులను కలసుకున్నారు. పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్లతో సైకిల్ మీద తిరిగారు. వాళ్ల మేస్టారు ఇంటికి వెళ్లి తలుపుతట్టి వాళ్లందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాను చిన్నప్పుడు తరచుగా ఈతకొట్టే చెరువుకు వెళ్లి అక్కడ కాసేపు గడిపారు. తాను పుట్టిన ఇల్లు చూడ్డానికి రామనాథపురం కూడా వెళ్లారు.
"దారిలో నాకో గమ్మత్తు చేయాలనిపించింది. అందరూ నా గురించి తెలుసుకున్న కారణంగా ఈ హడావిడి చేశారు. కానీ నిజంగా నేను అంత పాపులర్ అయ్యానా? అని తెలుసుకోవాలనిపించింది. ఓ పల్లెటూరు మీదుగా కారు వెళ్తోంది. అక్కడ ఓ మిల్లు ముందు కొంతమంది పనివాళ్లు లంచ్ టైమ్ కాబోలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ గుంపుల్లో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. నేను అల్లంత దూరంలో కారు ఆపమని చెప్పి, దిగి వాళ్ల దగ్గరకు ఒంటరిగా వెళ్లాను. "నేనెవర్నో మీకు తెలుసా?" అనడిగాను. వాళ్లెవరూ నన్ను గుర్తు పట్టలేదు. కనీసం ఆశ్చర్యంగా కూడా చూడలేదు. "నేను మీ ప్రాంతంవాణ్నే. నా పేరు కమల్ హాసన్" అని చెప్పి నా ప్రయాణం కొనసాగించాను." అంటూ తన పాపులారిటీ కథ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.