English | Telugu

తండ్రితో ఖుష్‌బూ ప‌డిన క‌ష్టాలు ప‌గ‌వాడికి కూడా వ‌ద్దు.. అంత న‌ర‌కం చూశారు!!

 

ఒక సాధార‌ణ ముస్లిం కుటుంబంలో జ‌న్మించిన ఖుష్‌బూ త‌ర్వాత కాలంలో త‌న‌కు ప్ర‌జ‌లు గుడిక‌ట్టి ఆరాధించే స్థాయిలో న‌టిగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకోవ‌డం ఆషామాషీ విష‌యం కాదు. వెంక‌టేశ్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయిన 'క‌లియుగ పాండ‌వులు' సినిమాతోటే ఖుష్‌బూ కూడా ద‌క్షిణాదిన హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. త‌మిళ ప్ర‌జానీకానికి ఆమె మ‌రింత చేరువై, వారి ఆరాధ్య‌తార అయ్యారు. వారామెకు గుడి క‌ట్టి పూజించారు కూడా. త‌మిళ ద‌ర్శ‌కుడు సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు.. అవంతిక‌, ఆనందిత‌.

ఖుష్‌బూ చిన్న‌నాడు చాలా బాధ‌లు అనుభ‌వించింద‌నీ, తండ్రి చేతుల్లో చాలా హింస ఎదుర్కొన్న‌ద‌నీ మ‌న‌లో చాలామందికి తెలీదు. ఆమె త‌ల్లిని కూడా ఆయ‌న చావ‌గొట్టేవాడు. అందుకే తండ్రి అంటే ఆమెకు అస‌హ్యం, ద్వేషం. ఆయ‌న పేరును త‌ల‌చుకోవ‌డానికి కూడా ఆమె ఇష్ట‌ప‌డ‌దు. చివ‌రిసారిగా ఆమె త‌న తండ్రిని చూసింది 35 ఏళ్ల క్రింద‌ట అంటే న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా అది నిజం.

'ద బ‌ర్నింగ్ ట్రైన్' (1978) చిత్రంతో బాల‌న‌టిగా ఖుష్‌బూ కెరీర్ మొద‌లైంది. ఆమె అస‌లు పేరు న‌ఖ‌త్ ఖాన్‌. ఆ సినిమా సెట్స్ మీదే న‌ఖ‌త్ కాస్తా ఖుష్‌బూగా మారిపోయింది. న‌ఖత్ అంటే ఉర్దూలో సువాస‌న అని అర్థం. హిందీలో దానికి అర్థం ఖుష్‌బూ. అందుకే ఖుష్‌బూ అనే పేరు పెట్టారు. బాల‌న‌టిగా బిజీ అయ్యిందామె. ఆమె సినిమాల్లో అడుగుపెట్టాక త‌ల్లి ఆమెకు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. తండ్రికి ఆమె తెచ్చే డ‌బ్బు ఆనందాన్నిచ్చేది.

ఆయ‌న చేతుల్లో త‌ల్లి, ఖుష్‌బూ నానా న‌ర‌కం అనుభ‌వించారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిట్ట‌డ‌మే కాకుండా, ఇంట్లో ఉన్న అంద‌ర్నీ ఆమె అన్న‌ల‌తో సహా విప‌రీతంగా కొట్టేవాడు. త‌న త‌ల్లిపేరు న‌జ్మా ఖాన్ అని చెప్పిన ఖుష్‌బూ, తండ్రి పేరును ఉచ్ఛ‌రించ‌డానికి కానీ, క‌నీసం త‌ల‌చుకోడానికి కానీ ఇష్ట‌ప‌డ‌దు. త‌న‌కు త‌ల్లితో త‌ప్ప తండ్రితో ఎలాంటి ఆనంద‌క‌ర క్ష‌ణాలు లేవ‌ని ఆమె అంటారు. ఆమె షూటింగ్‌లో ఉంటే నేరుగా సెట్స్ మీద‌కు వ‌చ్చి అంద‌రి ముందే కొట్టేవాడ‌ని ఖుష్‌బూ చెప్పారు.

ఎదిగేకొద్దీ, డ‌బ్బు గురించి అర్థం చేసుకోవ‌డం మొద‌లుపెట్టింది ఖుష్‌బూ. త‌న సంపాద‌న అంతా ఎక్క‌డికి వెళ్తోంద‌న్న ప్ర‌శ్న‌లు రేకెత్తాయి. కూతురు అడిగేస‌రికి తండ్రికి కోపం వ‌చ్చింది. ఆమెనూ, ఆమె త‌ల్లినీ ముంబై నుంచి చెన్నైకు తీసుకొని వ‌చ్చాడు. అప్పుడు ఖుష్‌బూకు 16 ఏళ్లు. అప్పుడే 'క‌లియుగ పాండ‌వులు' సినిమా చేస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో ఆమెను హీరోయిన్‌గా లాంచ్ చేయాల‌ని బోనీ క‌పూర్ ప్లాన్ చేశారు. ఆ సినిమాతో పాటు, మ‌రో మంచి ఆఫ‌ర్ కూడా తండ్రి కార‌ణంగా మిస్స‌యింది.

ఆర్‌.ఎ. పురంలోని 6వ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో వాళ్ల‌ను దించేసి, తండ్రి ముంబై వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఖుష్‌బూ బ్యాంక్ అకౌంట్‌లోని డ‌బ్బునంతా ఖాళీ చేశాడు. దీంతో కుటుంబ బాధ్య‌త‌ను త‌న చేతుల్లోకి తీసుకుంది ప‌ద‌హారేళ్ల ఖుష్‌బూ. 'మేరీ జంగ్‌'లో ఖుష్‌బూను చూసిన వెంక‌టేశ్‌, 'క‌లియుగ పాండ‌వులు'లో ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఆమెను తండ్రి నుంచి ఆ చిత్ర నిర్మాత డి. రామానాయుడు, ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కాపాడుతూ వ‌చ్చేవారు. రామానాయుడును ఆయ‌న డ‌బ్బు అడిగిన‌ప్పుడ‌ల్లా, అప్ప‌టికే ఇచ్చేశామ‌ని ఆయ‌న‌కు అబద్ధంచెప్పి, నేరుగా రెమ్యూన‌రేష‌న్ అమౌంట్‌ను ఖుష్‌బూ చేతికి ఇచ్చేవారు రామానాయుడు. ఇది ఖుష్‌బూ తండ్రికి కోపం తెప్పించాయి. త‌న‌తో నిమిత్తం లేకుండా కూతురు జీవితంలో ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న గ్ర‌హించాక‌, ప‌రిస్థితులు ఓ కొలిక్కి వ‌చ్చాయి.

చెన్నైలో ఖుష్‌బూ, ఆమె త‌ల్లి నివాసం ఉంటున్న ఇంటికి వ‌చ్చిన ఆయ‌న‌కు అక్క‌డ కూతురు కొత్త‌గా కొనుక్కున్న మారుతీ వ్యాన్ క‌నిపించింది. కోపంతో దాని విండ్‌షీల్డ్‌ను ప‌గ‌ల‌గొట్టాడు. అప్ప‌టికి ఆ కారు కొని రెండంటే రెండు రోజులే అయ్యింది. "తిరిగి బాంబేకి తీసుకువెళ్ల‌మ‌ని అడుక్కోవ‌డానికి నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తావు." అని ఆయ‌న అరిస్తే, "ఇంట్లోవాళ్లంద‌ర్నీ చంపి, నేను చ‌స్తాను కానీ మ‌ళ్లీ నీ ద‌గ్గ‌ర‌కు రాను." అని అంతే గ‌ట్టిగా అరిచి చెప్పింది ఖుష్‌బూ. అంతే.. ఆ త‌ర్వాత ఆమె త‌న తండ్రిని చూసింది లేదు.