Read more!

English | Telugu

పెళ్లి వరకు వెళ్ళిన కృష్ణకుమారి ప్రేమకథ.. ఎన్టీఆర్‌పై కోపంతో 17 సినిమాలు క్యాన్సిల్‌ చేసుకుంది!

భారతదేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నా.. సినిమా తారల పెళ్ళిళ్ళు అన్నీ చాలా విచిత్రంగానే జరుగుతుంటాయి. సినిమా వారిని కాకుండా బయటి వారిని చేసుకున్న పెళ్లిళ్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన వారినే చేసుకుంటే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. చాలా మంది హీరోలు వారికి గతంలోనే పెళ్ళయినా ఏదో ఒక హీరోయిన్‌పై మనసుపడి వారిని రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం. అయితే ఆ హీరోయిన్‌కి మాత్రం అదే మొదటి పెళ్లి అయి ఉంటుంది. మరి ఇలాంటి వార్తలు మీడియాలో తప్పకుండా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. ఈ తరహా పెళ్లిళ్లు టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఎక్కువగా జరిగాయని చెప్పొచ్చు. పెళ్లి వరకు వెళ్లి.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్‌.టి.రామారావు, కృష్ణకుమారి గురించి. ఎన్టీఆర్‌ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వారిలో ఎక్కువ సినిమాలు చేసిన క్రెడిట్‌ జమునకు దక్కుతుంది. ఎన్టీఆర్‌, జమున కలిసి 31 సినిమాలు చేశారు. సావిత్రితో 26, అంజలీదేవితో 26, కృష్ణకుమారితో 25 సినిమాల్లో జంటగా నటించారు ఎన్టీఆర్‌. అయితే వీరిలో కృష్ణకుమారి అంటే ఎన్టీఆర్‌కి స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ ఉండేది. వీరిద్దరికి సంబంధించిన అనేక అంశాలు అప్పట్లో ప్రచారంలో ఉండేవి. అందులో నిజానిజాలు ఎంత అనే విషయం గురించి కృష్ణకుమారి అక్క షావుకారు జానకి దగ్గర ప్రస్తావిస్తే.. ఆమె కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలియజేశారు. 

‘ఎన్‌.టి.రామారావుగారంటే నాకెంతో గౌరవం. ఆయనంటే ఒక గురు భావం మాత్రమే ఉండేది. అలాగే నేనంటే కూడా ఆయనకు ఎంతో అభిమానం. అలాంటి వ్యక్తి మా చెల్లెలు కృష్ణకుమారిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆరోజుల్లో బాగా వచ్చాయి. అయితే వారిద్దరికీ అంత పరిచయం ఉందనే విషయం నాకు కూడా తెలీదు. వారిద్దరూ పెళ్లి వరకు వెళ్లి కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గారని, అప్పుడు నేను వెళ్లి ఆయన్ని తిట్టానని.. ఇలా చెప్పుకున్నారు. కానీ, దాంట్లో నిజం ఎంతమాత్రం లేదు. మా చెల్లెలు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఉంటే మధ్యలో నేవెవర్ని కాదనడానికి, ఆయన పెళ్ళి చేసుకునే విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారని నేను ఏ హక్కుతో అడుగుతాను. కాబట్టి అప్పుడు అందరూ చెప్పుకున్నట్టుగా ఏమీ జరగలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడినా ఎంతో గౌరవంగా మాట్లాడుకునేవారు. వారిద్దరి ప్రేమ నడిచిందని, పెళ్లి విషయంలో ఇద్దరూ గొడవపడ్డారనేది బయట అందరూ చెప్పుకునే వరకు నాకు తెలీదు. అప్పటికే రామారావుగారికి పెళ్ళయింది, 13 మంది పిల్లలు. ఆయనతో కృష్ణకుమారి పెళ్లి అని తెలిసిన తర్వాత ఆ విషయాన్ని నేను డైరెక్ట్‌గా ఆమెతో డిస్కస్‌ చెయ్యలేదు. పెళ్లయిన వారిని చేసుకుంటే వచ్చే సమస్యలేమిటో తనకి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాను. అయితే కృష్ణకుమారి ఎక్కడో హర్ట్‌ అయింది. అందుకే ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి నేను షాక్‌ అయిపోయాను.

హీరోయిన్‌గా మంచి స్వింగ్‌లో ఉన్న టైమ్‌ ఆది. ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారే 17 సినిమాలు ఫోన్‌ చేసి మరీ క్యాన్సిల్‌ చేసేసుకుంది. ఇక సినిమాల్లో నటించకూడదని డిసైడ్‌ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ అనే బిజినెస్‌ మేన్‌ని పెళ్ళి చేసుకుంది కృష్ణకుమారి. అది కూడా ప్రేమ వివాహమే. అజయ్‌కి ఆల్రెడీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పెళ్ళికి సంబంధించిన శుభలేఖ కూడా పంపింది. కానీ, నేను వెళ్ళలేకపోయాను’ అంటూ వివరించారు షావుకారు జానకి. 

అజయ్‌ మోహన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత బెంగళూరులో స్థిరపడిపోయింది కృష్ణకుమారి. వారికి సంతానం కలగలేదు. అందుకే దీపిక అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. భారతదేశంలో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఎంటిఆర్‌ కంపెనీ అధినేతలైన మయ్యా ఫ్యామిలీకి చెందిన విక్రమ్‌ మయ్యాను పెళ్లి చేసుకున్న దీపిక బెంగళూరులోనే స్థిరపడింది