English | Telugu

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు క‌రోనా!

 

కొవిడ్ బాధితుల్లోకి లేటెస్ట్‌గా యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ చేరారు. ఆయ‌న‌కు టెస్ట్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తార‌క్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. 

"నేను కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాను. ద‌య‌చేసి వ‌ర్రీ కాకండి, నేను చాలా బాగా ఉన్నాను. నా ఫ్యామిలీ, నేను స్వీయ ఐసోలేష‌న్‌లో ఉన్నాం. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అన్ని జాగ్ర‌త్త‌లూ ఫాలో అవుతున్నాం. గ‌త కొద్ది రోజులుగా నాకు ద‌గ్గ‌ర‌గా మెల‌గిన వాళ్లంద‌రూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్షేమంగా ఉండండి." అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ఆగిపోవ‌డంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. తార‌క్‌కు క‌రోనా పాజిటివ్ అనే విష‌యం తెలియ‌గానే ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు.

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతున్న సెల‌బ్రిటీల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటోంది. ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, త‌మ‌న్నా, హ‌రితేజ‌, బండ్ల గ‌ణేశ్‌, ప్ర‌దీప్ మాచిరాజు లాంటివాళ్లు కొవిడ్ 19కు గుర‌య్యారు. ప‌వ‌న్ దీని నుంచి కోలుకోవ‌డానికి 20 రోజులు ప‌ట్టిందంటే దాని ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉంటోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏమాత్రం ల‌క్ష‌ణాలు క‌నిపించినా, ఆల‌స్యం చేయ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ, డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.