English | Telugu
ఇండియాలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఎల్.వి.ప్రసాద్ సొంతం!
Updated : Jan 16, 2025
(జనవరి 17 దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జయంతి సందర్భంగా..)
ఎల్.వి.ప్రసాద్.. ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు. సాధారణ వ్యక్తి నుంచి సినీ పరిశ్రమలో ఓ శక్తిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. చేసే పనిపట్ల గౌరవం, అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మేధావి. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఏళ్ళ తరబడి నిరీక్షించి విజయం సాధించిన నిత్య కృషీవలుడు. తను నటుడిగా, దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ కెమెరామెన్‌గా, థియేటర్ గేట్‌మెన్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. అన్ని శాఖల్లోనూ విశేష అనుభవం సంపాదించి తన కెరీర్‌కి గట్టి పునాది వేసుకున్నారు. సినిమా పరిశ్రమలో ఒక మహోన్నత వ్యక్తిగా ఎల్.వి.ప్రసాద్ ఎదగడం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతటి శ్రమ ఉంది అనే విషయాల గురించి ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1908 జనవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు ఎల్.వి.ప్రసాద్. ఆయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు. రైతు కుటుంబంలో జన్మించిన ప్రసాద్ చురుకైన వాడే అయినప్పటికీ చదువుపై శ్రద్ద పెట్టేవారు కాదు. నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపులు ఆయన్ని ఆకర్షించేవి. పాత సినిమా రీళ్లను ప్రదర్శించే గుడారాల్లో వాటిని ఆసక్తిగా చూసేవారు. స్థానికంగా కొందరు ప్రదర్శించే నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. అది సినిమాలపై ఆసక్తిని పెంచింది. 17 ఏళ్ళ వయసులో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను 1927లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి జన్మించింది. ప్రసాద్ తండ్రి శ్రీరాములు అప్పుల బాధ భరించలేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితికి వచ్చేశారు. దీంతో తనలోని నటనా ప్రతిభను జీవనోపాధికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో 1930లో వంద రూపాయలు తీసుకొని ఎవరికీ చెప్పకుండా బొంబాయి చేరుకున్నారు ప్రసాద్.
బొంబాయిలోని వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు 15 రుపాయల వేతనంతో చిన్నచిన్న పనులు చేసేందుకు అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. 1931లో ఇంపీరియల్ ఫిలింస్ నిర్మించిన భారతదేశపు మొదటి టాకీ ఆలం ఆరా చిత్రంలో నాలుగు చిన్న చిన్న పాత్రల్లో నటించారు ప్రసాద్. ఆ సంస్థ ద్వారా దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి పరిచయమయ్యారు. ఆయన నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాస్‌లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగులో నిర్మించిన తొలి టాకీ భక్త ప్రహ్లాద చిత్రంలో నటించారు ప్రసాద్. అలా భారతదేశంలో మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత సాధించారు ఎల్.వి.ప్రసాద్. కాళిదాస్, భక్త ప్రహ్లాద చిత్రాలు విజయం సాధించడంతో తన భార్యను బొంబాయి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో జీవనోపాధి కోసం డ్రీమ్‌ల్యాండ్ థియేటర్‌లో గేట్ కీపర్‌గా చేరారు. ఆ సమయంలోనే హెచ్.ఎం.రెడ్డి నిర్మిస్తున్న సతీసావిత్రి చిత్రంలో నటిస్తూనే రాత్రి వేళ గేట్ కీపర్‌గా పనిచేశారు.
