English | Telugu
త్రివిక్రమ్ కథ విని పవన్‌కళ్యాణ్ నిద్రపోయారు... మహేష్ బయటికి వెళ్ళిపోయారు.. ఎందుకంటే!
Updated : Jun 22, 2024
ఒక సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి, కమర్షియల్‌గా విజయం సాధించాలి అంటే అప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తియ్యాలి అంటారు. ఆ జనరేషన్‌లోని ప్రేక్షకులు ఎలాంటి వినోదాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి ట్విస్టులను ఆశిస్తున్నారు అనేది దర్శకుడు పసిగట్టగలిగినపుడే అందరూ మెచ్చే సినిమా బయటికి వస్తుంది.. సాధారణంగా ఒక సినిమా విజయం వెనుక దాగి ఉన్న విషయాలివే. కానీ, కొన్ని సూపర్‌హిట్ అయిన సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు, అలాగే సినిమా బాగుంది అనే టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు లేక ఫ్లాప్ అవ్వొచ్చు. అలా అందరూ బాగుందని చెప్పుకున్నా రిలీజ్ సమయంలో నిర్మాతకు నష్టం తీసుకొచ్చిన సినిమాల్లో మహేష్, త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ ఒకటి.
అప్పటివరకు పలు సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్‌కి నిర్మాత స్రవంతి రవికిషోర్ ‘నువ్వే నువ్వే’ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే పవన్‌కళ్యాణ్‌ని కలిసి ‘అతడు’ కథ వినిపించారు. కథ మొదలు పెట్టిన 15 నిమిషాల్లోనే పవన్‌కళ్యాణ్ నిద్రలోకి జారుకోవడంతో అక్కడి నుంచి వచ్చేశారు త్రివిక్రమ్. ఆ తర్వాత పద్మాలయా స్టూడియోలో మహేష్‌కి వినిపించారు. కథ విన్న మహేష్ ఒక్కసారిగా లేచి బయటికి వెళ్లిపోయారు. దీంతో షాక్ అయిన త్రివిక్రమ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. తన కథ విని పవన్‌కళ్యాణ్ నిద్రపోయారు, మహేష్ ఏ విషయం చెప్పకుండా లేచి వెళ్లిపోయారు. దీన్నిబట్టి తను చెప్పిన కథలోనే లోపం ఉందా అనే అనుమానం వచ్చింది త్రివిక్రమ్‌కి. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన మహేష్.. కథ చాలా అద్భుతంగా ఉందని, నాన్నగారికి కూడా నచ్చిందని చెప్పడంతో త్రివిక్రమ్ రిలాక్స్ అయ్యారు. ఈ సినిమాను పద్మాలయా బేనర్‌లోనే సినిమా చేద్దాం అన్నారు మహేష్. కానీ, అప్పటికే తన రెండో సినిమా జయభేరి ఆర్ట్స్ మురళీమోహన్‌కి కమిట్ అయి ఉన్నారు త్రివిక్రమ్. దానికి సంబంధించి కొంత అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. ఇదే విషయాన్ని మహేష్‌కి చెప్పారు. సరే దాని గురించి ఆలోచిద్దాం, మళ్ళీ మీకు కబురు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు మహేష్. ఆ సమయంలో మహేష్ ‘టక్కరిదొంగ’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ‘అతడు’ సినిమా గురించి మహేష్ నుంచి త్రివిక్రమ్‌కి ఎలాంటి పిలుపు రాలేదు. ఈలోగా బాబీ, ఒక్కడు, నిజం, నాని, అర్జున్ సినిమాలు కంప్లీట్ చేశారు. మహేష్‌తో సినిమా చేసేందుకు రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు త్రివిక్రమ్.
‘అర్జున్’ రిలీజ్ అయిన తర్వాత పైరసీకి సంబంధించి జరిగిన కొన్ని పరిణామాల వల్ల కోర్టు కేసులతో మహేష్ కొంత ఆందోళనగా ఉన్నారు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌కి కబురు చేశారు మహేష్. అప్పుడు ‘అతడు’ ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేశారు. చాలా కొత్తగా ఫీల్ అయ్యారు మహేష్. త్రివిక్రమ్ కోరినట్టుగానే జయభేరి ఆర్ట్స్ బేనర్‌పై సినిమా ప్రారంభమైంది. షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చూసి మహేష్ ఫిదా అయిపోయారు. అప్పటివరకు తను చేసిన సినిమాల్లో లేని కొత్తదనం ‘అతడు’లో కనిపించింది. తనకు ఎక్కువ డైలాగులు ఇవ్వకుండా, కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మంచి ఎఫెక్ట్ తీసుకురావడం మహేష్‌కి నచ్చింది. సినిమా మొత్తంలో మహేష్‌కి నాలుగైదు పేజీల డైలాగులు కూడా లేవట. మహేష్ తన డబ్బింగ్‌ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేశారంటే సినిమాలో అతని డైలాగులు ఎంత తక్కువ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
2005లో రిలీజ్ అయిన ‘అతడు’ చిత్రాన్ని అప్పట్లోనే రూ.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా హిట్టా, ప్లాపా అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి తగ్గట్టుగానే రిలీజ్‌కి ముందు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు. థియేట్రికల్ బిజినెస్ రూ.17 కోట్లకే పరిమితమైంది. అలా సినిమా రిలీజ్ సమయానికి నిర్మాత రూ.8 కోట్లు డెఫ్‌షీట్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ‘అతడు’ శాటిలైట్ రైట్స్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది ‘మా’ టీవీ. అంతేకాదు, అగ్రిమెంట్ కాలం ఐదేళ్ళు పూర్తయిన తర్వాత ‘మా’ టీవీ మరో రూ.7 కోట్లు చెల్లించి రెన్యువల్ చేయించుకుందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమాకి ఎంతటి క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. అలా ‘అతడు’ నిర్మాత నష్టాల నుంచి లాభాల వైపు వెళ్ళగలిగారు. ఇక టీవీలో ‘అతడు’ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాను వెయ్యిసార్లకు మించి టెలికాస్ట్ చేశారంటే ‘అతడు’ జనంలోకి ఎంతగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డు సృష్టించింది.