English | Telugu

ఆ మేనరిజమ్స్‌ జనం నుంచి వచ్చినవే.. అందుకే అంత పాపులర్‌ అయ్యాయి!

హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. కేవలం అతని సినిమాలు సూపర్‌హిట్‌ అవ్వడం వల్లే అభిమానులు ఏర్పడరు. సినిమాల్లో అతని మేనరిజం, డైలాగ్స్‌ చెప్పే విధానం, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పద్ధతి.. ఇవన్నీ నచ్చితేనే అభిమానులు ఏర్పడతారు. ఏ హీరో అయినా మాస్‌, యాక్షన్‌ మూవీస్‌ ద్వారానే అభిమానుల్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మాస్‌ సినిమా అంటే హీరోకి ఏదో ఒక మేనరిజం ఉండాలి, అది సినిమాలో లెక్కకు మించిన సార్లు కనిపించాలి. అలా ఆడియన్స్‌కి పట్టే మేనరిజం క్రియేట్‌ చెయ్యడంలోనే ఆ హీరో సగం సక్సెస్‌ అవుతారు. అలా సొంతంగా మేనరిజమ్స్‌ని క్రియేట్‌ చేసి వాటిని ఎక్కువగా పాపులర్‌ చేసిన హీరో మెగాస్టార్‌ చిరంజీవి. తను సినిమాల్లో చూపించిన మేనరిజమ్స్‌ అన్నీ తనకు తాను అనుకొని చేసినవేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

‘నా సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్‌కి విచిత్రమైన మేనరిజమ్స్‌ ఉంటూ ఉంటాయి. వాస్తవానికి అవి నాకు నేనే అనుకున్నవి. అంటే.. నేను క్రియేట్‌ చేసినవి కావు. సొసైటీలో నిత్యం ఎంతో మందిని కలుస్తుంటాం. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు వాడే కొన్ని ఊత పదాల్ని మనం వింటూ వుంటాం. అయితే వాటిని అక్కడే మర్చిపోతుంటాం. కానీ, వాటిని పట్టుకొని, ఆ మాటల్ని పదే పదే అంటూ ఉంటే అదే మేనరిజంగా మారిపోతుంది. అలా.. చాలా సినిమాల్లో నేను కొన్ని ప్రత్యేకమైన మేనరిజమ్స్‌ చూపించాను. అవన్నీ జనం నుంచి వచ్చినవే. వాటిని నా సినిమాల్లో అనేకసార్లు ఉపయోగించడం వల్ల బాగా పాపులర్‌ అయ్యాయి.

నా సినిమాల్లోని మేనరిజమ్స్‌లో ఎక్కువగా పాపులర్‌ అయినవి ‘కొంచెం ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో..’, ‘బాక్సులు బద్దలయిపోతాయి’, ‘చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫాడిరచేస్తా..’ వంటి డైలాగ్స్‌, ఆ మేనరిజమ్‌ జనాల నుంచి తీసుకున్నవే. అవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ షూటింగ్‌ బొర్రా గుహల్లో జరుగుతున్న రోజులు. అక్కడికి చాలా మంది అభిమానులు వచ్చారు. వారిని లోపలికి అనుమతించకపోవడంతో దూరంగా ఉన్నారు. నేను, శ్రీదేవి ఇంకా యూనిట్‌ సభ్యులు లంచ్‌ చేస్తున్నాం. అదే టైమ్‌లో ఒక అభిమాని ‘బాసూ..’ అని గట్టిగా అరిచాడు. ఎవరా.. అని కుడివైపు తల తిప్పాను. ‘ఓసారి ఫేస్‌ లెఫ్ట్‌ టర్నింగ్‌ ఇచ్చుకో బాసూ..’ అని అరిచాడు. ‘ఘరానా మొగుడు’ చిత్రంలో ఎంతో పాపులర్‌ అయిన డైలాగ్‌ అలా పుట్టింది. 

అదే సినిమాలో నేను నమస్కారం చేసే విధానం తమాషాగా ఉంటుంది.  అది నిర్మాత రాశీమూవీస్‌ నరసింహారావుగారి నుంచి తీసుకున్నాను. ఎడమ చేతితో ముందువైపు షర్ట్‌ను పట్టుకొని కుడి చేతితో విచిత్రంగా నమస్కారం పెట్టేవారు. దాన్ని సినిమాలో పెడితే బాగుంటుంది అనిపించింది. ఎడమ చేతిని ముందు పెడితే బాగుండదు అనిపించి ఆ చేతిని వెనుక పెట్టి కుడిచేతితో నమస్కారం చేయడంతో అది జనానికి బాగా ఎక్కింది. అలాగే ‘రౌడీ అల్లుడు’ సినిమాలో ‘బాక్సులు బద్దలయిపోతాయి..’ అనీ, ‘నిజం గడ గడ కారుతుంది’ అనే డైలాగ్‌ మా ఫ్రెండ్‌ నుంచి తీసుకున్నాను. నేను సినిమాల్లోకి రాకముందు మా ఫ్రెండ్స్‌లో ఒకరిని ‘సినిమా ఎలా ఉందిరా’ అని అడిగితే ‘బొమ్మ అదిరిపోయింది. బాక్సులు బద్దలయిపోతాయి. గడగడ కారిపోతుంది’ అనేవాడు. ఈ డైలాగ్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని ‘చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్పాడిరచేస్తాను..’ అనే డైలాగ్‌ కూడా అలా తీసుకున్నదే. నిత్య జీవితంలో ఇలాంటి డైలాగులు మనకు తారసపడుతూనే ఉంటాయి. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేవిధంగా ఆ డైలాగులను ఉపయోగించడం వల్ల బాగా పాపులర్‌ అయ్యాయి’ అంటూ తన మేనరిజమ్స్‌ గురించి, డైలాగుల గురించి వివరించారు మెగాస్టార్‌ చిరంజీవి.