ప్రసాద్‌లోని టాలెంట్, కష్టపడే తత్వం హెచ్.ఎం.రెడ్డికి బాగా నచ్చాయి. దాంతో అతన్ని హీరో చెయ్యాలనుకొని మాయల ఫకీరు పేరుతో ఓ సినిమాను ప్రారంభించారు. కానీ, అదే సమయంలో బాలనాగమ్మ పేరుతో రెండు సినిమాలు ప్రారంభం కావడంతో అదే కథతో సినిమా ఎందుకు చెయ్యడం అని దాన్ని ఆపేశారు. అయితే ప్రసాద్‌కి ఇచ్చిన మాట మర్చిపోలేదు. ఆ తర్వాత ఘరానా దొంగ అనే టైటిల్‌తో సినిమా ప్రారంభించారు. అందులో ప్రసాద్ హీరో. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. 1930లో బొంబాయికి వెళ్ళిన నాటి నుంచి 1945 వరకు అంటే 15 సంవత్సరాలపాటు ఎల్.వి.ప్రసాద్ ఎన్నో కష్టాలు అనుభవించారు. భారతదేశంలో ప్రారంభమైన మూడు తొలి టాకీల్లో నటించిన ఘనత సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ కెమెరామెన్‌గా, థియేటర్ గేట్‌మెన్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా.. ఇలా అన్ని శాఖల్లో మంచి అనుభవం సంపాదించుకున్నారు.
1943 ప్రాంతంలో త్రిపురనేని గోపీచంద్ కథ, దర్శకత్వంలో పెంకి పిల్ల అనే సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో మరో దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు.. ఎల్.వి.ప్రసాద్ పేరు సూచించారు. బొంబాయిలో ఉన్న ఆయన్ని మద్రాస్ తీసుకొచ్చారు. కథ విన్న ప్రసాద్ మొదట టైటిల్ నెగెటివ్‌గా ఉందని, గృహప్రవేశం అనే టైటిల్ బాగుంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు, కథలో కూడా కొన్ని మార్పులు చెప్పారు. అవన్నీ విన్న గోపీచంద్, చిత్ర యూనిట్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమాని ఎల్.వి.ప్రసాద్ డైరెక్ట్ చేస్తేనే న్యాయం జరుగుతుందని భావించారు. అలా గృహప్రవేశం చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా మారారు. అప్పటికే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న భానుమతి ఆయనకు జంటగా నటించారు. 1946లో విడుదలైన గృహప్రవేశం చిత్రం ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత పల్నాటి యుద్ధం, ద్రోహి చిత్రాలు కూడా డైరెక్ట్ చేశారు ప్రసాద్. 1949లో ఆయన డైరెక్షన్‌లో వచ్చిన మరో సినిమా మనదేశం. ఈ సినిమా ద్వారా మహానటుడు ఎన్.టి.రామారావును తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు ప్రసాద్. 1950లో ప్రసాద్ దర్శకత్వంలోనే విజయా వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకారు విడుదలైంది. ఎన్.టి.రామారావు పూర్తి స్థాయి హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. అదే సంవత్సరంలో ఎన్.టి.రామరావు, అక్కినేని నాగేశ్వరరావు సోదరులుగా నటించిన సంసారం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 1955లో ప్రసాద్ రూపొందించిన మిస్సమ్మ ఒక చరిత్ర సృష్టించింది. తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఎల్.వి.ప్రసాద్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత పెళ్లిచేసిచూడు, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలు ఘనవిజయం సాధించి దర్శకుడిగా ప్రసాద్‌కి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టాయి. ఆయన నటించిన సినిమాలు 15, దర్శకత్వం వహించిన సినిమాలు 30, ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఆయన నిర్మించిన సినిమాలు 32. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లో ఎల్.వి.ప్రసాద్ సినిమాలు చేశారు.
ఎల్.వి.ప్రసాద్ సినిమాల ద్వారా సంపాదించినదంతా సినిమా పరిశ్రమ అభివృద్ధికే ఉపయోగించారు. ప్రసాద్ కలర్ లాబరేటరీస్, ప్రసాద్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ఇఎఫ్‌ఎక్స్, ప్రసాద్ ఐమాక్స్.. ఇలా వివిధ శాఖల్లో సినిమాను అభివృద్ధి చేశారు. అంతేకాదు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అనుగుణంగా 1987లో హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి పేదలకు కంటి వైద్యాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి 277 విజన్ సెంటర్స్ ఉన్నాయి. సినిమా రంగానికి, సమాజానికి ఎల్.వి.ప్రసాద్ చేసిన సేవకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఒక రహదారికి ఎల్.వి.ప్రసాద్ మార్గ్ అని పేరు పెట్టారు.