Read more!

English | Telugu

ఘంటసాల ఉండగా.. ఆయనలా పాడే మరో సింగర్‌ ఎందుకు.. విమర్శలు ఎదుర్కొన్న రామకృష్ణ!

మధురగానం అంటే ఘంటసాల, భక్తి పారవశ్యంలో ముంచెత్తాలంటే ఘంటసాల పాట, జీవితానికి అర్థం, పరమార్థం ఘంటసాల భగవద్గీత. పాతతరం ప్రేక్షకులు ఘంటసాల రాగాల సెలయేరులో సేద తీరారు. ఆరోజుల్లో ఘంటసాల పాట వినకుండా రోజు గడిచేది కాదు. అంతటి మహత్తు ఆయన గళంలో ఉంది. ఘంటసాల చివరి దశలో ఉండగా, ఆయన గళాన్ని తలపించే మరో గాయకుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అపర ఘంటసాలగా పేరు తెచ్చుకున్నాడు. అతని పాట వింటే ఘంటసాలే పాడుతున్నాడా అని భ్రమ కలిగించేంత జీవం అతని గాత్రంలో ఉంది. అతనే వి.రామకృష్ణ. 

రామకృష్ణ సినిమా కుటుంబం నుంచి వచ్చినవారే. అతనికి పి.సుశీల పిన్ని అవుతుంది. ఆమెతో దగ్గరి బంధుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి రికమండేషన్లు, సిఫార్సులు లేకుండా కేవలం తన టాలెంట్‌తోనే సింగర్‌గా ఎదిగారు. చిన్నతనంలోనే మంచి సింగర్‌ అవ్వాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. సంగీతం, నృత్యం ఆడపిల్లలు నేర్చుకోవాలి, మగపిల్లలు చదవుకొని ఉద్యోగాలు చెయ్యాలి అనే మనస్తత్వం రామకృష్ణ తండ్రిది. తన చెల్లెళ్ళు సంగీతం నేర్చుకుంటూ ఉంటే ఇతను గమనిస్తూ ఉండేవారు. అతనిలోని సంగీత జ్ఞానాన్ని తర్వాత గమనించిన ఆయన తండ్రి నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలోని కొన్ని మెళకువలు నేర్పించారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో కొన్నాళ్లు లలిత గీతాలు పాడారు రామకృష్ణ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు ఆ పాటల్ని వినడం జరిగింది. అవి ఘంటసాల పాడినవే అనుకున్నారు అక్కినేని. తర్వాత రామకృష్ణ పాడాడని తెలుసుకొని అతన్ని పిలిపించి నాకు పాటలు పాడతావా అని అడిగారు. దానికి ఆశ్చర్యపోయిన రామకృష్ణ ఎటూ సమాధానం చెప్పలేకపోయాడు. 

ఒకసారి రామకృష్ణ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాగేశ్వరరావుగారు ఫోన్‌ చేసారని చెల్లెలు చెప్పింది. మొదట అతను నమ్మలేదు. తర్వాత ఆయన మళ్ళీ కబురు చేశారు. రామకృష్ణ వెళ్ళి కలిసారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు నిర్మిస్తున్న ‘విచిత్ర బంధం’ సినిమాలో రెండు పాటలు పాడాలని చెప్పారాయన. ప్రస్తుతం తనకు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయని, ఇప్పుడు పాడలేనని చెప్పారు రామకృష్ణ. అయితే ఎగ్జామ్స్‌ పూర్తయిన తర్వాతే రికార్డింగ్‌ పెట్టుకుందామని అన్నారు అక్కినేని. ఆయన అనట్టుగానే పరీక్షలు అయిపోయిన వెంటనే ఆ రెండు పాటలు రామకృష్ణతో పాడించి రికార్డు చేయించారు. అవి ‘వయసే ఒక పూల తోట..’, ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’. ఈ రెండు పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. 

ఆ రెండు పాటలతో రామకృష్ణ అనే సింగర్‌ వచ్చాడని, ఘంటసాల లాగే పాడుతున్నాడు అని ఇండస్ట్రీకి తెలిసింది. అయితే అతని పాటలకు పేరు రావడం అటుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. రామకృష్ణ ఒరిజినల్‌ సింగర్‌ కాదని, ఘంటసాలను ఇమిటేట్‌ చేస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది. అయినా ఘంటసాట ఉండగా ఆయనలా పాడే మరో సింగర్‌ ఎందుకు అని రామకృష్ణను విమర్శించారు. దాంతో అతనికి అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు. రామకృష్ణ గురించి ఘంటసాల కూడా విని ఉన్నారు. ఒకసారి అతన్ని పిలిపించి తను పాడిన, తనకి ఇష్టమైన పాటలు పాడించుకున్నారు. ఆ పాటలు విన్న ఘంటసాల నిజంగానే ఆశ్చర్యపోయారు. అంత బాగా పాడుతున్నాడు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అని బాధ పడ్డారు. ఆ తర్వాత ఒక సభలో ‘రామకృష్ణ నా వారసుడు..’ అని ప్రకటించారు ఘంటసాల. దాంతో అప్పటివరకు విమర్శించిన వారు కూడా తమ తప్పు తెలుసుకొని రామకృష్ణకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికే ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సింగర్‌గా మంచి స్వింగ్‌లో ఉన్నారు. రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సహజంగానే బాలుకి అవకాశాలు తగ్గాయి. ఒక సందర్భంలో బాలు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. 

ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడి అందర్నీ మెప్పించారు రామకృష్ణ. ఘంటసాలతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే పాట రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ పాటను పూర్తిగా పాడలేకపోయారు ఘంటసాల. వెంటనే రామకృష్ణకు ఫోన్‌ చేసి ‘ఆదినారాయణరావు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడురా.. నువ్వు ఒకసారి రా’ అని పిలిపించారు. అప్పుడు ఆ పాటలోని కొంత భాగాన్ని రామకృష్ణతో పాడించారు. ఆ మరుసటి సంవత్సరమే ఘంటసాల కన్నుమూసారు. ఘంటసాల వంటి గొప్ప గాయకుడు రామకృష్ణను తన వారసుడు అని ప్రకటించాడంటే మామూలు విషయం కాదని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆయన కెరీర్‌లో 200 సినిమాల్లో 5 వేల పాటలు పాడారు. అయితే అందులో 90 శాతం హిట్‌ సాంగ్సే ఉండడం విశేషం. రామకృష్ణ సినిమాల్లో కంటే ప్రైవేట్‌ సాంగ్సే ఎక్కువ పాడారు. కొన్ని వేల భక్తిగీతాలు ఆయన ఆలపించారు. జూలై 16, 2015లో క్యాన్సర్‌ వ్యాధి వల్ల 67 ఏళ్ళ వయసులో కన్నుమూశారు రామకృష్ణ.