English | Telugu
దర్శకుడిగా ఎస్వీఆర్.. ఎన్ని సినిమాలు తీశారో తెలుసా!
Updated : Jul 18, 2023
(జూలై 18.. ఎస్వీఆర్ వర్థంతి సందర్భంగా)
ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయప్రవేశం చేసే.. అతికొద్దిమంది నటుల్లో 'విశ్వ నట చక్రవర్తి' ఎస్వీఆర్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల చిత్ర ప్రయాణంలో ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే, కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడిగానూ, నిర్మాతగానూ అవతారమెత్తారు ఈ నటదిగ్గజం. మరీముఖ్యంగా.. దర్శకుడిగా తన ఉత్తమాభిరుచిని చాటుకున్నారు ఎస్వీఆర్. అందుకు నిదర్శనం.. ఆయా చిత్రాలకు దక్కిన పురస్కారాలు. ఎస్వీఆర్ మెగాఫోన్ పట్టిన ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..
చదరంగం(1967): ఎస్వీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరనాథ్, జమున, అంజలీదేవి, రామకృష్ణ, రమణారెడ్డి, ధూళిపాళ, రాజబాబు, రమాప్రభ, అన్నపూర్ణ, మీనాకుమారి, ముక్కామల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డీవీ నరసరాజు కథ, మాటలు అందించిన ఈ సినిమాకి దాశరథి సాహిత్యమందించారు. టీవీ రాజు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో "నవ్వని పువ్వే నవ్వింది" పాట ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచింది. ఎస్వీఆర్ ఫిల్మ్స్ పతాకంపై బడేటి సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. 1967లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. 'ద్వితీయ ఉత్తమ చిత్రం' విభాగంలో 'నంది' పురస్కారాన్ని అందుకుంది.
బాంధవ్యాలు (1968): 'చదరంగం' విడుదలైన తదుపరి సంవత్సరంలో ఈ సినిమా వచ్చింది. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా.. 'బాంధవ్యాలు' చుట్టూ అల్లుకున్న కుటుంబ కథా చిత్రం. ఇందులోనూ ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో కనిపించగా.. ప్రముఖ నటి లక్ష్మి ఈ సినిమాతోనే తెలుగునాట తొలి అడుగేశారు. సావిత్రి, ధూళిపాళ, చంద్రమోహన్, చిత్తూరు వి. నాగయ్య, రాజనాల, హరనాథ్, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డీవీ నరసరాజు రచన చేసిన ఈ సినిమాకి సాలూరి హనుమంత రావు సంగీతమందించగా, సి. నారాయణరెడ్డి - కొసరాజు సాహిత్యమందించారు. ఎస్వీఆర్ రూపొందించిన రెండో చిత్రంగా జనం ముందు నిలిచిన ఈ ఫ్యామిలీ డ్రామా.. 1968లో రిలీజై జనాల్ని రంజింపజేసింది. 1968కి గానూ 'ఉత్తమ చిత్రం'గా 'నంది' పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమాని కూడా ఎస్వీఆర్ ఫిల్మ్స్ సంస్థనే నిర్మించింది. బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు నిర్మాతలు.
మొత్తమ్మీద.. తన స్వీయ దర్శకత్వంలో తయారై వరుస సంవత్సరాల్లో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా 'నంది' పురస్కారాలు అందుకుని.. నిర్దేశకుడిగా ఎస్వీఆర్ ఉత్తమాభిరుచిని చాటిచెప్పాయి.