English | Telugu
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహా పురుషులౌతారు!
Updated : May 28, 2024
‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అనే పాట వేటూరి కలం నుంచి ఏ శుభ ముహూర్తాన జాలువారిందోగానీ నూటికి నూరుపాళ్ళూ ఆ పాటకు, అందులోని భావాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. ఎన్.టి.రామారావు. తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్. సాధారణ వ్యక్తి నుంచి ఒక మహోన్నత శక్తిగా ఎదిగిన ఆయన జీవన క్రమం అందరికీ ఆదర్శప్రాయం. భావితరాలకు బంగారు బాట వేయాలనే తపనతోనే తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా సాగించారు.
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన సాధించిన విజయాల గురించి తెలియని తెలుగువారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. చిన్నతనం నుంచీ నటనపై మక్కువ పెంచుకున్న ఎన్టీఆర్ కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. కాలేజీ రోజుల్లోనే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ తర్వాత ఆ సంస్థ పేరుతోనే కొన్ని సినిమాలను కూడా నిర్మించారు ఎన్టీఆర్. ఆయనకు నటనలోనే కాదు, చిత్రలేఖనంలో కూడా ప్రవేశం ఉంది. రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో చిత్రకారుడిగా బహుమతి కూడా అందుకున్నారు ఎన్టీఆర్. 1947లో బి.ఎ. పట్టా అందుకున్న ఎన్టీఆర్ మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసారు. పరీక్ష రాసిన 1100 మందిలో ఎంపికపై ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఆయనలో బలీయంగా ఉండడంతో ఆ ఉద్యోగంలో మూడు వారాలు మాత్రమే కొనసాగారు ఎన్టీఆర్. 1949లో విడుదలైన ‘మనదేశం’ ఆయన నటించిన మొదటి సినిమాయే అయినా.. నటుడిగా మొదటి అవకాశం మాత్రం ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం రూపంలో వచ్చింది. ఈ సినిమా ఆలస్యంగా ప్రారంభమై 1950లో విడుదలైంది.
పాతాళభైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసిచూడు, చంద్రహారం చిత్రాలు ఎన్.టి.రామారావుకు ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. ఈ సినిమాల నిర్మాణ సమయంలో నెలకు రూ.500 జీతం, సినిమాకి రూ.5,000 పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత మాయాబజార్ సినిమాకి ఎన్టీఆర్ రూ.7,500 అందుకున్నారు. అప్పట్లో ఇదే అత్యధిక పారితోషికం. ఆ తర్వాత ఆయన చేసిన పౌరాణిక చిత్రాల్లోని అవతార పురుషులకు ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి.. ఇలా ప్రజలకు కనిపించే దైవంగా మారారు ఎన్టీఆర్. తను చేసే పాత్రల ఎంపికలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు ఎన్టీఆర్. ఎంతమంది విమర్శించినా సీతారామకళ్యాణం చిత్రంలో రావణ పాత్రను పోషించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటిసారి ఒక పౌరాణిక చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. పౌరాణిక, జానపద చిత్రాల్లోనే కాదు, సాంఘిక చిత్రాల్లోనూ ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలు పోషించారు. తెలుగు సినిమాకి మొదటి కమర్షియల్ హిట్‌ని అందించిన ఘనత ఎన్టీఆర్‌దే. 1977లో అడవిరాముడు కమర్షియల్ విజయాన్ని అందుకొని అప్పటికి అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ క్రమంలోనే వేటగాడు, డ్రైవర్ రాముడు, యమగోల, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం.. వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల జోరును పెంచారు. ఎన్టీఆర్ కెరీర్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించారు. పౌరాణిక చిత్రాల్లో దాదాపు అందరు అవతార పురుషుల పాత్రలను పోషించిన ఎన్టీఆర్‌ను తెలుగువారు కనిపించే దేవుడుగా కొలుస్తారు. 44 ఏళ్ళ సినీ జీవితంలో 186 సాంఘిక చిత్రాలు, 13 చారిత్రక సినిమాలు, 55 జానపద చిత్రాలు, 44 పౌరాణిక సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రజల ఆరాధ్యదైవంగా మారారు.
అందరూ ఎంతో అభిమానంగా ‘అన్న’ అని పిలుచుకునే ఆ మహానుభావుడు.. ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలకు ఆదర్శప్రాయమైన ప్రత్యామ్నాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రజా నాయకుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్. ఆయన సమకాలికుల్లో అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు మరొకరు లేదు. 1978లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల వల్ల స్థిరంగా ఐదేళ్ళ పాలన సాగించలేకపోయారు. నాలుగు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ఆ దశలో తెలుగుదేశం అనే కొత్త పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిరచి అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.టి.రామారావు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. అంతేకాదు, పురోహితులుగా బ్రాహ్మణులే కాదు, ఏ కులం వారైనా వ్యవహరించవచ్చు అనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందరో ముఖ్యమంత్రుల్లా ఎన్.టి.రామారావు బాబాలను, మాతలను నమ్మేవారు కాదు. ఆయన అపారమైన దైవభక్తి ఉంది. ముఖ్యంగా బుద్ధునిపట్ల ఆరాధ్య భావం ఉంది. ఎన్.టి.రామారావు పాలనలో ప్రజల మధ్య కుల ప్రస్తావన ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నట్టే.. తమ పార్టీలో ఉన్న వారి విషయంలోనూ దాన్ని అమలు చేశారు. బడుగు, బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. పేదవారిని పట్టి పీడుస్తున్న పటేల్, పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారారు ఎన్.టి.రామారావు. ఆ మహానటుడు, మహోన్నత నాయకుడి జయంతి మే 28. ఈ సందర్భంగా ఆ యుగపురుషుడికి, కారణజన్ముడికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్.