English | Telugu

ఎన్టీఆర్ మెచ్చిన ఇళ‌య‌రాజా 'నా ప‌రువం నీ కోసం' పాట‌!

 

నట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు, మేస్ట్రో ఇళ‌య‌రాజా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏకైక ఫిల్మ్ 'యుగంధ‌ర్' (1976). అది హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన క‌ల్ట్ ఫిల్మ్ 'డాన్' (1978)కు రీమేక్‌. కె.ఎస్‌.ఆర్‌. దాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో జ‌య‌సుధ హీరోయిన్‌గా న‌టించ‌గా, జ‌గ్గ‌య్య‌, స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భాక‌ర‌రెడ్డి, కాంతారావు, త్యాగ‌రాజు, జ‌య‌మాలిని లాంటి ప్ర‌ముఖ న‌టులు అందులో న‌టించారు. ఈ చిత్రానికి నిర్మాత ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మ్యాన్ పీతాంబ‌రం. ఈయ‌న ఎవ‌రో కాదు, 'చంద్ర‌ముఖి' డైరెక్ట‌ర్ పి. వాసు తండ్రి.

అప్పుడే త‌మిళ సినిమాల‌తో దుమ్మురేపుతున్న ఇళ‌య‌రాజాను సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకుందామ‌ని పీతాంబ‌రం అంటే కె.ఎస్‌.ఆర్‌. దాస్ అంగీక‌రించారు. ఒరిజిన‌ల్ 'డాన్' సినిమా మొద‌ట్లో వ‌చ్చే 'యే మేరా దిల్' సాంగ్ సూప‌ర్ పాపుల‌ర్ అయింది. దాని ట్యూన్‌ను య‌థాత‌థంగా వాడుకుందామ‌ని డైరెక్ట‌ర్ అంటే, ఇళ‌య‌రాజా ఒప్పుకోలేదు. "దానిక‌న్నా గొప్ప‌గా పాట ఇస్తాను.. చూడండి" అని చెప్పారు. చెప్పిన‌ట్లే, 'నా ప‌రువం నీ కోసం' అనే పాట ట్యూన్ ఇచ్చారు. సినారె రాసిన ఆ పాట నాటి కాలంలో యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది.

'డాన్‌'లో అమితాబ్ పాన్ న‌ములుతూ ఖ‌య్‌కే పాన్ బ‌నార‌స్‌వాలా' అంటూ పాడే పాట కూడా బ్లాక్‌బ‌స్ట‌రే. నిజానికి 'డాన్' అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది ఆ పాటే. దేశాన్నంతా ఓ ఊపు ఊపిన ఆ సాంగ్‌ను మాత్రం ఎట్లాగైనా తెలుగులో పెట్టాల‌న్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇళ‌య‌రాజా ఒప్పుకోలేదు. కె.ఎస్‌.ఆర్‌. దాస్ ప‌ట్టు స‌డ‌లించినా, పీతాంబ‌రం అంగీక‌రించ‌లేదు. "ఒక పాట‌కు నీ మాట విన్నాం. ఈ పాట‌కు మా మాట విను." అని గ‌ట్టిగా చెప్పారు. ఆయ‌న‌ను బాధ‌పెట్ట‌డం ఇష్టంలేక‌, త‌న మ‌న‌సు అంగీక‌రించ‌క‌పోయినా, ఒరిజిన‌ల్ సాంగ్‌ను అనుక‌రిస్తూ 'ఓర‌బ్బా వేసుకున్నా కిళ్లీ' పాట‌కు ట్యూన్ క‌ట్టారు ఇళ‌య‌రాజా.

పాట‌ల‌న్నీ అయిపోయాయి. ఎన్టీఆర్ విన్నారు. ఆయ‌న‌కు 'నా ప‌రువం నీ కోసం' తెగ న‌చ్చేసింది. "'యే మేరా దిల్' క‌న్నా ఈ పాటే బాగుంది బ్ర‌ద‌ర్‌. ఆ కుర్రాడు బాగా పైకి వ‌స్తాడు." అని కె.ఎస్‌.ఆర్‌. దాస్‌తో అన్నారు ఎన్టీఆర్‌. ఈ పాట‌ను ఎన్టీఆర్‌, జ‌య‌మాలినిపై చిత్రీక‌రించారు.