English | Telugu
వేషం అడిగిన కృష్ణ.. మూడేళ్ల తర్వాత కనిపించమన్న ఎన్టీఆర్!
Updated : May 29, 2021
మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోగా దివంగత ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు, తానే ఒక చరిత్రగా నిలిచారు. ఆయన ఫ్యాన్ అసోసియేషన్ ఎంత పవర్‌ఫుల్ అనేది అప్పటివాళ్లందరికీ తెలుసు. ఆయన తర్వాత ఫవర్‌ఫుల్ ఫ్యాన్ బేస్ కలిగిన మాస్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. రాజకీయంగా ఎన్టీఆర్‌ను కృష్ణ ఎంత వ్యతిరేకించినా, ఆయన అభిమాన నటుడు మాత్రం ఎన్టీఆరే. ఆయన స్ఫూర్తితోనే సినిమా నటుడు కావాలని ఆశపడి, ఆ ఆశను నిజం చేసుకున్నారు కృష్ణ. స్కూలు రోజుల నుంచే నందమూరి తారకరామారావు అభిమానిగా, ఆయన నటించే ప్రతి సినిమానూ చూస్తూ వచ్చారు కృష్ణ.
18 సంవత్సరాల వయసులో తన అభిమాన నటుడ్ని తొలిసారి వ్యక్తిగతంగా కలుసుకున్నారు కృష్ణ. అప్పుడు ఎన్టీఆర్ 'సీతారామ కల్యాణం' (1961)ను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అందులో రాముని వేషం తనకు ఇవ్వాల్సిందిగా అడిగారు. ఇంకా చిన్నవాడిలా కనిపిస్తున్న ఆయనను చూసి, "రాముని వేషానికి అప్పుడే నువ్వు సరిపోవు, లక్ష్మణుని వేషం ఇద్దామంటే, ఇప్పటికే దానికి శోభన్‌బాబును ఎంపిక చేశాను. మూడేళ్ల తర్వాత కనిపించు." అని చెప్పి పంపించారు ఎన్టీఆర్.
ఆయన చెప్పినట్లుగానే బుర్రిపాలెం వెళ్లిపోయి, మళ్లీ మూడేళ్ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు కృష్ణ. అయితే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లకుండా, ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో పడి, 'తేనె మనసులు' (1965)తో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎన్టీఆర్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు కృష్ణ.
ఆ తర్వాత రెండేళ్లకు తన అభిమాన నటుడితో కలిసి నటించే అవకాశం వచ్చింది కృష్ణకు. ఆ సినిమా 'స్త్రీజన్మ' (1967). డి. రామానాయుడు నిర్మించగా, కె.ఎస్. ప్రకాశరావు (కె. రాఘవేంద్రరావు తండ్రి) డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఎన్టీఆర్, కృష్ణ. గమనించాల్సిన విషయమేమంటే, కలిసి నటించిన ప్రతి సినిమాలోనూ ఆ ఇద్దరూ అన్నాతమ్ముళ్లుగా నటించడం. నిలువు దోపిడి (1968), విచిత్ర కుటుంబం (1969), దేవుడు చేసిన మనుషులు (1973), వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982) చిత్రాల్లో వారు బ్రదర్స్‌గానే నటించారు.