English | Telugu
ఆత్రేయ 'మనసు' కవి మాత్రమే కాదు.. 'మనోవైజ్ఞానిక' కవి!
Updated : May 7, 2021
ఆచార్య ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి! జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల్లో, సందేశాల్లో, ఉపన్యాసాల్లో తెలుగునాట వేమన పద్యాలకున్న వ్యాప్తి సినిమా పాటలంటూ ఇష్టపడే జనం వాడుకలో ఆత్రేయ పాటలకూ ఉంది. నేడు ఆయన శత జయంతి. ఈ సందర్భంగా ఆ అసాధారణ కవిని స్మరించుకుంటూ ఈ చిరు వ్యాసం...
1. "మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే" (ప్రేమనగర్)
2. ‘"మనసు లేని బ్రతుకొక నరకం
మరపులేని మనసొక నరకం" (సెక్రటరీ)
3. "మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!" (ప్రేమలు-పెళ్లిల్లు)
4. "కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!" (గుప్పెడు మనసు )
5. "మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలిసిపోతది " (మూగ మనసులు)
ఇలాంటి పాటలను ఆత్రేయ మాత్రమే రాయగలరు. ఆయనలో గొప్ప మనోవైజ్ఞానికుడు ఉన్నాడని చెప్పడానికి ఈ పాటలే నిదర్శనం. మనిషి మనసును ఆయనలా అర్థం చేసుకున్న సినీ కవి మరొకరు తెలుగులోనే కాదు, మరే భాషలోనూ కనిపించరు.
ఆత్రేయ అసలు పేరు ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులు. ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు. ఆయన చినమామ జగన్నాథాచార్యులు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్‌మెంట్ ఆఫీసులో ఆత్రేయకు గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారు! దాంతో ఆ పత్రిక వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం!
జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో తమ ఇంట్లోనే ఆత్రేయ ఘనంగా జరిపించారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని పాటలు కూడా రాశారు. అవి ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకోవడం విశేషం. ఉదాహరణకు ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి "కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా" అని రాశారు. అలాగే, "పెళ్లంటే పందిళ్లు సందళ్లు..." అనే 'త్రిశూలం' చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే!
ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారు. దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు. అదే.. "కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన.." పాట.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్రేయకు సంబంధించిన విశేషాలెన్నో ఉంటాయి. తెలుగు సినీ సాహిత్యానికి ఆత్రేయ ఒక దిక్సూచి, ఒక మణిదీపం. ఆత్రేయకు సాటి రాగల కవి అంతకుముందూ లేరు, ఆ తర్వాతా రాలేదు.