English | Telugu

అగ్ర కథానాయకులతో మంజుల టాప్ హిట్స్.. ఏంటో తెలుసా!


 

(జూలై 23.. మంజుల 10వ వర్థంతి సందర్భంగా)

మంజుల.. ఓ తరం యువత కలలరాణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాదికి చెందిన అన్ని భాషల సినిమాల్లోనూ అలరించిన అందాల తార. మరీముఖ్యంగా.. తెలుగులో అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ విజయాలను చూశారు మంజుల. టాప్ స్టార్స్ తో మంజుల అందుకున్న టాప్ హిట్స్ వివరాల్లోకి వెళితే..

నటరత్న నందమూరి తారక రామారావు: మంజులకి ఎన్టీఆర్ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి. 'వాడే వీడు' వంటి బ్లాక్ బస్టర్ తో ఈ కలయిక మొదలైంది. ఆపై 'మనుషులంతా ఒక్కటే', 'మగాడు', 'నేరం నాది కాదు ఆకలిది'.. ఇలా 1976లో ఎన్టీఆర్ మూడు వరుస హిట్స్ లో ఆమె నాయికగా కనువిందు చేశారు. ఆపై ఏడాది వచ్చిన హిట్ మూవీ 'చాణక్య చంద్రగుప్త'లోనూ ఇద్దరు నాయికల్లో ఒకరిగా ఆకట్టుకున్నారు మంజుల.

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు: తెలుగులో మంజుల నటించిన మొదటి సినిమా.. ఏయన్నార్ నటించిన 'జై జవాన్'నే. అయితే, అందులో ఆమె లీడ్ హీరోయిన్ కాదు. తరువాతి కాలంలో  'బంగారు బొమ్మలు' వంటి విజయవంతమైన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో జట్టుకట్టి సక్సెస్ చూశారు మంజుల.

సూపర్ స్టార్ కృష్ణ: సూపర్ హిట్ మూవీ 'మాయదారి మల్లిగాడు'లో కృష్ణ సరసన భలేగా ఎంటర్టైన్ చేసిన మంజుల.. ఆపై 'భలే దొంగలు' వంటి జనరంజక చిత్రంలోనూ జతకట్టారు.

నటభూషణ్ శోభన్ బాబు: తెలుగులో మంజులకి బాగా అచ్చొచ్చిన జోడీ అంటే.. శోభన్ బాబు అనే చెప్పొచ్చు. 'మంచి మనుషులు'తో మొదలుకుని 'జేబు దొంగ', 'ఇద్దరూ ఇద్దరే', 'పిచ్చి మారాజు' వరకు భలే హిట్స్ అందుకున్నారు ఈ జంట. వీరి కాంబోలో వచ్చిన 'గడుసు పిల్లోడు' కూడా చెప్పుకోదగ్గ విజయం చూసింది.