English | Telugu
ఒకే సంవత్సరం మూడు భారీ బ్లాక్‌బస్టర్స్‌తో రికార్డు సృష్టించిన నటరత్న ఎన్.టి.రామారావు!
Updated : Jan 18, 2025
(జనవరి 18 ఎన్.టి.రామారావు వర్థంతి సందర్భంగా..)
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న అన్న ఎన్.టి.రామారావు ఎంతో మందికి ఆరాధ్య దైవం. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ, ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపిస్తే నిజంగా దేవుడనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగే ఛరిష్మా ఆయనలో ఉంది. దేవుడి పాత్రలే కాదు, ఏ పౌరాణిక పాత్ర పోషించినా నూటికి నూరుశాతం అందులో ఒదిగిపోయే అసమాన నటుడు ఎన్టీఆర్. ఆయన తెరపై కనిపించిన తొలి సినిమా ‘మనదేశం’ 1949 నవంబర్ 24న విడుదలైంది. ఆఖరి సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ 1993 అక్టోబర్ 21న రిలీజ్ అయింది. 44 సంవత్సరాల సినీ కెరీర్‌లో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక పాత్రల్లో కొన్ని వందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కెరీర్‌లో 1977 సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఏ హీరోకీ సాధ్యంకాని ఘనవిజయాలు, రికార్డులు సృష్టించారు ఎన్టీఆర్.
1977లో ఎన్.టి.రామారావు నటించిన ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘చాణక్య చంద్రగుప్త’, ‘మా ఇద్దరి కథ’, ‘యమగోల’, ‘ఎదురీత’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఆరు సినిమాల్లో మూడు సినిమాలు ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. వీటిలో జనవరి 14 సంక్రాంతికి విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ చిత్రానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కువ నిడివిగల చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. 22,450 అడుగులతో 4 గంటల 7 నిమిషాల ప్రదర్శన సమయం ఉంటుంది. అంతకుముందు రాజ్‌కపూర్ దర్శకత్వంలో రూపొందిన ‘మేరా నామ్ జోకర్’ చిత్రం 4 గంటల 20 నిమిషాలతో భారత దేశంలో ఎక్కువ నిడివిగల చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే 40 నిమిషాల సినిమాను కట్ చేయడంతో ‘దానవీరశూర కర్ణ’ చిత్రం ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. 4 గంటల 7 నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ 4 గంటల పాటు తెరపై కనిపించడం విశేషం. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన నందమూరి బాలకృష్ణకు ఇదే తొలి పౌరాణిక చిత్రం.
కర్ణ, దుర్యోధన, కృష్ణ పాత్రల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పౌరాణిక చిత్రాన్ని 43 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. 20 రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేశారు. అంత భారీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడంలో తనకు సహకరించిన యూనిట్ సభ్యులకు, స్టూడియో సిబ్బందికి డిసెంబర్ 17 రాత్రి నిజాం క్లబ్‌లో చక్కని విందు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా చేస్తూనే ‘అడవి రాముడు’ చిత్రాన్ని కూడా పూర్తి చేద్దామని మొదట అనుకున్నారు ఎన్టీఆర్. అయితే ‘దానవీరశూర కర్ణ’ చిత్రానికి పోటీగా హీరో కృష్ణ ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి ‘అడవిరాముడు’ చిత్రం కోసం ఇచ్చిన డేట్స్‌ని వెనక్కి తీసుకొని దానవీరశూర కర్ణ చిత్రాన్ని వేగంగా పూర్తి చేశారు. 10 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని 1977 జనవరి 14న 30 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి అప్పటికి రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా విడుదల సమయానికి అడవిరాముడు షూటింగ్ కోసం ముదుమలై ఫారెస్ట్‌లో ఉన్నారు ఎన్టీఆర్. దానవీరశూర కర్ణ సాధించిన విజయాన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు.
