English | Telugu
భానుమతి ఆ సినిమా చేసుంటే సావిత్రి మహానటి అయ్యేదేనా?
Updated : Oct 4, 2023
ఈ విశ్వం లో ఎన్ని మార్పులు సంభవించినా,మనుషుల్లో విభిన్నమైన పోకడలు ఎన్ని వచ్చినా,చరిత్ర తన తాలూకు యొక్క రూపం మార్చుకున్నా సరే సినిమా అనేది మాత్రం ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. సినిమాలో నటించిన నటులు, నటీమణులు,సాంకేతిక నిపుణులు కూడా శాశ్వతం గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.అలా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సినిమా మిస్సమ్మ అయితే శాశ్వతంగా నిలిచిపోయిన నటీమణి సావిత్రి. మిస్సమ్మ సినిమా తో స్టార్ డమ్ ని అందుకొని రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన సావిత్రి మొదట మిస్సమ్మ సినిమా లో హీరోయిన్ కాదని మీకు తెలుసా? అప్పటికే టాప్ కథానాయికగా వెలుగొందుతున్న భానుమతి మిస్సమ్మ కధానాయకని ఆ తర్వాత భానుమతిని తీసేసి సావిత్రిని తమ సినిమా లో కథానాయకిగా నిర్మాతలు ఎంచుకున్నారని, ఆ సినిమాతోనే సావిత్రి ప్రభంజనం స్టార్ట్ అయ్యిందని మీలో ఎంతమందికి తెలుసు?
సావిత్రి కి మిస్సమ్మ ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.తన అందంతో ,తన మాట మాత్రమే గెలవాలనే పట్టుదలతో వచ్చే కోపం తో అద్భుతమైన నటనని ప్రసాదించి మిస్సమ్మ సినిమా ఈ రోజు వరకు జనాల గుండెల్లో కొలువుతీరి ఉండేలా చేసింది.అంతటి గొప్ప పాత్ర రావటానికి ఏ ఆర్టిస్ట్ కి అయిన నిర్మాతో దర్శకుడో కారణం అవుతారు..కానీ సావిత్రి కి మిస్సమ్మ సినిమా రావటానికి ఆ సినిమా తో సావిత్రి తెలుగు సినిమా ని శాసించి కోట్లాది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరడానికి భానుమతి కారణం అనే విషయం మీకు తెలుసా?
అది 1955 వ సంవత్సరం..విజయా ప్రొడక్షన్ పై మిస్సమ్మ అనే పేరుతో బి.నాగిరెడ్డి ,చక్రపాణిలు నిర్మాతలుగా సినిమాని ప్రారంభించారు.ఆ రోజుల్లో విజయా బ్యానర్ లో నటించాలంటే పెట్టి పుట్టాలని అనే వాళ్ళు. అప్పటికే ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా ముందుకు దూసుకు పోతున్న భానుమతిని టైటిల్ రోల్ గా తీసుకొని ఎన్టీఆర్,నాగేశ్వరావు ల తో పాటుగా ఇంకో ముఖ్య పాత్రలో విశ్వ విఖ్యాత నటన సార్వభౌమ ఎస్.వి రంగారావు ని తీసుకొని నిర్మాతలు మిస్సమ్మ చిత్రాన్ని ప్రారంభించారు. వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం భానుమతికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని కూడా దర్శకుడు ఎల్.వి ప్రసాద్ చిత్రీకరించడం జరిగింది. కానీ ఆ తర్వాత భానుమతికి చిత్ర నిర్మాతలైన చక్రపాణి,నాగిరెడ్డి లకి మధ్య గొడవ జరగడంతో భానుమతి సినిమా లో నటించానని చెప్పింది.మొదటి నుంచి ముక్కుసూటి తత్వానికి మారుపేరైన చక్రపాణి ,నాగిరెడ్డిలు భానుమతి ని బతిమాలాడకుండా భానుమతి మీద చిత్రీకరించిన సన్నివేశాలకి సంబందించిన రీల్స్ మొత్తాన్ని తగలబెట్టి ఇంకో కథానాయకి కోసం అన్వేషణ ప్రారంభించారు. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన భానుమతి నిర్మాతలతో మీ మిస్సమ్మ సినిమాలో కధానాయిక బాగా నటిస్తానే మీ సినిమా హిట్ అవుతుంది లేదా ఢమాల్ అంటుంది నాలాగా నటించే నటి మీకు దొరకదు కాబట్టి మీరు ఈ సినిమా ఇంక తియ్యకుండా ఉంటే మంచిది అని అంది.
దాంతో నిర్మాతలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని భానుమతి లాగ నటించే నటి కోసం అన్వేషణ చేస్తున్నారు .అప్పుడప్పుడే నటనలో ఓనమాలు దిద్దుకుంటున్న సావిత్రికి మిస్సమ్మ క్యారక్టర్ ఉందని తెలిసి నిర్మాతలని సంప్రదించింది.వాళ్ళు అనుమానంగానే సావిత్రి మీద ముందు కొన్ని సన్నివేశాలు తియ్యడం వాటి రషెస్ చూసుకొని సావిత్రి కి మిస్సమ్మ సినిమా లో అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇంక చెన్నై ఫిలిం సర్కిల్స్ లో ఎక్కడ చూసిన ఒకటే చర్చ. మిస్సమ్మ టైటిల్ రోల్ లో భానుమతి గారిలా సావిత్రి నటించి ఆ పాత్రకి న్యాయం చెయ్యలేదని. అలాగే భానుమతి కూడా మిస్సమ్మలో తన బదులు ఎవరో కొత్త అమ్మాయి సావిత్రిని పెట్టుకున్నారంట సినిమా ప్లాప్ అవుతుందని తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గర అంటూ ఉండేది .సినిమా కంప్లీట్ అయ్యింది. చెన్నైలో సినీ ప్రముఖుల కోసం డిస్ట్రిబ్యూటర్ల కోసం షో వేసారు. ఇంక అంతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు సావిత్రి నటనకి ముగ్ధులయ్యిపోయి భానుమతి గారు కూడా ఇంత బాగా చేసేవారు కాదు అనే పేరుని పొందింది. మిస్సమ్మ సినిమాలో సావిత్రి నట విశ్వరూపాన్ని చేసేటందుకు మన రెండు కళ్ళు చాలవు. కళ్ళ కపటం ఎరుగని బడి పంతులమ్మగా తన మాటే నెగ్గాలని లేకపోతే వాళ్ళ అంతు చూస్తానని బుంగమూతి పెట్టి తన నటనతో సావితి ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ ,ఎస్ వి ఆర్ లాంటి నటులకి ధీటుగా నటించి సావిత్రి రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమని శాసించే స్థాయికి ఎదుగుతుంది అనేలా చేసుకుంది.ఆ తర్వాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో భానుమతి కి సావిత్రి కనపడితే మిస్సమ్మ సినిమాలో చాలా బాగా చేసావు నేను కూడా ఆంత బాగా నటించివుండేదాన్ని కాదు అని అంది .భానుమతి కనుక మిస్సమ్మ సినిమా చేసి ఉంటే సావిత్రి అగ్ర కథానాయకిగా ఎదిగేది కాదేమో?