English | Telugu
రేప్ చేస్తామనీ, చంపుతామనీ బెదిరిస్తున్నారు.. సిద్ధార్థ్ కంప్లయింట్!
Updated : Apr 29, 2021
బహుభాషా నటుడు, హీరో సిద్ధార్థ్‌ను రేప్ చేస్తామంటూ, చంపుతామంటూ కొంతమంది బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సిద్ధార్థ్ ఆరోపించారు. తన ఫోన్ నంబర్ లీకయ్యిందనీ, బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ దీన్ని లీక్ చేసిందనీ ఆయన ఆరోపించారు. దీని వల్ల తనకు, తన ఫ్యామిలీకి రేప్, చావు బెదిరింపులు వస్తున్నాయనీ ఆయన తెలిపారు.
తనకు వచ్చిన అన్ని బెదిరింపు కాల్స్‌ను రికార్డ్ చేసి, పోలీసులకు అందజేశానని తన పోస్ట్‌లో సిద్ధార్థ్ వెల్లడించారు. "తమిళనాడు బీజేపీ, బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ సభ్యులు నా ఫోన్ నంబర్‌ను లీక్ చేశారు. గత 24 గంటల్లో వేధిస్తూ, రేప్, చావు బెదిరింపులకు పాల్పడుతూ నాకూ, నా ఫ్యామిలీకీ 500కు పైగా కాల్స్ వచ్చాయి. అన్ని నంబర్లనూ (with BJP links and DPs) రికార్డ్ చేసి, వాటన్నింటినీ పోలీసులకు అందజేశాను. నేను నోర్మూసుకొని ఉండలేను. Keep trying @narendramodi @AmitShah (sic)." అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో తనను బహిరంగంగా బెదిరించిన ట్రోల్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను కూడా సిద్ధార్థ్ షేర్ చేశారు. "బీజేపీ తమిళనాడు సభ్యులు నిన్న నా నంబర్‌ను లీక్ చేసి, నన్ను ఎటాక్ చేయమనీ, హెరాస్ చేయమనీ ప్రజలకు చెబుతూ చేసిన అనేక సోషల్ మీడియా పోస్టుల్లో ఇదొకటి.. "ఇతను ఎప్పటికీ నోరు తెరవకూడదు.".. కొవిడ్ నుంచి మనం బతికి బయటపడవచ్చు. ఈ మనుషులతో మనం బతగ్గలమా?" అని ఆయన రాసుకొచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు సిద్ధార్థ్. ఇటీవలి కాలంలో ఆయన కొవిడ్‌ను అడ్డుకొనే విషయంలో అధికార పార్టీ అనుసరిస్తోన్న ధోరణిని ఆయన విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #IStandWithSiddharth అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.