English | Telugu

555 సిగరెట్‌ వల్ల తొలి అవకాశాన్ని చేజార్చుకున్న కృష్ణంరాజు!

555 సిగరెట్‌ వల్ల తొలి అవకాశాన్ని చేజార్చుకున్న కృష్ణంరాజు!

(జనవరి 20 కృష్ణంరాజు జయంతి సందర్భంగా...)

మహానటులుగా, పెద్ద స్టార్స్‌గా ఎదిగిన వారంతా తొలిరోజుల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన వారే. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఎన్నో కష్టాలు పడినవారే. అయితే కొందరు మాత్రం క్రమశిక్షణా లోపం వల్ల చేజేతులా అవకాశాల్ని వదులుకుంటూ వుంటారు. తర్వాతి కాలంలో తమ తప్పును సరిదిద్దుకొని ఎన్నో మంచి సినిమాల్లో నటించి స్టార్స్‌గా ఎదిగారు. అలాంటివారిలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఒకరు. స్వతహాగా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన కృష్ణంరాజు.. కొందరు నటుల్లా తొలిరోజుల్ని పస్తులతో గడపలేదు. అయితే అతనికి సినిమాల్లో నటించాలనిగానీ, హీరో అయిపోవాలని గానీ కోరిక లేదు. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత స్టార్‌ హీరో అయిపోయారు. 

హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన కృష్ణంరాజుకు చిన్నతనం నుంచీ ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర రకరకాల కెమెరాలు కూడా ఉండేవి. ఆ అభిరుచితోనే హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఓ ఫోటో స్టూడియోను ప్రారంభించారు. ఆ స్టూడియోలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే వ్యక్తి.. కృష్ణంరాజును రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసి డిస్‌ప్లేలో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన కొందరు.. సినిమా హీరోలా ఉన్నావని అనేవారు. ఆ క్రమంలోనే ఒక వ్యక్తి కృష్ణంరాజు దగ్గరికి వచ్చి సినిమాల్లో అవకాశమిప్పిస్తానని మద్రాస్‌ తీసుకెళ్లాడు. మేకప్‌ టెస్ట్‌ కూడా చేయించాడు. కానీ, ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత తను మోసపోయానని గ్రహించారు కృష్ణంరాజు. విషయం తెలిస్తే స్నేహితుల దగ్గర అవమానం తప్పదని భావించిన ఆయన హైదరాబాద్‌ వచ్చి స్టూడియోను అమ్మేసి ఆ డబ్బుతో మద్రాస్‌ వెళ్లిపోయారు. ఎలాగైనా సినిమాల్లో అవకాశం సంపాదించాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. 

అదే సమయంలో వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు సుందర్‌లాల్‌ నహతా, డూండీ. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు. టైటిల్‌ రోల్‌లో నటించేందుకు ఒక అందమైన, చురుకైన యువకుడి కోసం చూస్తున్నారు. అంతకుముందు వచ్చిన నర్తనశాల, పాండవవనవాసం చిత్రాల్లో అభిమన్యుడిగా హరనాథ్‌ నటించారు. కాబట్టి అతన్నే తీసుకుందామని నిర్మాత డూండీ అన్నారు. కానీ, దానికి మధుసూదనరావు ఒప్పుకోలేదు. రొటీన్‌గా వెళ్ళడం ఎందుకు ఎవరైనా కొత్త కుర్రాడిని పరిచయం చేద్దాం అన్నారు. ఈ డిస్కషన్‌ జరిగిన రోజు డూండీ మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్‌కి వెళ్లారు. అక్కడ కనిపించిన కృష్ణంరాజు ఆయన్ని ఆకర్షించారు. ఆరడుగులపైన ఎత్తు ఉన్న కృష్ణంరాజు అభిమన్యుడు పాత్రకు సరిపోతాడనిపించింది. అతను కూడా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న డూండీ.. తాము చేస్తున్న సినిమా వివరాలు చెప్పి ఆఫీస్‌కి రమ్మన్నారు. 

మరుసటి రోజు డూండీ చెప్పిన అడ్రస్‌కి వెళ్ళారు కృష్ణంరాజు. అక్కడ డూండీ ఉన్నారుకానీ డైరెక్టర్‌ మధుసూదనరావు లేరు. ఆయన వచ్చే వరకు వెయిట్‌ చెయ్యమని కృష్ణంరాజుకు చెప్పారు డూండీ. బయట హాల్‌లోకి వచ్చారు కృష్ణంరాజు. అప్పట్లో ఆయనకు 555 సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. అందుకే వెయిట్‌ చేసే క్రమంలో మధ్య మధ్య బయటికి వెళ్లి సిగరెట్‌ తాగేవారు. అలా కొన్ని గంటల సేపు ఎదురుచూసినా డైరెక్టర్‌ రాకపోవడంతో ఏమీ తోచక బయటికి వచ్చారు. అలా వస్తున్నప్పుడు 555 సిగరెట్‌ ప్యాకెట్‌ను బల్లమీద మర్చిపోయారు. కృష్ణంరాజు అలా బయటికి వెళ్లిన కొద్ది సేపటికే డైరెక్టర్‌ మధుసూదనరావు ఆఫీస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. వచ్చీ రావడంతోనే టేబుల్‌పై ఉన్న సిగరెట్‌ ప్యాకెట్‌ను చూశారు. డైరెక్టర్‌గారు వచ్చారన్న విషయం తెలుసుకున్న కృష్ణంరాజు ఆఫీస్‌లోకి వెళ్లారు. అప్పుడు మధుసూదనరావు అడిగిన తొలి ప్రశ్న ‘ఆ బల్లమీద ఉన్న సిగరెట్‌ ప్యాకెట్‌ నీదేనా?’ అని. దానికి కృష్ణంరాజు ‘నాదే సార్‌’ అని చెప్పారు. ‘నీకు మా సినిమాలో అవకాశం ఇవ్వడం లేదు. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అని నిక్కచ్చిగా చెప్పారు మధుసూదనరావు. అప్పటివరకు ఆయన కోసం వెయిట్‌ చేసిన కృష్ణంరాజుకు కోపం వచ్చింది. చిన్నతనం నుంచి కాస్త దుందుడుకుగా ఉండే ఆయన డైరెక్టర్‌ మధుసూదనరావుపై తన కోపాన్ని ప్రదర్శించారు. ‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇస్తానంటేనే నేను వచ్చాను. ఇప్పుడు లేదంటే ఎలా’ అంటూ నిలదీశారు. దానికి మధుసూదనరావు ‘నాకు సిగరెట్‌ తాగేవాళ్ళంటే ఇష్టం ఉండదు. నాకోసం నీ అలవాట్లు మార్చుకోవడం నాకిష్టం లేదు. అలాగే సిగరెట్‌ తాగేవాళ్ళకు అవకాశం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు’ అని చెప్పారు. ఆ మాటతో చేసేది లేక వెనుదిరిగారు కృష్ణంరాజు. అలా ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ వల్ల మంచి అవకాశాన్ని వదులుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత అభిమన్యుడి పాత్రలో శోభన్‌బాబును తీసుకున్నారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత ‘చిలకా గోరింకా’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు.