English | Telugu
ఫొటో ఫీచర్.. నేడు తారక్-లక్ష్మీప్రణతి పదో వివాహ వార్షికోత్సవం!
Updated : May 5, 2021
టాలీవుడ్‌లోని అగ్ర హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1991లోనే ఏడేళ్ల వయసులో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో నటించడం ద్వారా తెరంగేట్రం చేశాడు తారక్. 2001లో 18 ఏళ్ల వయసులో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరో అయ్యాడు. 'స్టూడెంట్ నెం.1', 'ఆది', 'సింహాద్రి' సినిమాలతో పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. 2011 మే 5 అతడి వ్యక్తిగత జీవితంలో మరపురాని రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు లక్ష్మీప్రణతి మెడలో మూడుముళ్లు వేశాడు తారక్.
ఆ ఇద్దరిదీ అరేంజ్డ్ మ్యారేజ్. లక్ష్మీప్రణతి తల్లి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీప బంధువు. పెళ్లి జరిగే నాటికి లక్ష్మీప్రణతి వయసు సరిగ్గా 18 సంవత్సరాలు కాగా, తారక్ వయసు 27 సంవత్సరాలు. వారి వివాహం బంధుజన సమేతంగా వైభవంగా జరిగింది.
ఆ వేడుకకు 10 వేల మందికి మించి అతిథులు హాజరయ్యారు. ఈ వేడుక నిమిత్తం తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ రూ. 18 కోట్లను వ్యయం చేశారని సమాచారం. అన్ని తెలుగు న్యూస్ చానళ్లలో ఈ వివాహాన్నిప్రత్యక్ష ప్రసారం చేశారు.
పెళ్లయిక కొన్ని నెలల దాకా తనతో సర్దుకుపోవడానికి లక్ష్మీప్రణతి చాలా కష్టపడిందని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించాడు. పెళ్లయ్యాక తన జీవితంలో ఆమె ప్రభావం చాలా ఉందని ఆయన తెలిపాడు.
2014లో ఆ దంపతులకు పెద్దకొడుకు అభయ్ రామ్ జన్మించాడు. మరో నాలుగేళ్లకు 2018లో చిన్నబ్బాయి భార్గవ్ రామ్ పుట్టాడు.
ఇద్దరు పిల్లలతో తారక్-లక్ష్మీప్రణతి వైవాహిక జీవితం ఆనందకరంగా సాగిపోతోంది. నేడు 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు హార్దిక శుభాభినందనలు.