Read more!

English | Telugu

షూటింగ్‌లో ప్రమాదం.. మరణం అంచుకి వెళ్ళి తిరిగొచ్చిన హీరోయిన్‌!

సినిమాల్లో మన కళ్ళకు కనిపించేదంతా నిజం కాదని చూస్తున్న మనకు తెలుసు. అయినా అక్కడ నిజంగా అది జరుగుతోందా అనే భ్రమ కలిగించడమే సినిమా సహజ లక్షణం. కొంతమంది దర్శకులు సినిమాను సినిమాగా కాకుండా నేచురల్‌గా తీసే ప్రయత్నం చేస్తారు. ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్‌ ఫీల్‌ అవ్వాలి అనుకుంటారు. అందుకే కొన్ని సన్నివేశాలు మనకు ఎంతో సహజంగా అనిపిస్తాయి. అలాంటి సీన్స్‌ తీసే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అలా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. కొందరు గాయాలతో బయటపడ్డవారూ ఉన్నారు. అలా ఒక హీరోయిన్‌ మృత్యువు దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఆమే హీరోయిన్‌ రాజ్యలక్ష్మీ. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించిన రాజ్యలక్ష్మీ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని టెలివిజన్‌ సిరీస్‌లలో కూడా నటించింది. ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న రాజ్యలక్ష్మీ కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని ఘటన జరిగింది. అది తలుచుకొని ఇప్పటికీ ఆమె భయపడుతుంటారు. దాదాపు మరణానికి దగ్గరగా వెళ్ళి వచ్చిన ఆ ఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.

‘అది గుంటూరు తాడికొండలోని ఒక టెంపుల్‌. ఎన్నో మెట్లు ఎక్కిన తర్వాత గుడి ఉంటుంది. కింద మెట్లకి ముందు ఒక మండపం ఉంటుంది. అక్కడ షూటింగ్‌. సినిమా పేరు ‘చెవిలో పువ్వు’. ఇ.వి.వి.సత్యనారాయణగారి మొదటి సినిమా. అశోక్‌కుమార్‌గారు నిర్మాత. నేను ఆ మండపానికి ఉరి వేసుకునే సీన్‌. దాన్ని లాంగ్‌ షాట్‌గా తీసేందుకు ఇ.వి.వి. ప్లాన్‌ చేశారు. నా మెడకు ఉరితాడు కట్టి ఉంది. నాకేమైనా అయితే హెల్ప్‌ చేయడానికి ఆ మండపం స్తంభాల వెనుక కెమెరాకి కనబడకుండా ఇద్దరు ఉన్నారు. యూనిట్‌ వాళ్ళంతా షాట్‌ రెడీ చేస్తున్నారు. కెమెరామెన్‌ ప్రతాప్‌గారు లాంగ్‌ నుంచి క్లోజప్‌ షాట్‌ తియ్యాలని కెమెరాలో నుంచి చూసేటపుడు నాలో ఏదో తేడా గమనించారు. నేను కళ్ళు తేలేస్తున్నట్టు కెమెరాలో కనిపించింది. ఈ అమ్మాయికి ఏదో అయిందని  అక్కడి నుంచే ఆయన అరవడం పెట్టడం మొదలుపెట్టారు. చాలా దూరంగా ఉండడం వల్ల నా దగ్గర ఉన్నవాళ్ళకి ఆ కేకలు వినిపించలేదు. అప్పుడు ఆయనే పరిగెత్తుకు వచ్చి అందరి సాయంతో నన్ను కాపాడారు. అప్పటికే నేను స్పృహ తప్పాను. అప్పుడు నా మొహం మీద నీళ్ళు జల్లితే కాస్త తేరుకున్నాను. పది నిమిషాల పాటు నేను ఆ షాక్‌ నుంచి కోలుకోలేదు. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ షాట్‌ పూర్తి చేశారు. అయితే నా మెడకు కుడిపక్క పొడుగ్గా తాడు కోసుకుపోయిన గాటు పడిపోయింది. 

మరుసటి రోజు రాజ్యలక్ష్మీకి ప్రమాదం అని అన్ని పేపర్లలో న్యూస్‌ వచ్చేసింది. అది చూసి మా అమ్మమ్మ వాళ్ళు ఒకటే ఏడుపు.. ఎందుకే నీకిలాంటి సినిమాలు అని. మా ఆయన కూడా పెళ్లి చూపుల్లో ఆ గాటుని చూసి ఏమైందని అడిగారు. నేను చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను అని చెప్పాను. దాని గురించి ఆయన అప్పుడప్పుడు చెబుతుంటారు. ‘నన్ను పెళ్లి చేసుకోవాలని రాసి ఉంటే అది ఎందుకు చస్తుంది’ అని సరదాగా అంటుంటారు. ఆ సినిమా షూటింగ్‌లో జరిగిన ఆ ఇన్సిడెంట్‌ నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను అలా బ్రతికి బయటపడడానికి కెమెరామెన్‌ ప్రతాప్‌గారే కారణం’ అంటూ పాత జాప్ఞకాలను గుర్తు చేసుకున్నారు రాజ్యలక్ష్మీ.