English | Telugu

ఈ ఫొటోలు ఎప్ప‌టివో తెలుసా? బాల‌య్య చేతుల్లోని చిన్నారి ఎవ‌రు?

 

ఎవ‌రి కుటుంబంలో అయినా చిన్నారి పాప మొట్ట‌మొద‌టి సారిగా కేరింత‌లు కొడితే ఆ ఆనందం, ఆ భావోద్వేగం వేరే! ఆ క‌ళ వేరే!! దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. అదే విధంగా నంద‌మూరి బాల‌కృష్ణ, వ‌సుంధ‌ర దంప‌తుల జీవితాల్లోకి ప్ర‌థ‌మ సంతానంగా 1987 డిసెంబ‌ర్ 21న‌ వ‌చ్చింది చిన్నారి బ్ర‌హ్మ‌ణి. అప్పుడు ఆమె తాత విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. బ్ర‌హ్మ‌ణి ఊయ‌ల ప‌వ‌ళింపు వేడుక 1988 ఫిబ్ర‌వ‌రి 28న‌ వారి ఇంట్లో క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.

ఈ వేడుక‌కు ఎన్టీఆర్ వ‌చ్చి, మ‌న‌వ‌రాలిని ఆశీర్వ‌దించి, ముద్దు చేస్తూ మురిసిపోయారు. న‌టులు జ‌గ్గ‌య్య‌, శివాజీ గ‌ణేశ‌న్‌, షావుకారు జాన‌కి, ద‌ర్శ‌కులు ఎల్వీ ప్ర‌సాద్‌, నిర్మాత బి. నాగిరెడ్డి, ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు త‌దిత‌ర ప‌లువురు ఉద్ధండులు విచ్చేసి బ్ర‌హ్మ‌ణిని ఆశీర్వ‌దించారు. 

ఎన్టీఆర్ పెద్ద‌కుమారుడు జ‌య‌కృష్ణ‌, బాల‌కృష్ణ ఆహ్వానితుల‌కు ఎదురేగి స్వాగ‌తం ప‌ల‌క‌గా, ఎన్టీఆర్ మంద‌స్మిత వ‌ద‌నంతో ఆ వేడుక‌కు హాజ‌రైన వారంద‌రినీ ప‌ల‌కించి, వారితో పాత జ్ఞాప‌కాల‌ను, ప‌రిచ‌యాల‌ను గుర్తుచేసుకుంటూ క‌బుర్లు చెప్ప‌డం విశేషం. మ‌ధుర ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లే మ‌ల్లె పందిళ్ల కింద అమ‌ర్చిన అల్పాహార విందుతో ఆనాటి వేడుక వైభ‌వంగా ముగిసింది.