అడవిరాముడు ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా స్కోప్ చిత్రం. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కె.రాఘవేంద్రరావు చేసిన తొలి సినిమా కూడా ఇదే. అడవిరాముడు ఎన్టీఆర్ కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ మూవీగా చెప్పొచ్చు. లుక్ పరంగా, డాన్సుల పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా ఎన్టీఆర్‌ను రాఘవేంద్రరావు చూపించిన విధానాన్ని ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు పాటలు అద్భుతంగా తియ్యగలరు అని ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది. కేవలం పాటల కోసమే ఈ సినిమాకి రిపీట్ అడియన్స్ వచ్చేవారంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు, ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. పాటను విపరీతంగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు స్క్రీన్‌పైకి డబ్బులు విసిరేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక పాట కోసం థియేటర్‌లో డబ్బులు విసిరేయడం అనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది. 40 ప్రింట్లతో 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అంతకుముందు దానవీరశూర కర్ణ పేరుతో ఉన్న రికార్డును క్రాస్ చేసింది.
అడవిరాముడు తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో మరో భారీ హిట్ సినిమా యమగోల. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన దేవాంతకుడు చిత్రంలో కూడా యముడ్ని టీజ్ చేయడం అనే అంశం ఉంటుంది. అదే ఫార్ములాతో రూపొందిన సినిమా యమగోల. ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే 27 రోజుల్లోనే టాకీ పూర్తి కావడం విశేషం. తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజ్‌కి సిద్ధమైంది. అడవిరాముడు ప్రదర్శిస్తున్న థియేటర్లలోనే యమగోల చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలనుకున్నారు నిర్మాత వెంకటరత్నం. అయితే అడవిరాముడు వంద రోజులు పూర్తయినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. దీంతో పంపిణీదారులు యమగోల చిత్రానికి వేరే థియేటర్లు ఇస్తామని చెప్పారు. కానీ, నిర్మాత ఒప్పుకోలేదు. అయితే 175 రోజులు పూర్తయ్యేవరకు ఆగాల్సిందేనని పంపిణీదారులు అన్నారు. దానికి కూడా సిద్ధపడ్డారు నిర్మాత వెంకటరత్నం. అడవిరాముడు 175 పూర్తయినా కలెక్షన్లు తగ్గలేదు. కానీ, అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాను తీసేసి ఆ స్థానంలో యమగోల చిత్రాన్ని ప్రదర్శించారు. ఆగస్ట్‌లో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తను అనుకున్న థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు రెండు నెలలు వెయిట్ చేసిన నిర్మాత ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.
సినిమాలకు ముఖ్యమైన సీజన్స్‌గా చెప్పుకునే సంక్రాంతి, సమ్మర్, దసరా సందర్భంగా విడుదలైన దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్‌లో అతిముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఇక మిగతా మూడు సినిమాల్లో చాణక్య చంద్రగుప్త చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఎందుకంటే 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జునయుద్ధం తర్వాత ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నటించలేదు. 14 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా చాణక్య చంద్రగుప్త. అంతేకాదు, తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ ఈ సినిమాలో అలెగ్జాండర్‌గా ఓ కీలక పాత్ర పోషించారు. కానీ, ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం విడుదలైన ఎదురీత చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్.స్వామి సమర్పణలో శాఖమూరి రామచంద్రరావు నిర్మించారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో మా ఇద్దరి కథ చిత్రం విడుదలైంది. మొదట ఈ సినిమాలో హీరోగా ఎఎన్నార్‌ను ఎంపిక చేశారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. 25 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. షూటింగ్ మొదలయ్యే సమయానికి ఎఎన్నార్‌కు గుండెపోటు రావడంతో వైద్యం కోసం ఆయన్ని అమెరికా తీసుకెళ్లారు. తను తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు ఎఎన్నార్. అప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. అలా 1977లో విడుదలైన 6 సినిమాల్లో మూడు సినిమాలు చరిత్ర సృష్టించగా, మూడు సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి.