English | Telugu
నభూతో నభవిష్యతి అంటే.. ఆ సినిమాలో నరేష్ చేసిన క్యారెక్టర్ అనే చెప్పాలి!
Updated : Jan 20, 2025
(జనవరి 20 నటుడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా..)
నవరసాల్లో హాస్యాన్ని పండించడం అనేది చాలా కష్టం అనే విషయాన్ని ప్రతి కళాకారుడు ఒప్పుకుంటాడు. హాస్యాన్ని తమ నటనలో పలికించగల నటులు ఏ రసాన్నయినా అవలీలగా పోషించగలరు అని ఎంతో మంది హాస్యనటులు ప్రూవ్ చేశారు. మన సినిమాల్లో హాస్యం ఒక ట్రాక్‌గా ఉండేది. ఆ తర్వాత హాస్యం ప్రధానంగా హీరోలతోనే నవ్వించే ప్రయత్నం 80వ దశకం నుంచి ప్రారంభమైంది. అంతకుముందు కూడా అలాంటి సినిమాలు వచ్చినా అవి అడపా దడపా వచ్చేవి. పూర్తి స్థాయి హాస్య చిత్రాల ఒరవడి పెరిగింది మాత్రం జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు చేసిన కామెడీ సినిమాల వల్లే. వీరి డైరెక్షన్‌లో చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలు ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాతి స్థానాన్ని నరేష్ దక్కించుకున్నారు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో నటించిన నరేష్.. కామెడీ సినిమాలతోనే రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.
1960 జనవరి 20న విజయనిర్మల, కె.ఎస్.మూర్తి దంపతులకు జన్మించారు. నరేష్ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. 12 సంవత్సరాల వయసులో పండంటి కాపురం చిత్రంలో తొలిసారి నటించారు నరేష్. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడంతో సినిమా పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే విజయనిర్మలకు మాత్రం నరేష్‌ని ఒక డాక్టర్‌గా చూడాలన్న కోరిక ఉండేది. కానీ, చదువు కంటే సినిమాలపైనే అతని ఆసక్తి ఉందని గ్రహించిన విజయనిర్మల అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ప్రేమ సంకెళ్ళు పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. హిందీలో విజయవంతమైన లవ్‌స్టోరీ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే జంధ్యాల దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. అదే నాలుగు స్తంభాలాట. నరేష్ మొదటి సినిమా ప్రేమసంకెళ్ళు అయినప్పటికీ మొదట రిలీజ్ అయిన సినిమా మాత్రం నాలుగు స్తంభాలాట. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో నరేష్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ప్రేమసంకెళ్లు విజయం సాధించలేదు.
ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే పుత్తడిబొమ్మ, రెండుజెళ్ళ సీత చిత్రాల్లో నటించారు నరేష్. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే రామోజీరావు నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో నరేష్‌కి హీరోగా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత కూడా జంధ్యాల దర్శకత్వంలో హాస్య ప్రధాన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కామెడీ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఇతర యాక్షన్, సెంటిమెంట్ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. దాదాపు 15 సంవత్సరాల పాటు హీరోగా, సెకండ్ హీరోగా, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు నరేష్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పటికీ వివిధ పాత్రల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
నరేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా ఆయన లేడీ గెటప్‌లో కనిపించిన చిత్రం భళారే విచిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నరేష్ నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్ గురించి దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు చెప్పిన తర్వాత పాత తరం హీరోయిన్లయిన సావిత్రి, బి.సరోజాదేవి, విజయనిర్మల వంటివారి సినిమాలు చూసి వాళ్లు నడుస్తారు, వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వంటి విషయాల గురించి తెలుసుకున్నారు. ఆ గెటప్ కోసం ఎంతో కేర్ తీసుకున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు నుంచే తన డైట్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా 11 కేజీల బరువు తగ్గారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఒళ్లంతా షేవింగ్ చేయించుకొని అమ్మాయిల శరీరంలా స్మూత్‌గా కనిపించేందుకు కృషి చేశారు. అలా చేయడం వల్ల స్కిన్ ఎలర్జీ వచ్చినప్పటికీ దాన్ని కూడా భరించి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో మెయిన్ అంశాలు చెప్పుకోదగ్గవి రెండు. ఒకటి బ్రహ్మానందం కామెడీ, రెండు నరేష్ వేసిన లేడీ గెటప్. నరేష్ వేసిన లేడీ గెటప్ ఎంతో ప్రభావం చూపించింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు నరేష్ గెటప్‌ని ఎక్కడా రివీల్ చెయ్యలేదు దర్శకనిర్మాతలు. రిలీజ్‌కి ముందు సితార పత్రికలో నరేష్ గెటప్‌ని బ్లో అప్‌గా వేశారు. ఆ ఫోటో చూసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి ఎంతో ముచ్చటపడ్డారు. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చిందని, తమ నెక్స్‌ట్ సినిమాలో ఆమెను బుక్ చేయమని తన అసిస్టెంట్స్‌కి చెప్పారట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎం.ఎస్.రెడ్డి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నరేష్ వేసిన లేడీ గెటప్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. రాష్ట్రంలోని చాలా థియేటర్స్‌లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. చిత్రం భళారే విచిత్రం సినిమాలో నభూతో నభవిష్యతి అన్నట్టు నరేష్ నటించారు. ఆ సినిమా 32 సంవత్సరాల క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ ఆ సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.