English | Telugu
హరికృష్ణకి హ్యాట్రిక్ ఇచ్చిన దర్శకులు.. ఎవరో తెలుసా
Updated : Sep 1, 2023
నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు నందమూరి హరికృష్ణ. తన కెరీర్ మొత్తమ్మీద 14 సినిమాల్లో నటించారు హరి. వాటిలో సింహభాగం మంచి విజయం సాధించడం విశేషం. అంటే.. హరికృష్ణ ఉంటే సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవడం పక్కా అన్నమాట.
ఇదిలా ఉంటే, ఇద్దరు దర్శకులు హరికృష్ణతో ముచ్చటగా మూడేసి సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు ఇచ్చారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. ఎన్టీఆర్, వైవీఎస్ చౌదరి. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో హరికృష్ణ నటించిన తల్లా పెళ్ళామా(1970), తాతమ్మ కల(1974), దాన వీర శూర కర్ణ (1977) సక్సెస్ అయ్యాయి. వీటిలో దాన వీర శూర కర్ణ అయితే ఓ సంచలనమనే చెప్పాలి. ఇక వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. హరికృష్ణలోని నటుడ్ని సరిగ్గా వాడుకుని.. మూడు గుర్తుండిపోయే విజయాలు ఇచ్చారు. ఈ కాంబోలో తొలి ప్రయత్నమైన సీతారామరాజు (1999) చెప్పుకోదగ్గ విజయం సాధించగా.. రెండో చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో (2002) సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండింటిలోనూ హరికృష్ణ ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఇక మూడో చిత్రమైన సీతయ్య (2003) సంగతికి వస్తే.. సోలో హీరోగా హరికృష్ణకి బ్లాక్ బస్టర్ ని అందించిన మూవీ ఇది. మొత్తమ్మీద.. ఎన్టీఆర్, వైవీఎస్ చౌదరి కాంబోలో హరికృష్ణకి గుర్తుండిపోయే హ్యాట్రిక్స్ దక్కాయన్నమాట.