English | Telugu
రాజేంద్రప్రసాద్ హీరో అయినా.. ‘చినుకు చినుకు అందెలతో..’ బాబూమోహన్‌తో చెయ్యడానికి రీజన్ ఇదే!
Updated : Jul 16, 2024
ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలంటే యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఏ సినిమా అయినా ఇదే పద్ధతిలో పూర్తవుతుంది. సాదారణంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సినిమా బాగా రావాలని, అనుకున్న టైమ్‌కి పూర్తి కావాలనే కోరుకుంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతూ ఉంటాయి. అలాంటివి సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ‘మాయలోడు’ సినిమా నిర్మాణ సమయంలో హీరో రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి మధ్య ఓ విచిత్రమైన వివాదం చోటు చేసుకుంది. దానివల్ల దర్శకనిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్, ఎస్.వి.కృష్ణారెడ్డి కాంబినేషన్ ఆ ఒక్క సినిమాతో బ్రేక్ అయింది. ఎస్.వి.కృష్ణారెడ్డి తొలి సినిమా ‘కొబ్బరిబొండాం’. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించడంతోపాటు కె.అచ్చిరెడ్డితో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి దర్శకుడిగా మారి రాజేంద్రప్రసాద్ హీరోగా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా సూపర్‌హిట్ కావడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలూ మనీషా ఫిలింస్ బేనర్‌పైనే నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌తో వేవ్‌లెంగ్త్ బాగా కుదరడంతో ఇకపై ‘మనీషా ఫిలింస్‌లో మీరు తప్ప మరో హీరో ఉండరు’ అని చెప్పారు కృష్ణారెడ్డి.
మనీషా ఫిలింస్ బేనర్‌లో మూడో సినిమాగా ‘మాయలోడు’ స్టార్ట్ చేశారు కృష్ణారెడ్డి. షూటింగ్ అంతా సజావుగానే జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఆ సమయంలోనే కృష్ణారెడ్డిని రాజేంద్రప్రసాద్ అవమానించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానగా మారాయి. ‘కేవలం నీ డైరెక్షన్ వల్లే సినిమాలు హిట్ అవ్వడం లేదు.. నా వల్లే జనం మన సినిమాలు చూస్తున్నారు’ అని రాజేంద్రప్రసాద్ వాదించారు. ఈ వివాదాం పెద్దది కావడంతో సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రెడ్డి జోక్యం చేసుకొని కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన సలహాతోనే రాజేంద్రప్రసాద్‌కి ఫోన్ చేసి ‘సౌందర్య డేట్స్ ఇచ్చారు సర్.. బ్యాలెన్స్ ఉన్న ఒక పాట పూర్తి చేద్దాం’ అన్నారు కృష్ణారెడ్డి. ‘ఆవిడ డేట్స్ ఇచ్చేస్తే నేనొచ్చి చేసెయ్యాలా.. నేనిప్పుడు చెయ్యను. నువ్వు రిలీజ్ డేట్ కూడా పెట్టేసుకున్నావ్. ఆ డేట్‌కి సినిమా కంప్లీట్ అవుతుందనుకుంటున్నావా.. ఇంకా నేను డబ్బింగ్ కూడా చెప్పాలి. ఆ విషయం గుర్తుందా?’ అంటూ వెటకారంగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్.
