English | Telugu

షూటింగ్‌లో ఎద్దుతో నిజంగా ఫైట్‌చేసి చేతి ఎముక విర‌గ్గొట్టుకున్న ఎన్టీఆర్‌!

 

వ్య‌క్తిగ‌తంగా మంచి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న కొంత‌కాలం విజ‌య‌వాడ‌లో పొగాకు వ్యాపారం చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు చుట్ట కాల్చ‌డం బాగా అల‌వాట‌య్యింది. సినిమా హీరోకు పండ్లు తెల్ల‌గా క‌నిపించాల‌నీ, అలా క‌నిపించాలంటే చుట్ట కాల్చ‌కూడ‌ద‌నీ ఆయ‌న తొలి చిత్రం 'మ‌న‌దేశం' ద‌ర్శ‌కుడు ఎల్వీ ప్ర‌సాద్ చెప్పిన‌మాట విని వెంట‌నే మానేశారు.

ఊటీలో ఒక‌సారి షూటింగ్ కోసం వెళ్లిన‌ప్పుడు తెల్ల‌వారుజామున చ‌లికి త‌ట్టుకోలేక స‌ర‌దాగా ఆరుబ‌య‌ట కూర్చొని చుట్ట కాలుస్తుంటే చిన్న‌బ్బాయి జ‌య‌శంక‌ర్ కృష్ణ నిద్ర‌లేచి వ‌చ్చి, "నాన్న‌గారూ! మీరు చుట్ట కాలుస్తారా?" అని ఆశ్చ‌ర్యంగా అడిగాడు. అంత చిన్న‌పిల్లాడి ముందు దోషిగా నిల‌వాల్సి వ‌చ్చినందుకు సిగ్గుప‌డుతూ చుట్ట అవ‌త‌ల‌పారేసి మ‌ళ్లీ జీవితంలో చుట్ట ముట్టుకోలేదు.

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'ప‌ల్లెటూరి పిల్ల‌'. అందులో ఎద్దుతో పోరాడే స‌న్నివేశం ఉంది. "అస‌లే అది ఆస్ట్రేలియ‌న్ బుల్‌.. జాగ్ర‌త్త" అని డైరెక్ట‌ర్ బి.ఎ. సుబ్బారావు చెబుతూనే ఉన్నారు. "ఊరికే దాని కొమ్ములు ప‌ట్టుకుంటే చాలు.. క‌ట్ చెప్తాను" అన్నారు. రామారావు దాని కొమ్ములు ప‌ట్టుకొని నిజంగానే దాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఎద్దు ఊరుకోలేదు. ఆయ‌న‌ను ఎత్తి కింద‌ప‌డేసింది. త‌న శ‌రీరం బ‌రువంతా కుడిచేతి మీద మోప‌డంతో చెయ్యి ఎముక విరిగిపోయింది. దాంతో ఆయ‌న నొప్పితో అల్లాడిపోయారు. ఆయ‌న ప‌రిస్థితి చూసి చిత్తూరు నాగ‌య్య గ్లాసులో ప‌చ్చ‌టి ద్ర‌వాన్ని పోసుకువ‌చ్చి, "రామారావ్.. ఇది తాగిచూడు. నీకు బాధ తెలియ‌కుండా ఉంటుంది" అన్నారు.

రామారావు, "ఇది నొప్పులు త‌గ్గించే మందా?" అన‌డిగారు. నాగ‌య్య‌, "శ‌రీర బాధ‌లే కాదు, మాన‌సిక బాధ‌లు కూడా త‌గ్గించే మ‌త్తుమందు. తీసుకో" అన్నారు. అందుకు రామారావు, "నాగ‌య్య‌గారూ.. నా శ‌రీరంలో చెయ్యే కాదు, అవ‌య‌వాల‌న్నీ విరిగా ఈ మందు మాత్రం ముట్ట‌ను. ఇది తాగి నా జీవితాన్నే పెద్ద‌నొప్పిగా త‌యారుచేసుకోలేను" అన్నారు. ఆయ‌న భుజంత‌ట్టి, "శ‌భాష్.. నిగ్ర‌హ‌ప‌రుడివి. బాగా పైకి వ‌స్తావ్ నాయ‌నా" అని ఆశీర్వ‌దించారు.

నిర్మాత‌లు పుత్తూరు వైద్యుడిని పిలిపించి ఆయ‌న చేతికి క‌ట్టు క‌టించారు. మ‌రుస‌టి రోజు ఎన్టీఆర్ షూటింగ్‌కు సిద్ధ‌మై వ‌చ్చేస‌రికి డైరెక్ట‌ర్ స‌హా అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. డైరెక్ట‌ర్ సుబ్బారావు "వ‌ద్దు.. రెస్టు తీసుకో." అని ఎంత చెప్పినా ఆయ‌న విన‌లేదు. "నో రెస్ట్‌. ఫ‌ర్వాలేదు రండి." అని రెడీ అయ్యారు. అదీ రామారావు మొండిత‌నం, ప‌నిపై ఆయ‌న అంకిత‌భావం.