English | Telugu

తన ఇంట్లోనే బియ్యం దొంగిలించి 3 రూపాయలు అప్పు తీర్చిన అల్లు రామలింగయ్య!

పాతతరం నటీనటులకు నాటకరంగమే ఇన్‌స్టిట్యూట్‌. హీరో, హీరోయిన్‌ నుంచి హాస్యనటుల వరకు అక్కడే నటనలోని మెళకువలు నేర్చుకునేవారు. ఏ పాత్రను ఎలా పోషించాలి, ఎలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాలను ఆకళింపు చేసుకొని నటనలో గట్టి పునాది వేసుకునేవారు. పాతతరం హాస్య నటుల్లో అల్లు రామలింగయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఆయన సినిమా రంగానికి రావడం వెనుక ఒక విచిత్రమైన కథ దాగి ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్యకు చదువు అబ్బలేదు. వ్యవసాయమైనా చెయ్యమని తండ్రి చెబితే.. అది కూడా చేసేవారు కాదు. ఎప్పుడూ ఆకతాయిగా తిరుగుతూ, అందర్నీ అనుకరిస్తూ నవ్విస్తుండేవారు. అలా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. ఎక్కడ నాటకం ప్రదర్శిస్తున్నా అక్కడికి వెళ్ళిపోయి అందులో నటించిన వారిని వారికి విసుగుపుట్టే వరకు అభినందించేవారు. ఏదో విధంగా నాటకాల్లో ప్రవేశించాలని విశ్వప్రయత్నం చేసేవారు. ఎలాగైతే ‘భక్తప్రహ్లాద’ నాటకంలో బృహస్పతి వేషం లభించింది. మూడు రూపాయలు ఆ నాటక కాంట్రాక్టరుకు ఎదురిచ్చేలా మాట్లాడుకొని ఆ పాత్రను దక్కించుకున్నారు. నాటకాల్లో అనుభవం లేకపోయినా తనకు ఉన్న అవగాహనతో బృహస్పతి పాత్రకు న్యాయం చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టరుకు మూడు రూపాయలు ఇచ్చేందుకు తన ఇంట్లోనే బియ్యాన్ని దొంగిలించి వాటిని అమ్మి అప్పు తీర్చారు. ఆ నాటకం తర్వాత ప్రజా నాట్యమండలిలో చేరి ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. పలువురు ప్రముఖుల్ని అనుకరించడం, కొన్ని తమాషా విషయాల గురించి చెప్పడం ద్వారా అందర్నీ నవ్వించేవారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు. జైలులో అందర్నీ పోగేసుకొని నాటకాలు వేసేవారు. అంతేకాదు, అంటరానితనంపై కూడా అల్లు రామలింగయ్య పోరాటం చేశారు. 

1952లో గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ అల్లు రామలింగయ్య తొలిచిత్రం. ఈ చిత్రంలో శాస్త్రి పాత్రను పోషించి అందర్నీ ఆకర్షించారు. ఆ తర్వాత వద్దంటే డబ్బు, పరివర్తన, పల్లె పడుచు చిత్రాల్లో అల్లు పోషించిన పాత్రలు ఆయనకు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పటివరకు సినిమాల్లో కనిపించిన హాస్యనటులకు పూర్తి భిన్నమైన శైలి అల్లు వారిది. కొన్ని పాత్రలు ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే సృష్టించేవారు రచయితలు. అయితే అల్లు మాత్రం తన కెరీర్‌లోని వెలితి గురించి పదే పదే చెప్పేవారు. 100 సినిమాల్లో 100 రకాల హాస్యపాత్రలు చేసారు అల్లు. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. తనకు మాత్రం సీరియస్‌ పాత్రలు చెయ్యాలని, ‘నువ్వు హాస్యనటుడివి మాత్రమే కాదు’ అనిపించుకోవాలనే కోరిక ఉండేది.

హాస్యంతో నిండిన క్రూర పాత్రలు, క్రౌర్యంతో ఉండే హాస్యపాత్రలు ఎన్నో పోషించారు అల్లు రామలింగయ్య. మిస్సమ్మ, ఇలవేల్పు, దొంగరాముడు, మూగమనసులు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం వంటి సినిమాలు  ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి. డిఫరెంట్‌ మేనరిజంతో అల్లు చేసే కామెడీని అందరూ ఎంజాయ్‌ చేసేవారు. హోమియోపతి వైద్యంలో పట్టభద్రుడైన అల్లు రామలింగయ్య సినిమాల్లో నటిస్తూనే ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. నటుడుగా కొనసాగుతూనే సినిమా నిర్మాణం కూడా చేపట్టారు అల్లువారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం వంటి సినిమాలను నిర్మించారు. అల్లు రామలింగయ్య తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మిస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం, మనవడు అల్లు అర్జున్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం తనకు సంతృప్తినిచ్చిన అంశాలని అల్లు రామలింగయ్య చెప్పేవారు.  

1952లో ‘పుట్టిల్లు’ చిత్రంతో ప్రారంభమైన అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం 2004లో వచ్చిన ‘జై’ వరకు కొనసాగింది. ఆయన చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తరం నుంచి యంగ్‌ హీరో నవదీప్‌ వరకు ఎంతో మంది హీరోలతో కలిసి నటించిన ఘనత అల్లు రామలింగయ్యకే దక్కుతుంది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 1990లో పద్మశ్రీ పురస్కారంతో అల్లు రామలింగయ్యను సత్కరించింది. రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్య కావడం విశేషం. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 2013లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 తపాలా బిళ్ళల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదల చేశారు.