English | Telugu

‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమా బయటికి రావడం వెనుక ఇంత జరిగిందా?

 

సినిమా అనే మాధ్యమం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. గతంలోకి వెళ్లవచ్చు, అలాగే భవిష్యత్తులోకి కూడా వెళ్ళి గొప్ప అనుభూతిని పొందవచ్చు. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాల్లోనే ఇలాంటి కథాంశాలు మనం చూస్తుంటాం. కానీ, ఒక ఇండియన్‌ మూవీ, అందులోనూ ఒక తెలుగు సినిమా అలాంటి కథాంశంతో రూపొందింది అంటే అది సాధారణమైన విషయం కాదు. అలాంటి అసాధారణ, అనూహ్యమైన సినిమా ‘ఆదిత్య 369’. ఇండియాలో గ్రాఫిక్స్‌ అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ఇలాంటి సినిమా చెయ్యడం ఒక సాహసమనే చెప్పాలి. ఈ సినిమా తొలి ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా చరిత్రకెక్కింది.  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎస్‌.పి.బాలు ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. 1991 జూలై 18న విడుదలైన ఈ సినిమా నేటికి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దివంగత ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంని స్మరించుకుంటూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సినిమా గురించి చెప్పిన కొన్ని విశేషాలు. 

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఒకసారి నేను, బాలుగారు ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నాం. ఆ  సమయంలో నా మనసులో మెదిలిన ట్రావెల్‌ మిషన్‌ స్టోరీని బాలుకి వినిపించాను. కథ విన్న బాలు ఎంతో ఎక్సైట్‌ అయిపోయి అద్భుతం అన్నారు. ఈ కథను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి వినిపించమని సలహా ఇచ్చారు. అలా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అవ్వడానికి బాలు కారణమయ్యారు. ఆ తర్వాత స్టోరీని కొంత డెవలప్‌ చేసి బాలకృష్ణగారికి వినిపించాను. అరగంటపాటు కథ విన్న బాలకృష్ణ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. ‘నాన్నగారు కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చెయ్యాలని ఉంది’ అంటూ సినిమాని వెంటనే ఓకే చేశారు.  టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది.  అయినప్పటికీ నిర్మించడానికి ముందుకొచ్చారు కృష్ణప్రసాద్‌. 33 ఏళ్ళ క్రితం తీసిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది’ అన్నారు.  

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దివంగత బాలుగారి గురించి. ఎందుకంటే ‘ఆదిత్య 369’ వంటి క్లాసిక్‌ తెలుగులో రావడానికి, తెలుగు సినిమా ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఆయనే కారణం. ఇలాంటి ఒక విభిన్నమైన సినిమా నిర్మించాలంటే ఆ నిర్మాతకు ఎంతో ధైర్యం ఉండాలి. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి దర్శకుడికి ప్యాషన్‌ ఉండాలి. ఈ సినిమాలోని రెండు క్యారెక్టర్లు చెయ్యడానికి హీరోకి ప్యాషన్‌తోపాటు ధైర్యం కూడా కావాలి. అలాగే సబ్జెక్ట్‌ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే ఇలాంటి ట్రెండ్‌ సెట్టర్‌ మూవీస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు మళ్ళీ అలాంటి సినిమా రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఆరోజు మేం ఎంత అడ్వాన్స్‌గా ఆలోచించామో. గ్రాఫిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లోనే ఈ సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు చేశాం. భారతీయులు కూడా ఇలాంటి సినిమాలు చెయ్యగలరు అని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అయినప్పటికీ ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఈ సినిమాకి సీక్వెల్‌ తియ్యాలనే ఆలోచన ఉంది. దాన్ని త్వరలోనే ఆచరణలో పెడతాం’ అన్నారు. 

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘మా బేనర్‌లో చేసిన తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో బాలుగారు ఓ సలహా ఇచ్చారు. ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్యి. నేను హీరోలతో మాట్లాడతాను’ అని చెబుతూ సింగీతంగారిని కలవమని చెప్పారు. బాలుగారు చెప్పినట్టుగానే ఆయన్ని కలిశాను. అప్పుడు ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. అలాంటి టైమ్‌ ట్రావెలింగ్‌ సినిమాను మనం చేయడం సాహసమే అవుతుందని ఆయనతో అన్నాను. ఈ సినిమా గురించి బాలుగారు ఒక మాట అన్నారు. ‘భవిష్యత్తులో నువ్వు ఎన్నో సినిమాలు చేస్తావు. కానీ, ఈ సినిమా నీ కెరీర్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌లా నిలుస్తుంది’ అన్నారు. బాలుగారు చెప్పిన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. అయితే ఈ సినిమా బాలకృష్ణగారు చేస్తానని చెప్పడమే నా అదృష్టంగా భావించాను. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత పి.సి.శ్రీరామ్‌గారి ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు సినిమాటోగ్రఫీ బాధ్యతను వి.ఎస్‌.ఆర్‌.స్వామికి అప్పగించాం. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వచ్చే సీన్లకు వి.ఎస్‌.ఆర్‌.స్వామి, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్‌లాల్‌, మిగతా సన్నివేశాలకు పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణాన్ని అందించారు. ఈ చిత్రానికి పనిచేసిన కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సాంబ శివరావుగారికి నంది అవార్డులు వచ్చాయి. గౌతమ్‌రాజుగారి ఎడిటింగ్‌, ఇళయరాజాగారి మ్యూజిక్‌, బాలుగారు, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే సినిమాకి మేం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌ అయింది. ఈ విషయంలో బయ్యర్లు సహకరించారు. ‘ఆదిత్య 369’  చిత్రం వల్ల వచ్చిన గౌరవం మరో 50 ఏళ్ళయినా అలాగే ఉంటుంది. ఇండియాలోని టాప్‌ 100 సినిమాల లిస్ట్‌లో నిలబడగలిగిన సినిమాను నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.