English | Telugu
హాస్య చిత్రాల్లో నంబర్ వన్ జంధ్యాల 'అహ నా పెళ్లంట' విశిష్టతలు ఇన్నిన్ని కాదయా!
Updated : Jun 19, 2021
తెలుగులో రూపొందిన హాస్య చిత్రాల్లో జంధ్యాల రూపొందించిన 'అహ నా పెళ్లంట'కు సాటిరాగల మరో హాస్య చిత్రం లేదని నూతన ప్రసాద్ చెప్తుండేవారు. ఆ మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జంధ్యాల డైరెక్ట్ చేసిన 39 సినిమాల్లో టాప్ గ్రాసర్ ఈ సినిమాయే. ప్రఖ్యాత రచయిత ఆదివిష్ణు రాసిన పాపులర్ నవల 'సత్యంగారి ఇల్లు' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
కాకపోతే నవలలోని పిసినారి సత్యం పాత్రను సినిమాలో లక్ష్మీపతిగా మార్చారు. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు చెలరేగిపోయి నటించారు. అంతకు రెండేళ్ల క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన ఆయనకు ఈ సినిమాతో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. లక్ష్మీపతిగా పిసినారితనాన్ని పీక్ స్టేజ్‌లో పోషించారు. ముఖ్యంగా బతికున్న కోడిని ఎదురుగా చూరుకు వేలాడదీసి, దాన్ని చూస్తూ ఒట్టి అన్నం తింటూ చికెన్ తింటున్నట్లు ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్ అద్భుతహ అన్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత కాలంలో తెరపై ఎన్ని పిసినారి పాత్రలు వచ్చినా అవేవీ లక్ష్మీపతి పాత్రను, కోట శ్రీనివాసరావు నటనను మరిపించలేకపోయాయి. నిజానికి ఆ పాత్రకు మొదట అనుకున్నది రావు గోపాలరావును. కానీ లుక్స్ పరంగా, నేటివిటీ పరంగా ఆయన కరెక్ట్ కాదనుకొని కోటను ఎంచుకున్నారు జంధ్యాల.
కోటతో పాటు మరో నటుడికి కూడా ఈ సినిమా ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించింది. ఆ నటుడు.. బ్రహ్మానందం. కోట అసిస్టెంట్‌గా బ్రహ్మానందం అదరగొట్టేశాడంతే! ఆయన కెరీర్‌కు బలమైన పునాది వేసింది అందులోని 'అరగుండు' పాత్రే. చాలా కాలం దాకా ఆయనను జనం 'అరగుండు బ్రహ్మానందం'గానే పిలుస్తూ వచ్చారంటే.. ఆ పాత్ర ఎంతటి ముద్రను వారి గుండెలపై వేసిందో! ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా 14 సినిమాల అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఈ పాత్రకు కూడా ఆయన ఫస్ట్ చాయిస్ కాదు. మొదట సుత్తివేలును ఎంపికచేస్తే, అప్పట్లో బాగా బిజీగా ఉన్న ఆయన కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేకపోయారు. దాంతో ఆ అవకాశం ఓ వరంలా బ్రహ్మానందంకు లభించింది. అయినప్పటికీ సుత్తివేలు అఖిలభారత పిసినారి సంఘం అధ్యక్షునిగా గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. ఆ సినిమాలో ఎలాగైనా కనిపించాలని ఆయన కోరుకోవడం వల్లే ఆ రోల్ ఇచ్చారు.
ఇక హీరో రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో 'అహ నా పెళ్లంట' మరపురాని చిత్రంగా, ఓ ఆణిముత్యంలా నిలిచింది. తన నటజీవితాన్ని మలుపుతిప్పిన టాప్ టెన్ సినిమాల్లో దీనికి నంబర్ వన్ ప్లేస్ ఇస్తారాయన. సురేశ్ ప్రొడక్షన్స్‌లో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన తొలి చిత్రం, జంధ్యాల డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావడం ఇంకో విశేషం. రాజేంద్రప్రసాద్ అదివరకు ఆ బ్యానర్‌లో 'ముందడుగు' సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఆ సినిమా శతదినోత్సవ షీల్డును ఆయన అందుకోలేకపోయారు. అప్పట్నుంచి సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ఎలాగైనా శతదినోత్సవ షీల్డును అందుకోవాలని తపిస్తూ వచ్చారు. ఆయన కోరికను 'అహ నా పెళ్లంట' తీర్చింది. అంతేనా.. ఏకంగా సిల్వర్ జూబ్లీ షీల్డును కూడా ఆయన అందుకున్నారు.
తెలుగు సినిమాల్లో జబ్బుపడిన హాస్యానికి జంధ్యాల 'శ్రీవారికి ప్రేమలేఖ', 'అహ నా పెళ్లంట' సినిమాలతో మందువేసి సంపూర్ణ ఆరోగ్యవంతం కావించారని నూతన్‌ప్రసాద్ అనేవారు. హీరో తండ్రి పాత్రలో ఆయన జీవించారు. 'బామ్మమాట బంగారుబాట' షూటింగ్‌లో యాక్సిడెంట్‌కు గురవడానికి ముందు తాను చేసిన 365 సినిమాల్లో కష్టతరమైన పాత్రలు మూడో నాలుగో ఉంటే, వాటిలో ఈ సినిమాలోని పాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. తన గురించి తెలియదన్న ప్రతివారికీ తన ఆటోబయోగ్రఫీ చెబుతూ, వాళ్ల బుర్ర తినేసే పాత్రను ఆయన అమోఘంగా పోషించారు.
ఈ సినిమా చివరలో శుభం కార్డుకు బదులు 'నవ్వండి - నవ్వించండి - నవ్వు ఆరోగ్యకరం' అని వేసి, హాస్యరసంపై తన మక్కువను మరోసారి ప్రదర్శించారు హాస్య బ్రహ్మ. 1987 నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించి, పెట్టుబడికి అనేక రెట్లు లాభాలు ఆర్జించింది. దర్శకునిగా ఇది జంధ్యాలకు 23వ చిత్రం. ఈ జూన్ 19 ఆయన 20వ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసంతో నివాళులర్పిస్తున్నాం.