English | Telugu
జ్యోతిలక్ష్మీ స్టార్‌డమ్‌ని తొక్కేసిన జయమాలిని.. మరి జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?
Updated : Jul 17, 2024
ఒకప్పుడు నాట్య తారలకు మన సినిమాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్ స్మిత, అనూరాధ వంటి నాట్యతారలు కొన్ని దశాబ్దాలపాటు తమ డాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించారు. వీరిలో జ్యోతిలక్ష్మీ అందరి కంటే సీనియర్. వెయ్యికిపైగా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. అలాగే 300 సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ చెల్లెలు జయమాలిని రంగ ప్రవేశం చేసి ఆమె కూడా డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి కొన్ని ఐటమ్ సాంగ్స్‌లో నటించారు కూడా. విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరికీ చిన్నతనం నుంచి మాటలు లేవు. ఒకరినొకరు పలకరించుకోవడం గానీ, ఆప్యాయంగా మాట్లాడుకోవడం కానీ ఉండేది కాదు.
తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జ్యోతిలక్ష్మీ, జయమాలిని. తండ్రిపేరు టి.కె.రాజరామన్, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారిలో జ్యోతిక్ష్మీ అందరికంటే పెద్దది కాగా, జయమాలిని అందరికంటే చిన్నది. రాజరామన్ సోదరి అయిన ఎస్.పి.ఎల్.ధనలక్ష్మీ తమిళ్‌లో ప్రముఖ నటి. ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా చిన్నతనం నుంచీ ధనలక్ష్మీ దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మీ. ఆ విధంగా ఆమె తల్లితోగానీ, ఆమె కుటుంబంతో ఎక్కువగా కలవనిచ్చేవారు కాదు ధనలక్ష్మీ. వారు పెద్దయ్యేవరకూ అలాగే కొనసాగారు. జ్యోతిలక్ష్మీ, జయమాలిని కలిసి చాలా సినిమాల్లో నృత్యాలు చేశారు. కానీ, అది సినిమా వరకే పరిమితమయ్యేది. షాట్ పూర్తికాగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు.
ఇద్దరూ ఒకే తల్లి పిల్లలైనా ఎందుకని అలా ఉండేవారు అనే విషయం ఆమధ్య జయమాలిని ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. జ్యోతిలక్ష్మీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత చాలా ఆస్తులు కూడబెట్టారు. జ్యోతిలక్ష్మీ కంటే జయమాలిని 10 ఏళ్లు చిన్నది. ఒక విధంగా జ్యోతిలక్ష్మీ కంటే జయమాలిని ఫ్యామిలీ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. దాంతో వారిని చులకనగా చూడడం మొదలుపెట్టారు జ్యోతిలక్ష్మీ. ఆ కారణంతోనే ఎప్పుడైనా జయమాలిని, వాళ్ళ అమ్మ జ్యోతిలక్ష్మీ ఇంటికి వెళితే మేం బయటకు వెళ్తున్నాం అంటూ వారిని తిప్పి పంపించేవారు. ఇలాంటి ఎన్నో అవమానాలను జయమాలిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ వివాహం వాసుదేవన్ అనే వ్యక్తితో జరిగింది. ఆయనకు అంతకుముందే పెళ్ళయింది. అయితే వారికి పిల్లలు లేరు. దాంతో తల్లి ఆదేశం మేరకు వాసుదేవన్‌ని పెళ్ళి చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీరి పెళ్ళిని రహస్యంగా ఉంచి సహజీవనం సాగించారు. ఎనిమిదేళ్ళు ఇద్దరూ కాపురం చేశారు. వారికి మీనాక్షి అనే పాప పుట్టింది. అయితే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జ్యోతిలక్ష్మీని ఎంతో టార్చర్ పెట్టేవాడు వాసుదేవన్. తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరు వల్ల సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి.
1980లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘సరదారాముడు’ చిత్రం షూటింగ్‌లో జ్యోతిలక్ష్మీ పాల్గొనాల్సి ఉండగా, సడన్‌గా ఆమె మాయమైంది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు. వాసుదేవన్ భార్య నుంచి తప్పించుకునేందుకే జ్యోతిలక్ష్మీ బొంబాయి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చింది. వాసుదేవన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి సినిమాటోగ్రాఫర్ సాయిప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. ఆమె కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా అని మార్చారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ, తల్లికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి వివాహం చేసుకొని చెన్నయ్‌లో స్థిరపడ్డారు జ్యోతి మీనా.
జ్యోతిలక్ష్మీ డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఆ సమయంలో జయమాలిని బిజీ నృత్యతారగా వెలుగొందుతోంది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మీ అనుభవించిన స్థానాన్ని జయమాలిని కైవసం చేసుకుంది. తన అక్కలకు, అన్నయ్యలకు తన డబ్బుతోనే పెళ్లిళ్లు చేసి వారికి అండగా నిలిచింది. జ్యోతిలక్ష్మీ చివరి రోజుల్లో అనారోగ్యం పాలైనప్పుడు తన కుటుంబం గురించి ఆలోచించి ఎంతో బాధపడ్డారు. అప్పుడప్పుడు చెల్లెలు దగ్గరికి వచ్చి వెళ్ళేది. జయమాలిని కూడా గతాన్ని మర్చిపోయి అక్కను ఆదరించేది. చివరికి 2016 ఆగస్ట్ 9న బ్లడ్ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు జ్యోతిలక్ష్మీ.