English | Telugu
అక్షరాలా రూ. 110.. విజయశాంతి తొలి సినిమా పారితోషికం!
Updated : Jul 4, 2021
ప్రముఖ దర్శకుడు భారతీరాజా పార్టనర్ ఒకాయన కారులో వెళ్తుండగా ఆ కారుకు పంక్చర్ అయింది. దాన్ని రిపేరుకు ఇచ్చి, అక్కడ ఎదురుగా కనిపించిన రవి ఫొటో స్టూడియోకు వెళ్లాడాయన. అక్కడ ఉన్న ఆల్బమ్స్‌లోని ఫొటోలను పరిశీలిస్తుంటే ఒకమ్మాయి ఫొటో బాగా నచ్చింది. ఆ ఫొటో, ఆమె ఇంటి అడ్రస్ ఇవ్వమని స్టూడియో ఓనర్‌ను అడిగాడు. ఆ ఓనర్ అందుకు నిరాకరించి, ఆ విషయాన్ని ఆ అమ్మాయి వాళ్ల నాన్నకు చెప్పారు. ఆ అమ్మాయి.. విజయశాంతి.
విశ్వశాంతి బ్యానర్ అధినేత విశ్వేశ్వరరావు రవి స్టూడియోలో తీయించిన ఆ స్టిల్స్‌ను భారతీరాజా యూనిట్‌లో పనిచేస్తున్న అంబి అనే ఆయన చూసి, "ఈ అమ్మాయి వాళ్ల నాన్న నాకు బాగా ఫ్రెండ్. మీకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తాను." అని చెప్పి, వాళ్ల ఇంటికి వెళ్లి, విజయశాంతి తండ్రితో మాట్లాడాడు. ఆయన సరేనని, తన కూతుర్ని వెంటబెట్టుకొని అంబితో కలిసి భారతీరాజా దగ్గరకు వెళ్లారు. వాళ్లను భారతీరాజాకు పరిచయం చేశాడు అంబి.
ఆ టైమ్‌లో భారతీరాజా 'కల్లుక్కుల్ ఈరమ్' అనే తమిళ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. హీరోయిన్‌గా కొత్తమ్మాయిని పరిచయం చేయాలని, అప్పటికే 300కు పైగా ఫొటోలు చూశారు. కానీ వారిలో ఎవరూ ఆయనకు నచ్చలేదు. వెంటనే విజయశాంతికి మేకప్ టెస్ట్ చేయించారు భారతీరాజా. తన హీరోయిన్ దొరికేసిందని ఆయనకు అనిపించింది. అలా.. 'కల్లుక్కుల్ ఈరమ్'తో హీరోయిన్‌గా గ్లామర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు విజయశాంతి. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అందుకున్న పారితోషికం.. అక్షరాలా 110 రూపాయలు!
ఆ తర్వాత విజయనిర్మల డైరెక్ట్ చేసిన 'కిలాడీ కృష్ణుడు' సినిమాలో హీరో కృష్ణ సరసన నాయికగా నటించడం ద్వారా తెలుగు చిత్రసీమలో కాలుపెట్టారు విజయశాంతి. ఆ తర్వాత ఆమె ఎలాంటి చరిత్ర సృష్టించారో, తెలుగు సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగారో మనం చూశాం.