English | Telugu

సావిత్రిని రెండు నెలలు ఏడిపించిన జానకి.. అసలేం జరిగింది?

సావిత్రిని రెండు నెలలు ఏడిపించిన జానకి.. అసలేం జరిగింది?

మహానటి సావిత్రి తొలి రోజుల్లో నటించిన అన్ని సినిమాల్లోనూ ఆమెకు పి.లీల ప్లేబ్యాక్‌ పాడేవారు. మాయాబజార్‌, పెళ్లి చేసిచూడు, మిస్సమ్మ వంటి సినిమాల్లో పి.లీల పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అందుకే తను నటించిన ప్రతి సినిమాలోనూ ఆమే పాడాలని పట్టుపట్టేవారు సావిత్రి. ఆ తర్వాత ఆ అవకాశం పి.సుశీలకు వచ్చింది. లీల తర్వాత తనకు కరెక్ట్‌గా సూట్‌ అయ్యే గాత్రం సుశీలదేనని సావిత్రి నమ్మేవారు. ఎన్నో సినిమాల్లో సావిత్రికి సుశీల పాడిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆమె తప్ప ఎవరు తనకు పాట పాడినా సావిత్రి ఒప్పుకునేవారు కాదు. ఇదిలా ఉంటే.. ఒక పాట విషయంలో సావిత్రి, ఎస్‌.జానకి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో సావిత్రికి పాట పాడనని తేల్చి చెప్పారు జానకి. వారిద్దరి మధ్య అసలేం జరిగింది. సావిత్రిని రెండు నెలల పాటు జానకి ఎందుకు ఏడిపించారు అనే విషయం తెలుసుకుందాం. 

1957లో విడుదలైన ‘ఎం.ఎల్‌.ఎ.’ చిత్రం ద్వారా తెలుగులో నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు ఎస్‌.జానకి. ‘నీ ఆశా అడియాస..’ అంటూ తొలిసారి ఘంటసాలతో కలిసి పాడిన పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో పాటలు పాడిన జానకితో ‘పడితాండ పత్తిని’ అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడించారు. టి.ఆర్‌.పాప సంగీత దర్శకత్వంలో రూపొందిన మంచి మెలోడీ సాంగ్‌ అది. రికార్డింగ్‌ పూర్తయిపోయిన తర్వాత మహానటి సావిత్రి ఆ పాటపై అభ్యంతరం చెప్పారు. తనకు సుశీల పాడితేనే సినిమా చేస్తానని చెప్పడంతో జానకి పాటను తొలగించి మళ్ళీ సుశీలతో పాడించారు. ఇది తెలుసుకున్న జానకి ఎంతో బాధపడ్డారు. ఇకపై సావిత్రికి పాట పాడకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో అవకాశం వచ్చినా పాడనని ఖచ్చితంగా చెప్పేశారు. 

1962లో జెమిని గణేశన్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో ఎం.వి.రామన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొంజమన్‌ సలంగై’. ఇదే చిత్రాన్ని ‘మురిపించే మువ్వలు’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమాలో సంగీత ప్రధానంగా సాగే ఓ పాట ఉంది. సావిత్రికి ఎప్పుడూ ప్లేబ్యాక్‌ పాడే లీల ఆ పాట పాడను అని చెప్పడంతో జానకి అయితే ఆ పాటకు న్యాయం చెయ్యగలదని భావించిన సంగీత దర్శకుడు ఎస్‌.ఎం.సుబ్బయ్యనాయుడు ఆమెను సంప్రదించారు. అప్పటికే సావిత్రికి పాడకూడదని నిర్ణయించుకున్న జానకి దాన్ని తిరస్కరించారు. ఎవరు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి లతా మంగేష్కర్‌తో ఆ పాట పాడించాలనుకొని ఆ ట్రాక్‌ తీసుకొని బొంబాయి వెళ్ళారు దర్శకనిర్మాతలు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాట పాడలేనని చెప్పడంతో వారికి ఏం చెయ్యాలో తోచలేదు. అలా రెండు నెలలపాటు ఆ పాటను పెండింగ్‌లో పెట్టారు జానకి. 

‘ఆ పాటకు కమల లక్ష్మణ్‌తో డాన్స్‌ చేయిస్తాం. సావిత్రే చెయ్యాలా ఏంటి.. మీరు పాడండి’ అని దర్శకనిర్మాతలు రిక్వెస్ట్‌ చేయడంతో ఆ పాట పాడారు జానకి. అయితే ఆ పాటలో సావిత్రే నటించారు. అదే ‘నీ లీల పాడెద దేవా..’ అనే పాట. నాదస్వరంతో పోటీ పడుతూ జానకి పాడిన ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాట ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఎస్‌.జానకి పాడిన పాటల్లో టాప్‌ టెన్‌లో ఈ పాట కూడా ఉంటుంది. ‘మురిపించే మువ్వలు’లోని ఈ పాటకు సంబంధించి జానకి మాత్రమే ఇప్పుడు మనమధ్య ఉన్నారు. ఆ సినిమా దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులు, సావిత్రి, జెమినీగణేశన్‌ అందరూ కన్నుమూశారు.