English | Telugu
'ఆచార్య'ను భయపెడుతున్న కరోనా!.. ఇప్పట్లో విడుదల లేనట్లే!!
Updated : Apr 28, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ లెక్క ప్రకారం రంజాన్ సందర్భంగా మే 13న విడుదల కావాలి. కానీ ఆ రోజున సినిమా విడుదల కావట్లేదనీ, కరోనా సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నామనీ నిర్మాతలు ప్రకటించారు. అది నిజమే కానీ, ఈ వాయిదాకు ఇంకో కారణం కూడా ఉంది. అదేమిటంటే.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం! అవును. ఈ సినిమాలో రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటిస్తున్నారు. తమ పోర్షన్లు పూర్తి చేయడానికి వారిద్దరూ ఈ నెల ఫస్ట్ వీక్‌లో షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
కానీ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తోన్న సోను సూద్ కొవిడ్-19 బారిన పడటంతో డైరెక్టర్ కొరటాల శివ అంచనాలు తలకిందులయ్యాయి. షూటింగ్ ఆపేసి, యూనిట్ మెంబర్స్ అందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే సైతం తనకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందనీ, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాననీ ప్రకటించడంతో పరిస్థితి మరింత దిగజారింది.
ఈ నేపథ్యంలో 'ఆచార్య' విడుదలను వాయిదా వేయడం వినా మరో దారి లేకపోయింది. జూన్‌లో సినిమాని విడుదల చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా వినిపిస్తున్న దాని ప్రకారం ఇప్పట్లో విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించే అవకాశం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టి, థియేటర్లు తిరిగి పూర్తి స్థాయిలో తెరుచుకున్న తర్వాతనే రిలీజ్ డేట్‌ను ప్రకటించాలని నిర్మాతలు రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి డిసైడ్ చేసుకున్నారు.
ఇది మెగా ఫ్యాన్స్‌కు నిజంగా నిరాశను కలిగించే న్యూసే. చాలా కాలం తర్వాత మెగాస్టార్, మెగా పవర్‌స్టార్‌లను కలిసి తెరపై చూసే అవకాశం వస్తోందని సంబరపడుతుంటే కరోనా మరోసారి అడ్డుపడుతోందని వారు బాధపడుతున్నారు. ఒక పీరియడ్ స్టోరీతో తయారవుతున్న 'ఆచార్య'లో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.