English | Telugu

కృష్ణ‌ను ఇండియ‌న్ కౌబాయ్‌గా నిలిపిన 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' చూసి.. ఎన్టీఆర్ చేసిన కామెంట్‌!?

 

సాహ‌స‌మే ఊపిరిగా తెలుగుచిత్ర‌సీమ‌ను ఏలిన హీరో.. కృష్ణ‌. ఏవి తీయ‌వ‌ద్దంటే అవి తీసి చూపించిన‌వాడు హీరో కృష్ణ‌. "నువ్వు జేమ్స్‌బాండ్ ఏంటి?" అన్న‌వాళ్ల‌కు స్పై ఫిలిమ్స్ తీసి, 'ఆంధ్రా జేమ్స్‌బాండ్' అనే పేరు సంపాదించుకున్న‌వాడు హీరో కృష్ణ‌. "కౌబాయ్ సినిమా తియ్య‌కు.. ఆరిపోతావ్" అన్న‌వాళ్ల‌కు తీసి, ఇండియన్ కౌబాయ్‌గా పేరు పొందిన‌వాడు.. హీరో కృష్ణ‌! అవును. దేశంలోనే కౌబాయ్ సినిమాల‌కు కేరాఫ్‌గా సూప‌ర్‌స్టార్ కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఇప్ప‌టికీ ఇండియాలో కౌబాయ్ మూవీ అంటే ఎవ‌రికైనా గుర్తుకు వ‌చ్చేది 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' సినిమాయే. దాని త‌ర్వాత ఎంత‌మంది ఆ త‌ర‌హా సినిమాలు చేసినా, దాని ద‌రిదాపుల్లోకి వెళ్ల‌లేక‌పోయారు. వెస్ట‌ర‌న్ కంట్రీస్‌కు చెందిన ఇతివృత్తాన్ని ఇండియ‌నైజ్ చేసి, మెప్పించిన హీరోగా చ‌రిత్ర‌లో నిలిచారు కృష్ణ‌. ఇవాళ ఆ హీరో.. ఆ సూప‌ర్‌స్టార్ 78వ పుట్టిన‌రోజు.

'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' కృష్ణ చేసిన తొలి కౌబాయ్ ఫిల్మ్‌. శ్రీ ప‌ద్మాల‌యా మూవీస్‌ బ్యాన‌ర్ మొద‌లుపెట్టి తీసిన 'అగ్నిప‌రీక్ష' ఆశించిన రీతిలో ఆడ‌క‌పోవ‌డంతో, రెండో సినిమాకి కొత్త ప్ర‌యోగం చేయాల‌నుకున్నారు సాహ‌సి కృష్ణ‌. ఆ టైమ్‌లో రిలీజైన హాలీవుడ్ సినిమాలు 'మెక‌న్నాస్ గోల్డ్‌', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు చూసి, ఆ త‌ర‌హా కౌబాయ్ సినిమా చెయ్యాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో క‌లిగింది. వాటి ఆధారంగా తెలుగు వాతావార‌ణంతో క‌థ కావాల‌ని అడిగితే, రాసిచ్చారు అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులైన ఆరుద్ర‌. ఆ క‌థ బాగా న‌చ్చింది కృష్ణ‌కు. 

అప్పుడు ఆయ‌న సినిమాల బ‌డ్జెట్ మూడు, నాలుగు ల‌క్ష‌ల‌కు మించేది కాదు. కానీ ఈ సినిమాకు ఏడు నుంచి ఎనిమిది ల‌క్ష‌లు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. అంటే డ‌బుల్ బ‌డ్జెట్ అన్న‌మాట‌. అదెంత రిస్కో ఆ కాలం వాళ్ల‌కే తెలుసు. పైగా ఫ‌స్ట్ టైమ్ రాజ‌స్థాన్‌లోని థార్ ఎడారిలో, బ్యూటిఫుల్ లొకేష‌న్స్ ఉండే సిమ్లాలో ఈ సినిమాని షూట్ చేశారు. ఇవాళ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' సినిమాని తియ్య‌మంటే మ‌న డైరెక్ట‌ర్లు వంద నుంచి 150 రోజులు.. అంత‌కంటే ఎక్కువ టైమ్ కూడా తీసుకుంటారు. కానీ కృష్ణ త‌మ్ముళ్లు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావు ప్లానింగ్‌, కె.ఎస్‌.ఆర్‌. దాస్ స్పీడ్ డైరెక్ష‌న్ క‌లిసి.. ఈ సినిమాని 28 రోజుల్లో పూర్త‌య్యేట్లు చేశాయంటే ఎంత ఆశ్చ‌ర్యం! దాని వ‌ల్ల అనుకున్న ఏడు కోట్ల బ‌డ్జెట్‌లోపే ఈ సినిమాని తియ్య‌గ‌లిగారు. 

కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా విజ‌య‌నిర్మ‌ల న‌టించిన ఈ మూవీలో నాగ‌భూష‌ణం, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, త్యాగ‌రాజు, జ్యోతిల‌క్ష్మి, శాంత‌కుమారి, రావు గోపాల‌రావు, ధూళిపాళ‌, గోకిన రామారావు, కాక‌రాల‌, సాక్షి రంగారావు, జ‌గ్గారావు, ఎస్‌. వ‌ర‌ల‌క్ష్మి లాంటి మహామ‌హులు కీల‌క పాత్ర‌లు పోషించారు. చిన్న‌ప్ప‌టి కృష్ణ‌గా ఆయ‌న పెద్ద కొడుకు ర‌మేశ్‌బాబు న‌టించాడు. గుమ్మ‌డి ఓ అతిథి పాత్ర చేశారు.

క‌థ‌, మాట‌లు ఆరుద్ర రాసిన ఈ సినిమాకు ఆదినారాయ‌ణ‌రావు సంగీతం, వి.ఎస్‌.ఆర్‌. స్వామి  సినిమాటోగ్ర‌ఫీ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'కు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. నిజానికి ఈ సినిమాకు మొద‌ట అనుకున్న పేరు 'అదృష్ట‌రేఖ‌'. కానీ కౌబాయ్ సినిమాకు త‌గ్గ క‌మ‌ర్షియ‌ల్ టైటిల్ కావాల‌నునుకొని 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' అనే టైటిల్ నిర్ణ‌యించారు. 1971 ఆగస్ట్ 27న విడుద‌ల చేయ‌డానికి ముందుగా త‌న అభిమాన న‌టుడు ఎన్టీఆర్‌కు చూపించారు కృష్ణ‌. ఆయ‌న చూసి, "సినిమా చాలా బాగుంది. కానీ దీనితో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని మిస్స‌వుతున్నారు. నెక్ట్స్ టైమ్‌ మిస్ కాకుండా చూసుకోండి." అని చెప్పారు ఎన్టీఆర్‌.

అనేక‌మంది సందేహాల‌తో ఎదురుచూస్తుండ‌గా విడుద‌లైన 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' తొలిరోజే సూప‌ర్ హిట్ట‌నే టాక్‌ను సొంతం చేసుకుంది. బ్ర‌హ్మాండ‌మైన క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత కూడా ఎన్నిసార్లు ఈ సినిమా రిలీజైనా మంచి వ‌సూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. హాలీవుడ్ సినిమాల ప్రేర‌ణ‌తో తీసిన ఈ సినిమాని 'ద ట్రెజ‌ర్ హంట్' పేరుతో ఇంగ్లిష్‌లోకి డ‌బ్ చేసి, ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేయ‌డాన్ని అప్ప‌ట్లో ఎంతో గొప్ప‌గా చెప్పుకున్నారు. ఏకంగా 150 దేశాల్లో ఈ సినిమా విడుద‌ల‌వ‌డం ఏ ర‌కంగా చూసినా ఒక తెలుగు సినిమాకు సంబంధించిన చాలా అరుదైన విష‌యం.

'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' త‌ర్వాత కృష్ణ‌.. మొన‌గాడొస్తున్నాడు జాగ్ర‌త్త‌, మావూరి మొన‌గాళ్లు, నిజం నిరూపిస్తా, మంచివాళ్ల‌కు మంచివాడు, దొంగ‌ల దోపిడి.. లాంటి కౌబాయ్ సినిమాలు చేసి, ఇండియ‌న్ కౌబాయ్‌గా త‌న పేరు చిర‌స్థాయిగా నిల‌బ‌డేట్లు చేసుకున్నారు.