Read more!

English | Telugu

చిన్న‌ప్పుడే డూప్ వ‌ద్ద‌ని పైనుంచి కింద‌కు దూకేసిన మ‌హేశ్‌!

 

చిన్న‌త‌నంలోనే న‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాడు మ‌హేశ్‌. 'పోరాటం' సినిమాలో మొద‌ట నటించ‌డానికి తెగ మారాం చేసిన ఎనిమిదేళ్ల పిల్లాడు, ఆ సినిమాలో న‌టించాక మారిపోయాడు. తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన 'శంఖారావం' సినిమా నుంచి న‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఒక‌రోజు త‌న‌లాగే డ్ర‌స్ వేసుకున్న మ‌రో పిల్లాడిని చూశాడు మ‌హేశ్‌. అత‌నికి త‌న డ్ర‌స్ లాంటిదే ఎందుకు వేశార‌ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ను అడిగాడు. నీకు డూప్‌గా ఆ అబ్బాయి న‌టిస్తున్నాడ‌ని అత‌ను తెలిపాడు. పైనుంచి కింద‌కు దూకే సీన్ ఒక‌టి ఉంద‌నీ, ఆ సీన్ ఆ డూప్ చేస్తాడ‌నీ చెప్పాడు.

అది విని, "ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు, నేనే దూకుతా".. అన్నాడు మ‌హేశ్‌, కెమెరా లేకుండానే, షాట్ కాక‌పోయినా వెంట‌నే దూకి చూపించేశాడు. త‌న‌కు డూప్ అవ‌స‌రం లేద‌నీ, త‌నే స్వ‌యంగా దూకుతాన‌ని చెప్పి ఆ సీన్‌లో డూప్ లేకుండా న‌టించాడు ఎనిమిదేళ్ల మ‌హేశ్‌!

కృష్ణ డైరెక్ట్ చేసిన మ‌రో సినిమా 'కొడుకు దిద్దిన కాపురం'లో ఒక మోటార్ బైక్ స్టంట్ సీన్ ఉంది. అదెంతో రిస్కీ షాట్‌. దానికి మ‌హేశ్ కోసం ఓ డూప్‌ను పెట్టారు. తండ్రి స్పాట్‌లో ఉంటే ఆ ప‌ని చేసేందుకు ఒప్పుకోర‌ని, ఆయ‌న లంచ్‌కు వెళ్లిన స‌మ‌యంలో స్టంట్ మాస్ట‌ర్‌ను ఒప్పించి ఆ మోటార్ బైక్ సీన్‌లో డూప్ లేకుండా న‌టించాడు మ‌హేశ్‌.

'బాల‌చంద్రుడు' సినిమాలో పైనుండి కింద‌కు దూకే స‌న్నివేశంలో తాను డూప్ లేకుండా న‌టిస్తాన‌ని క‌చ్చితంగా చెప్పాడు. ఆ సినిమాలో శ‌ర‌త్‌కుమార్ విల‌న్‌. ఆయ‌న‌ది అస‌లే ఎక్స‌ర్‌సైజ్ బాడీ. "ఇంత చిన్న‌పిల్లాడు డూప్ అవ‌స‌రం లేద‌ని అంటున్నాడు. నేను కూడా డూప్ లేకుండా న‌టిస్తాను." అని ఆయ‌న కూడా ప‌ట్టుప‌ట్టాడు. అయితే ఆ సీన్ తీస్తున్న‌ప్పుడు ప్ర‌మాదానికి గురై, ఆయ‌న మెడ ద‌గ్గ‌ర ఫ్రాక్చ‌ర్ అయ్యింది. మ‌హేశ్‌కు ఏమీ కాలేదు. ఆ త‌ర్వాత కూడా అత‌ను రిస్కీ షాట్స్‌లో న‌టించ‌డం మాన‌లేదు.