దానికి కృష్ణారెడ్డి ‘అయితే ముందు డబ్బింగ్ పూర్తి చేద్దాం సర్’ అన్నారు. ‘నేను ఒకేఒక్క రోజు టైమ్ ఇస్తాను. అది కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లంచ్ తర్వాత 2 నుంచి 3 వరకు మరో గంట ఇస్తాను. నువ్వు డబ్బింగ్ పూర్తి చేసుకో. ఒక్కరోజులో డబ్బింగ్ పూర్తి కాదు. నీ సినిమా రిలీజ్ అవ్వదు’ అన్నారు. ఆ మాటతో కృష్ణారెడ్డికి టెన్షన్ మొదలైంది. ఒక్కరోజులో డబ్బింగ్ ఎలా పూర్తి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఎడిటర్ దగ్గరకు వెళ్ళి ముక్కలు ముక్కలుగా ఉన్న 1200 అడుగుల సినిమాని ఒకే రీల్‌గా ఎడిట్ చేయించేశారు. మరుసటి రోజు 9 గంటలకు రాజేంద్రప్రసాద్ థియేటర్‌కి వచ్చారు. అప్పటికే అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అంతా ఇచ్చేశారు నిర్మాతలు. అయినా డబ్బింగ్ చెప్పడానికి ముందే ‘మాయలోడు’ చిత్రానికి సంబంధించిన తమిళ్ రైట్స్ తన పేరున రాయించుకున్నారు. డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఎక్కడా బ్రేక్ లేకుండా వరసగా సీన్స్ వచ్చేస్తుండడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు డబ్బింగ్ పూర్తయింది. రాజేంద్రప్రసాద్ ఆశ్చర్యపోయి ‘అప్పుడే అయిపోయిందా.. అయినా ఇంకా ఒక పాట బ్యాలెన్స్ ఉంది కదా. అది నేను చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావుగా. ఆవిడతోనే చేయించుకో. నేను చెయ్యను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజేంద్రప్రసాద్.
అప్పటికే బ్యాలెన్స్ ఉన్న పాటని ఎలా తియ్యాలి అనే విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు కృష్ణారెడ్డి. వెంటనే బాబూమోహన్‌కి కబురు పెట్టి విషయం చెప్పారు. సౌందర్యతో కలిసి ఒక పాట చెయ్యాలి అని అడిగారు. ఆయన ఓకే అన్నారు. అప్పటికే బాబూమోహన్‌తో కలిసి ఆ పాట చేసేందుకు సౌందర్య కూడా ఓకే చెప్పేసింది. అన్నపూర్ణ స్టూడియోలో పాటను షూట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్.. తన మేనేజర్‌ని కృష్ణారెడ్డి దగ్గరకు పంపించారు. ‘బాబూమోహన్‌తో ఆ పాట తీస్తున్నారని తెలిసింది. నిజమేనా’ అని అడిగారు. నిజమేనని చెప్పారు కృష్ణారెడ్డి. ‘మీరు చెప్పిన డేట్స్‌లోనే ఆ పాటను పూర్తి చేస్తానని చెప్పమన్నారు హీరోగారు’ అన్నాడు మేనేజర్. దానికి కృష్ణారెడ్డి ‘నేను ఆల్రెడీ బాబూమోహన్‌కి మాట ఇచ్చేశాను. నాది రెండు నాలుకల ధోరణి కాదు. మాటంటే మాటే. అతనితోనే ఆ పాట పూర్తి చేస్తాను’ అని చెప్పారు.
యూనిట్ సభ్యులంతా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. బాబూమోహన్, సౌందర్యలకు కొరియోగ్రాఫర్ మూమెంట్స్ చెబుతున్నారు. ఆ సమయంలో మళ్ళీ రాజేంద్రప్రసాద్ మేనేజర్ వచ్చాడు. ‘హీరోగారు తన సొంత ఖర్చులతో హైదరాబాద్ వచ్చారు. ఈ పాట చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓకే అంటే మేకప్‌తో వెంటనే వచ్చేస్తారు’ అని చెప్పాడు. ‘వస్తానంటే రమ్మని చెప్పండి. కానీ, షూటింగ్ చేయడానికి కాదు. ఈ పాటను మేం ఎలా తీస్తున్నామో చూడడానికి’ అన్నారు కృష్ణారెడ్డి. పాట చిత్రీకరణ మొదలైంది. మధ్యలో రాజేంద్రప్రసాద్ సెట్‌కి వచ్చి కాసేపు ఆ షూటింగ్ చూసి వెళ్ళిపోయారు. ‘మాయలోడు’ సినిమా రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా బాబూమోహన్, సౌందర్యలపై చిత్రీకరించిన ‘చినుకు చినుకు అందెలతో..’ పాటకు చాలా క్రేజ్ వచ్చింది. సినిమాలో ఈ పాట అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్, కృష్ణారెడ్డిల మధ్య మాటలు లేవు. 13 సంవత్సరాల తర్వాత కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సరదా సరదాగా’ చిత్రంలో, 2023లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు’ చిత్రంలో నటించారు రాజేంద్రప్రసాద్.