English | Telugu
1988లోనే నరేశ్ హీరోగా ఓ టీవీ సీరియల్ వచ్చిందని మీకు తెలుసా?!
Updated : Jun 20, 2021
జంధ్యాల రూపొందించిన 'నాలుగు స్తంభాలాట' (1982)తో హీరోగా పరిచయమైన నరేశ్.. అనంతర కాలంలో కామెడీ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రను వేశారు. హీరోగా కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ప్రస్తుతం ఆయనంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగు చిత్రసీమలో లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన 1980లలోనే చిన్నితెరపై నటించారనే విషయం నేటి తరంలో చాలామందికి తెలీదు. అవును. 1988లోనే ఆయన 'సీతారాముల సినిమా గోల' అనే టీవీ సీరియల్‌లో నటించారు.
ఇప్పటి మాదిరిగా అప్పట్లో సీరియల్స్ సంవత్సరాల తరబడి నడిచేవి కాదు. ముందుగా తయారుచేసుకున్న స్క్రిప్టుకు తగ్గట్లు కొన్ని ఎపిసోడ్లు మాత్రమే చిత్రీకరించి, వాటిని దూరదర్శన్‌లో ప్రసారం చేసేవారు. శాటిలైట్ చానల్స్ వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందనేది వేరే సంగతి. 'సీతారాముల సినిమాగోల'లో నరేశ్‌కు జోడీగా అప్పట్లో సినీ హీరోయిన్ అయిన సాగరిక నటించారు. సీనియర్ సినీ డైరెక్టర్ ఎం.ఎస్. కోటారెడ్డి ఆ కామెడీ సీరియల్‌ను డైరెక్ట్ చేశారు. 13 ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సీరియల్‌ను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ద్వారా 1988 ఫిబ్రవరి నెలాఖరు నుంచి వారం వారం ప్రసారం చేశారు.
ఈ సీరియల్ కథాంశమేమంటే.. ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రాము (నరేశ్) పెళ్లి చేసుకొని పట్నంలో కాపురం పెడతాడు. అతని భార్య సీత (సాగరిక) ఏదైనా సినిమాకు తీసుకెళ్లమని అడుగుతుంది. తప్పకుండా తీసుకెళ్తానని రాము చెప్తాడు. ప్రతి ఎపిసోడ్‌లో సినిమాకు వెళ్లడానికి వారు ప్రయాణం అవడం, అంతలోనే ఏదో అవాంతరం వచ్చి వాయిదాపడటం వినోదాత్మకంగా ఉంటుంది.
ఈ సీరియల్‌లో రావి కొండలరావు, రాళ్లపల్లి, పొట్టి ప్రసాద్, కె.కె. శర్మ, శ్యామ్‌బాబు, డా. రాధాకృష్ణ, రాంబాబు, శ్రీనివాసరావు, రాధాకుమారి, కృష్ణవేణి లాంటి తారలు నటించారు. భరత్‌కుమార్ మాటలు రాయగా, ఎ.ఎ. రాజ్ సంగీతం సమకూర్చిన ఈ సీరియల్‌ను చల్లా శ్రీధర్‌రెడ్డి నిర్మించారు.