English | Telugu

తనని స్టార్‌ హీరో చేసిన డైరెక్టర్‌ని అవమానించిన చిరంజీవి!

సినిమా రంగంలో విజయాల శాతం తక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. నూటికి నూరు శాతం విజయాలు సాధించిన దర్శకులు ఉండడం అరుదు. గతంలో డైరెక్టర్స్‌ లెక్కకు మించిన సినిమాలు తీసేవారు. వాటిలో సక్సెస్‌ పర్సంటేజ్‌ తక్కువగానే ఉండేది. కానీ, సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న దర్శకులు కూడా ఉన్నారు. దానికి ప్రస్తుత జనరేషన్‌లో రాజమౌళినే ఉదాహరణగా తీసుకుంటారు. ఇప్పటివరకు అతను డైరెక్ట్‌ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇంతకుముందు జనరేషన్‌ని పరిశీలిస్తే సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉన్న డైరెక్టర్‌ ఖచ్చితంగా ఎ.కోదండరామిరెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌ చేసిన 94 సినిమాల్లో దాదాపు 80 సినిమాలు సూపర్‌హిట్‌ అయినవే. ఈ ట్రాక్‌ రికార్డ్‌ ఆ తరం డైరెక్టర్స్‌లో ఎవరికీ లేదనే చెప్పాలి. 

ఎ.కోదండరామిరెడ్డి విజయ పరంపర మెగాస్టార్‌ చిరంజీవితోనే స్టార్ట్‌ అయింది. ‘సంధ్య’ చిత్రంతో పరిచయమైన కోదండరామిరెడ్డి తన మొదటి సినిమాతోనే దర్శకుడుగా పాస్‌ అయిపోయారు. ఆ సినిమా చూసిన క్రాంతికుమార్‌ రెండో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు ‘న్యాయం కావాలి’. చిరంజీవి కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగా దీన్ని చెప్పొచ్చు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వెంటనే అదే కాంబినేషన్‌లో ‘కిరాయి రౌడీలు’ ప్రారంభించారు క్రాంతికుమార్‌. ఆ తర్వాత  కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో చేసిన ‘ఖైదీ’ చిత్రంతో చిరంజీవి స్టార్‌ హీరోగా ఎదిగారు. అలా వీరిద్దరిదీ హిట్‌ కాంబినేషన్‌ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఛాలెంజ్‌, అభిలాష, రాక్షసుడు, గూండా, దొంగ, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి వంటి సినిమాలు ఘనవిజయం సాధించి చిరంజీవి రేంజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో టోటల్‌గా 23 సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే ఎక్కువ. 1993లో వచ్చిన ముఠామేస్త్రి తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు. అంటే ఈ 30 సంవత్సరాల్లో వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. 

ఇదిలా ఉంటే.. ఆమధ్య చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్‌ గురించి తెలియజేస్తూ తను ఈ స్థాయిలో ఉండడానికి, మెగాస్టార్‌గా ఎదగడానికి కారకులైన దర్శకుల గురించి తెలియజేశారు. కానీ, చిరు చెప్పిన డైరెక్టర్స్‌ లిస్ట్‌లో కోదండరామిరెడ్డి పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మెగాభిమానులు సైతం షాక్‌ అయ్యారు. చిరంజీవికి స్టార్‌ స్టేటస్‌ రావడానికి ముఖ్య కారకులు కోదండరామిరెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆ ఇంటర్వ్యూలో ఆయన గురించి చిరంజీవి ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని అందరూ చర్చించుకున్నారు. ఆమధ్య కోదండరామిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మీకు, చిరంజీవికి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘మా మధ్య అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. బహుశా మేమిద్దరం కలిసి సినిమాలు చెయ్యకపోవడం వల్లే అందరూ అలా అనుకుంటున్నారేమో. నాకు తెలిసి మా మధ్య ఏమీ లేదు. ఆయన మనసులో ఏమైనా ఉందేమో నాకు తెలీదు’ అన్నారు. 

అదే ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పిన డైరెక్టర్స్‌ లిస్ట్‌లో కోదండరామిరెడ్డి పేరును ప్రస్తావించలేదన్న విషయాన్ని గుర్తు చేసినపుడు మాత్రం ‘అవును. అది నిజమే. నేను కూడా దాన్ని గమనించాను. నా గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది, బాధగా కూడా అనిపించింది. నేను ఈ మాట అన్నందుకు చిరంజీవి బాధపడినా ఫర్వాలేదు. నేను మాత్రం బాగా హర్ట్‌ అయ్యాను. మేమిద్దరం కలిసి 23 సినిమాలు చేశాం. అందులో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా నా పేరు చెప్పకపోవడం, మేం చేసిన సినిమాల గురించి కూడా మాట్లాడకపోవడం నాకు బాధ కలిగించింది’ అన్నారు.