English | Telugu
1967లో అన్నీ ప్రమాదాలే.. ప్రాణాలతో బయటపడిన జయలలిత!
Updated : Jun 24, 2024
ప్రేక్షకులకు వినోదాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించడమే నటీనటుల లక్ష్యం. తాము చేసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలంటే డాన్సుల్లో, ఫైట్స్‌లో రకరకాల విన్యాసాలు చెయ్యాల్సి ఉంటుంది. అలా చేసే క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల హీరోలైనా, హీరోయిన్లైనా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, పాతరోజుల్లో ఆ సదుపాయాలు లేనందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగి నటీనటులు ఇబ్బందులు పడేవారు. అలాంటి ఘటనలు పాతతరం హీరోయిన్ జయలలిత సినీ జీవితంలో చాలా జరిగాయి. ముఖ్యంగా 1967వ సంవత్సరం తన కెరీర్లో మరచిపోలేనిది అంటూ అప్పట్లో ఓ పత్రికలో స్వయంగా జయలలిత చెప్పిన విషయాలను ప్రచురించారు.
‘నూతన సంవత్సరం మొదటి రోజు ‘గోపాలుడు భూపాలుడు’ చిత్రంలోని ఓ వీధినాట్యంతో కూడిన పాటలో నటించాను. అలాంటి పాటలు ఎంతో హుషారుగా చేస్తానని నాకు పేరు ఉంది. ఆ పాటలో ఓ కష్టమైన భంగిమ చేశాను. షాట్ ఓకే అయింది. కానీ, లేచి నిలబడలేకపోయాను. సహాయం కోసం గట్టిగా అరిచాను. అప్పుడు అక్కడున్న వారు వచ్చి నన్ను లేపి నిలబెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి ఎక్స్‌రేలు తీయించారు. ఇరవై రోజులపాటు కదలకుండా బెడ్ మీదే ఉండాలని చెప్పారు. ఇకపై అలాంటి హుషారు పాటలు చేయకూడదని నిర్ణయించుకున్నాను.
ఆ తర్వాత ‘నాన్’, ‘సూడివిట్టు మాప్పిళ్లై’ చిత్రాల షూటింగ్ కోసం ఊటీ వెళ్ళాల్సి వచ్చింది. ‘నాన్’ చిత్రం షూటింగ్ ఓ జలపాతం దగ్గర జరుగుతోంది. అంతకుముందు చాలామంది ఆ ప్రదేశంలో షూటింగ్ చేశారు. కానీ, నీళ్ళలోకి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యలేదు. ఎందుకంటే అక్కడ నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తాయి. పట్టు తప్పితే కొట్టుకుపోతారు. అయినా ఆ జలపాతం మధ్యలో ఉన్న రాయిపైన డాన్స్ చేస్తే బాగుంటుందని దర్శకులు చెప్పారు. ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని వదిలేసి ధైర్యంగా అక్కడికి చేరుకున్నాను. జలపాతం మధ్యలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి విజృంభించి డాన్స్ చేస్తున్నాను. సడన్‌గా నా కాలు జారింది. ముందుకు పడిపోయాను. సమయానికి అసిస్టెంట్ డైరెక్టర్ నీళ్ళలోకి దూకి నన్ను రక్షించారు. నేను ప్రాణాలతో బయటపడ్డానంటే ఆయనే కారణం.
ఇక ‘సూడివిట్టు మాప్పిళ్లై’ షూటింగ్ ఉదకమండలానికి నాలుగు వేల అడుగుల దిగువన ఉన్న టీ ఎస్టేట్‌లో జరిగింది. పాటలోని ఓ ప్రేమ సన్నివేశం అది. దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. ఆ నేలంతా ఎత్తు పల్లాలతో ఉంది. అలా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నా కాలు ఒక కన్నంలో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా కిందపడిపోయాను. నడవడం కూడా సాధ్యం కాలేదు. అతి కష్టం మీద కారు దగ్గరికి వెళ్లగలిగాను. ఆ తర్వాత అక్కడికి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్లో కట్టు కట్టించారు. మరుసటిరోజు అలా కుంటుతూనే ఆ పాటను పూర్తి చేశాను. అయితే అదృష్టవశాత్తు ఆ పాటలో నా ఇబ్బందిని ఎవరూ గుర్తించలేకపోయారు. మద్రాస్ వచ్చిన తర్వాత కూడా కాలు నొప్పి తగ్గలేదు. డాక్టర్‌గారు వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ, ఆ మర్నాడు పాండిచ్చేరిలో ఓ భరతనాట్య ప్రదర్శనకు హాజరు కావాల్సి వచ్చింది. అది ముందే నిర్ణయించిన కార్యక్రమం. వెళ్ళకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను. కానీ, నేను స్టేజి మీద కనిపించకపోతే జనం గొడవ చేస్తారని ఆ ప్రదర్శన ఏర్పాటు చేసిన వారు చెప్పారు. నా కాలుకు ఉన్న కట్టుమీద మరో కట్టు కట్టి ఆ ప్రోగ్రాం పూర్తి చేశాను. తను చెప్పిన మాట వినలేదని మా డాక్టర్‌గారు నన్ను కోప్పడ్డారు.
ఇక మే నెలలో హిందీ సినిమా ‘ఇజ్జత్’ షూటింగ్ కోసం కులు లోయకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రదేశమంతా ముళ్ళతో నిండిపోయి ఉంది. నా కాళ్ళలో లెక్కలేనన్ని ముళ్లు గుచ్చుకున్నాయి. ప్రతిరోజూ మా అమ్మగారు ఆ ముళ్ళను తీసేవారు. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత మద్రాస్ వచ్చేశాను. అయినా నా కాళ్ళలో చాలా ముళ్ళు ఉన్నాయి. మా డాక్టర్‌గారు కొన్నింటిని తీసారు. కానీ, ఒక ముల్లు మాత్రం కాలులో ఉండిపోయింది. అది ఎక్కడుందో ఆయన కూడా కనిపెట్టలేకపోయారు. ఒకరోజు ‘చిక్కడు దొరకడు’ చిత్రానికి సంబంధించి రామారావుగారితో కలిసి ఒక పాట చిత్రీకరణలో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆయన చూసుకోకుండా నా కాలు తొక్కారు. అప్పటివరకు జాడలేని ముల్లు ఒక్కసారిగా బయటికి వచ్చింది. అంత బాధలోనూ నాకు సంతోషం కలిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే నాకు జరిగిన ప్రమాదాలు ఇవి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం లేకుండా బయటపడ్డందుకు చాలా ఆనందించాను. 1968 అయినా నాకు ఎలాంటి ప్రమాదాలు లేని సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ తన అనుభవాల గురించి వివరించారు జయలలిత.