English | Telugu
మదర్స్ డే స్పెషల్ స్టోరీ.. మన వెండితెర 'అమ్మ'!
Updated : May 9, 2021
సంతోషం వచ్చినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా, దెబ్బతగిలినా అప్రయత్నంగా గుర్తొచ్చే పదం అమ్మ. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ. అమ్మ గురించి ఎవరెన్ని చెప్పినా అది తక్కువే. భాషకు అందని భావం అమ్మ. ఆ భావాన్ని మన సినిమాల్లో తమకు తోచిన రీతిలో ఆవిష్కరించారు మన దర్శకులు, నిర్మాతలు. తమ అభినయంతో అమ్మ పాత్రలకు ప్రాణం పోసిన తారలెందరో. మదర్స్ డే సందర్భంగా వెండితెరపై అమ్మను కళ్లముందు నిలిపిన వారిపై తెలుగువన్ స్పెషల్ స్టోరీ...
కన్నాంబ
తెలుగు సినిమా తొలి రోజుల్లో అమ్మ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటీమణి కన్నాంబ. ఆమె రూపు చూడగానే అమ్మ అనాలనిపిస్తుంది. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడంలో ఆమె చాతుర్యం, హావభావాలు.. వీటన్నింటి సాయంతో ఆమె మాతృమూర్తిగా ఒదిగిపోయారు.
శాంతకుమారి
తెలుగులో తల్లి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ శాంతకుమారి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహమహులకు అమ్మగా నటించారు శాంతకుమారి. శ్రీవెంకటేశ్వర మహాత్యం సినిమాలో శ్రీనివాసుని తల్లి వకుళమ్మగానూ.. ప్రేమనగర్‌లో ఏఎన్నార్ తల్లిగా ఆమె నటన అందరి హృదయాలకు హత్తుకుపోయింది.
పండరీబాయి
అప్పట్లో తెలుగులో అందరు అగ్ర హీరోలకు అమ్మగా నటించి మోస్ట్ వాంటెడ్ స్క్రీన్ మదర్‌గా పేరు పొందారు పండరీబాయి. కృష్ణ నటించిన నేరము-శిక్ష సినిమాలో కొడుకుని నేరం నుంచి రక్షించుకునేందుకు తాపత్రాయపడే తల్లిగా పండరీబాయి నటన అపూర్వం.
సూర్యకాంతం
అదేంటి సూర్యకాంతం గారు గయ్యాళి అత్త పాత్రలకు పెట్టింది పేరు కదా! మరి అమ్మ పాత్ర సమయంలో ఆమెను చెప్పడం ఏంటనేగా మీ డౌట్.. అత్తగారిగా కోడల్ని ఎంత హింసపెట్టినా.. తల్లిగా తన పిల్లల్ని ప్రేమించే పాత్రల్లోనూ సూర్యకాంతం గారు ఒదిగిపోయారు. అందుకే ఆమె గయ్యాళి అత్తగారే కాదు ద బెస్ట్ మదర్ కూడా.
అంజలీదేవి
తెలుగువారి సీతమ్మగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన అంజలీదేవి కెరిర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక తల్లి పాత్రల్లో పరకాయప్రవేశం చేశారు. భక్త ప్రహ్లాద , లక్ష్మీనివాసం, బడిపంతులు, తాతామనవడు, జీవన తరంగాలు ఇలా ఎన్నో సినిమాల్లో మదర్ క్యారెక్టర్ వేసి వెండితెర అమ్మగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.
నిర్మలమ్మ
ఇరవైలలో ఉన్నప్పుడే తన కంటే వయసులో ఎంతో పెద్దవారైన హీరోలకు అమ్మగా నటించి నిర్మల కాస్త నిర్మలమ్మ అయ్యారు. తెలుగు సినిమాల్లో నిర్మలమ్మ వేసినన్ని అమ్మ పాత్రలు మరొకరు వేయలేదు. తెర మీదనే కాకుండా బయటకూడా ఇండస్ట్రీలోని అందరూ అమ్మా అంటూ పిలిచిన ఏకైక అమ్మ నిర్మలమ్మ.
అన్నపూర్ణ
నిర్మలమ్మ తరహాలోనే తెలుగులో అమ్మపాత్రలకు కేరాఫ్ అడ్రస్ అన్నపూర్ణ. తన సహజ నటనతో అమ్మగా జీవించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, అర్జున్, భానుచందర్, సుమన్ తదితర హీరోలందరికీ అమ్మ అంటే అన్నపూర్ణే.
మనోరమ
తన నటనతో ప్రేక్షకుల చేత ఆచి అని ముద్దుగా పిలుచుకేనేంతటి పేరు సంపాదించుకున్నారు మనోరమ. ఆచి అంటే తమిళ్‌లో అమ్మ అని అర్థం. అలాంటి గొప్ప పదాన్ని మనోరమకు బిరుదుగా లభించిందంటే అమ్మపాత్ర ద్వారా ఆమె ప్రేక్షకుల్లో ఎంత ముద్ర వేశారో అర్థమవుతుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ పలువురు హీరోలకు అమ్మ అయ్యారు మనోరమ.
సుజాత
అమ్మ పాత్రలకు గౌరవాన్ని తీసుకువచ్చిన నటి సుజాత. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. చంటి, కొండపల్లి రాజా తదితర సినిమాల్లో అమ్మగా జీవించి అవార్డులను సైతం గెలుచుకున్నారు.
జయసుధ
టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన జయసుధ, వయసు మళ్లాక అమ్మ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి దగ్గర్నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దాకా అమ్మ పాత్రలకు వన్నెతెచ్చారు సహజనటి.
సుధ
సహజ సిద్ధమైన నటన, చూడగానే మన పక్కింటి ఆమెలానో, తెలిసిన వ్యక్తిలా కనిపించే రూపంతో పలువురు హీరో హీరోయిన్లకు మదర్‌గా నటిస్తూ వస్తున్నారు సుధ.
నదియా
ఒకప్పుడు ప్రేక్షకుల కలలరాణిగా పేరు తెచ్చుకున్న నదియా మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా రీ-ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బ్యూటిఫుల్ మదర్‌గా ఆ సినిమాలో ప్రదర్శించిన అభినయం ఆమెకు మరిన్ని అమ్మ పాత్రల అవకాశాలు తీసుకొచ్చింది.