English | Telugu
నేటి తరం నందమూరి-అక్కినేని మల్టీస్టారర్ నిజమయ్యేనా?
Updated : May 6, 2021
తెలుగు సినీ వినీలాకాశంలో నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని కథానాయకులుగా రాణించారు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి, తమిళనాడు సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ గురించిన అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఉత్తరాన అంతవరకూ 'మద్రాసీయులు'గా వ్యవహరింపబడుతున్న తెలుగువారికి, 'తెలుగువారు' అన్న గుర్తింపుని తీసుకువచ్చారు. అక్కినేని రాజకీయాల జోలికి వెళ్లకుండా చివరి శ్వాస దాకా నటిస్తూ వచ్చారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే చిత్రాలు కొన్నిటిలో ఈ మహానటులిద్దరూ కలిసి నటించారు.
వీరికి వారసులుగా చిత్రపరిశ్రమలోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున. మూడు దశాబ్దాలుగా అనేక హిట్ సినిమాలలో నటించి, ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలుగా రాణిస్తూనే ఉన్నారు. తమ తండ్రుల తరహాలోనే ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఆశిస్తూ వచ్చినా ఇంతదాకా అది నిజం కాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'గుండమ్మ కథ'ను ఈ ఇద్దరితో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ఆశించినా, అది వాస్తవ రూపం ధరించలేదు. సూర్యకాంతం చేసిన పాత్రను ఎవరు చేయగలరంటూ అప్పట్లో వినిపించింది. అది కాకపోయినా మరో సబ్జెక్ట్‌తోనైనా ఆ ఇద్దరూ ఓ మల్టీస్టారర్ చేయవచ్చు. కానీ వారు దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మూడో ఆ వంశాల్లో మూడో తరం కూడా వచ్చి, దశాబ్ద కాలంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
నందమూరి వంశం నుంచి హరికృష్ణ కుమారునిగా వచ్చిన మూడో తరం హీరో జూనియర్ ఎన్టీఆర్ నేటి టాప్ స్టార్స్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. 'ఆది', 'సింహాద్రి' చిత్రాలతో నంబర్ వన్ రేంజ్‌కు వెళ్లగల సత్తా ఉందని నిరూపించుకున్న తారక్.. ఆ తర్వాత ఆ క్రేజ్‌ను కొనసాగించలేకపోయినా, మాస్‌లో అద్వితీయమైన ఇమేజ్‌ను సాధించాడు. ఇక అక్కినేని వంశం నుంచి మూడో తరం వారసునిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య టాప్ స్టార్ రేంజికి ఎదగకపోయినా, స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. మంచి కథాబలం ఉన్న చిత్రాలు చేస్తూ, చక్కని నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు.
నాగార్జున చిన్నకొడుకు అఖిల్ కూడా ఐదేళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతనింకా హిట్ సినిమా బాకీ ఉన్నాడు. 'గుండమ్మ కథ'ను తారక్, నాగచైతన్యతో రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కానీ దానివైపు అడుగులైతే పడటం లేదు. తమ తాతల్లాగా ఈ యంగ్ హీరోలైనా కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. నందమూరి-అక్కినేని మల్టీస్టారర్ ఒక తరానికే పరిమితమవుతుందో, నేటి తరం కూడా దాన్ని కొనసాగిస్తుందో చూడాలి.