English | Telugu
డాన్స్ రాని కృష్ణ చేసిన క్లాసికల్ డాన్స్.. "మ్రోగింది ఢమరుకం.."!
Updated : May 31, 2021
కృష్ణ కెరీర్‌లోని ప్రత్యేకమైన చిత్రాల్లో 'ఏకలవ్య' (1982) ఒకటి. ఎన్టీఆర్ 'దానవీరశూర కర్ణ' చిత్రంతో వెలుగులోకి వచ్చిన కొండవీటి వెంకటకవితో ఈ సినిమా స్క్రిప్టు రాయించారు నిర్మాత ఎం.ఎస్. రెడ్డి. గురువుగా భావించిన ద్రోణాచార్యుడు అడిగిన వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా తన కుడిచేతి బొటనవేలును గురుదక్షిణగా సమర్పించిన మహాగొప్ప శిష్యుడు ఏకలవ్యుని కథతో అంతదాకా తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ సినిమా రాలేదు.
నిజానికి అదివరకు బాలకృష్ణతో ఒకసారి, శోభన్‌బాబుతో ఒకసారి ఏకలవ్య సినిమా చేయాలనుకున్న వేరే నిర్మాతల ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే ఏ విషయంలోనైనా సాహసాలు, ప్రయోగాలు చేయడానికి ముందుండే కృష్ణ.. ఆ సినిమా అవకాశం రావడాన్ని తన అదృష్టంగా భావించారు. 'అల్లూరి సీతారామరాజు' తర్వాత ఆయన ఎక్కువగా ఇష్టపడి, ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా 'ఏకలవ్య'. జయప్రద నాయికగా నటించిన ఈ చిత్రానికి విజయారెడ్డి దర్శకుడు.
ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది. బండరాళ్లలోనూ చైతన్యం తీసుకురావాలని ఏకలవ్యుడు తన దినచర్యలో భాగంగా సూర్యోదయానికి ముందు శివతాండవం చేస్తుంటాడు. సినిమాలో తొలి సన్నివేశం అదే. ఆ సందర్భంలోనే "మ్రోగింది ఢమరుకం.. మేల్కొంది హిమనగం.. సాగింది శివతాండవం.. శంభో శివం శంకరం" అంటూ పాట వస్తుంది. దీనికి సెమీ క్లాసికల్ డాన్స్ చేయాలి. కృష్ణకు క్లాసికల్ డాన్స్ రాదు. అయినా తనకు రాదని చెప్పి దేన్నీ వదిలేసే రకం కాదు కృష్ణ. ఆయన మొండిఘటం. ఆయనది.. తను చేసింది చూసి ఎవరేమనుకున్నా లక్ష్యపెట్టని స్వభావం.
కొరియోగ్రాఫర్ శ్రీను పర్యవేక్షణలో ఆ పాటకు అవసరమైన డాన్స్‌ను ప్రాక్టీస్ చేశారు కృష్ణ. ఆ తర్వాత మూడు రోజుల్లోనే ఆ పాట షూటింగ్‌ను ఆయన పూర్తి చేశారు. కృష్ణ అభిమానులకు బాగా నచ్చిన పాటల్లో, కృష్ణ చేసిన డాన్సుల్లో బాగా నచ్చిన డాన్సుల్లో ఇది ఒకటి. మల్లెమాల (ఎం.ఎస్. రెడ్డి) స్వయంగా రాసిన ఈ పాటను ఎస్పీ బాలు అద్భుతంగా గానం చేశారు. కె.వి. మహదేవన్ సంగీతం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది.