English | Telugu

డైరెక్ట‌ర్ మ‌హేశ్ భ‌ట్ లేకుండా రిస్కీ షాట్ చేసిన మెగాస్టార్‌.. చేయి కాలింది!

 

డూప్‌ల‌తో యాక్ష‌న్ సీన్లు చేసే తెలుగు సినిమాకు అస‌లు సిస‌లు యాక్ష‌న్ సీన్ల‌ను ప‌రిచ‌యం చేసింది మెగాస్టార్. అనూహ్య‌మైన వేగం అవ‌స‌ర‌మైన ప‌లు యాక్ష‌న్ సీన్ల‌ను డూప్ లేకుండా చేస్తూ వెండితెర‌పై అస‌లు సిస‌లు యాక్ష‌న్ స్టార్‌గా అవ‌త‌రించారు చిరంజీవి. 'కిరాయి రౌడీలు', 'కిరాత‌కుడు' సినిమాల కాలం నుంచి ప‌లు సినిమాల్లో ఆయ‌న చేసిన ఫైట్లు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌చ్చాయి. ఫ‌లితంగా మాస్ ఆడియెన్స్‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను ఆయ‌న సంపాదించుకున్నారు. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న రిస్క్‌తో చేసిన ఫైట్లు చూడ్డానికి డైరెక్ట‌ర్లు కూడా భ‌య‌ప‌డ్డ సంద‌ర్భాలున్నాయి.

ఆ త‌ర‌హా సంద‌ర్భ‌మే హిందీ సినిమా 'ద జెంటిల్‌మ‌న్' సెట్స్‌పై చోటు చేసుకుంది. అర్జున్ హీరోగా శంక‌ర్ డైరెక్ట్ చేయ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'జెంటిల్‌మ‌న్' సినిమాకు ఇది రీమేక్‌. దీనికి అప్ప‌టి బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన మ‌హేశ్ భ‌ట్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో చిరంజీవి చేతిలో భుజం కింద బుల్లెట్ దూసుకుపోతుంది. ఒక రాడ్‌కు స్పిరిట్ ముంచిన దూదిని చుట్టి, దానితో బుల్లెట్ త‌గిలిన చోట వెనుక వైపు నుంచి ఆ రాడ్‌తో పొడుస్తాడు చిరంజీవి. దాంతో బుల్లెట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ గాయాన్ని మాన్ప‌డానికి గ‌న్ పౌడ‌ర్‌ను గాయం మీద వేసి అంటించుకుంటే అది కాక‌ర‌పువ్వొత్తిలా వెలుగుతుంది. దీంతో గాయం త్వ‌ర‌గా మానిపోతుంది. 

ఈ సీన్‌ను చిరంజీవి తానే చేస్తాన‌ని చెప్ప‌డంతో మ‌హేశ్ భ‌ట్ వ‌ద్ద‌ని వారించారు. "అంత రిస్క్ అవ‌స‌రం లేదు.. డూప్‌తో ఆ సీన్ చేద్దాం" అన్నారు. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. ఆ సీన్ తాను చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌ట్టారు. అయితే తాను ఆ సీన్ చూడ‌లేన‌నీ, త‌ర్వాత ర‌ష్ చూస్తాన‌నీ చెప్పి మ‌హేశ్ భ‌ట్‌ అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు. 

చిరంజీవి త‌న తోడ‌ల్లుడు డాక్ట‌ర్‌ కె. వెంక‌టేశ్వ‌ర‌రావును వెంట‌నే ర‌మ్మ‌ని ఫోన్ చేశారు. ఆయ‌న వ‌చ్చాక‌, ఒక స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్‌ను ద‌గ్గ‌ర పెట్టుకొని, త‌న భుజంపై ర‌క్తంలా క‌నిపించే ఎర్ర‌రంగు అప్లై చేసి, దాని మీద గ‌న్‌పౌడ‌ర్ రాశారు. సెట్లో ఉన్న‌వాళ్లంతా ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ఉత్కంఠ‌త‌తో ఎదురుచూస్తున్నారు. కెమెరా రోల్ అవుతోంది. గ‌న్‌పౌడ‌ర్ మీద మంట వెలిగించారు. గ‌న్‌పౌడ‌ర్ బ‌ర్న్‌ అయ్యి మంట వెలుగుతోంది. బాధ‌ను భ‌రిస్తున్న‌ట్లు చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు. కెమెరా ర‌న్ అవుతోంది. చిరంజీవి బాధ‌ను నిజంగానే భ‌రిస్తున్నారు. కాసేప‌టికి కానీ, అక్క‌డ 'క‌ట్' చెప్పే డైరెక్ట‌ర్ లేడ‌నే సంగ‌తి ఆయ‌న‌కు గుర్తుకొచ్చింది. 

అప్పుడు రెండో చేత్తో ఆ మంట‌ను ఆర్పేసుకున్నారు. దాంతో కెమెరా ఆగింది. సెట్లో ఉన్న‌వాళ్లంతా క్లాప్స్ కొట్టారు. ఆ షాట్ బాగా వ‌చ్చింద‌ని కెమెరామ‌న్ చెప్పాడు. కానీ చూస్తే.. చిరంజీవి చేయి కాలిపోయి, పెద్ద బొబ్బ వ‌చ్చింది. అంతా కంగారుప‌డ్డారు. వెంట‌నే డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆయ‌న‌కు ఫ‌స్ట్ ఎయిడ్ చేశారు. ఇలా రిస్కులు చేయ‌డం చిరంజీవికి అల‌వాటు. అందుకే తెర‌పై ఆయ‌న చేసే స్టంట్స్ లైవ్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తాయి. ద 'జెంటిల్‌మ‌న్‌'లో క‌నిపించే ఈ సీన్ వెనుక జ‌రిగిన క‌థ ఇది.