English | Telugu
జయంతి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనీ, ఆ మూడూ విఫలమయ్యాయనీ మీకు తెలుసా?
Updated : Jul 26, 2021
తెలుగువారైన నటి జయంతి తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ చిత్రరంగాల్లోనూ రాణించారు. చెప్పాలంటే తెలుగుకు మించి కన్నడ చిత్రసీమలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కన్నడిగులు ఆమెను కన్నడ నటిగానే ప్రేమించారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ ఎలాగో, కన్నడంలో రాజ్‌కుమార్ అలాగా అని మనకు తెలుసు. అలాంటి రాజ్‌కుమార్ సరసన అత్యధికంగా 30 చిత్రాల్లో నాయికగా నటించారు జయంతి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి అగ్రహీరోల సరసన నాయికగా నటించిన జయంతి, అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఏడుపు పాత్రలకు పెట్టింది పేరనిపించుకున్నా, సరదా పాత్రల్లోనూ సమానంగా రాణించారు.
500కు మించిన సినిమాల్లో నటించి, సక్సెస్‌ఫుల్ ఆర్టిస్టుగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న జయంతి వ్యక్తిగత జీవితం ఓ ఫెయిల్యూర్ స్టోరీ లాంటిది. మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ అవి ఆమెకు కలిసి రాలేదు. మొదట ఆమె నటుడు పేకేటి శివరామ్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయన వివాహితుడు. పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న జయంతిని ప్రేమలో దింపి, పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా సహకరించారని అప్పట్లో చెప్పుకున్నారు. ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. జయంతిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని, ఆమెను కట్టడి చేయాలని శివరామ్ ప్రయత్నించారనీ, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న జయంతి ఆయన ధోరణిని తట్టుకోలేకపోయారనీ, అందువల్లే ఆయన నుంచి జయంతి విడిపోయారనీ అంటారు.
జయంతి నటిగా తన కెరీర్‌లో కొనసాగిస్తూ వచ్చారు. ఆ టైమ్‌లో రంగనాథ్ హీరోగా పరిచయమైన 'చందన' (1974) మూవీలో జయంతి హీరోయిన్‌గా నటించారు. బండారు గిరిబాబు అనే ఆయన ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ఏర్పడిన సన్నిహితత్వంతో గిరిబాబును వివాహం చేసుకున్నారు జయంతి. ఇక్కడ కూడా గిరిబాబు వివాహితుడే. స్వల్ప కాలంలోనే ఇరువరి మధ్య బేదాభిప్రాయాలు తలెత్తి విడిపోయారు.
ఇలా రెండు వివాహాలు విఫలమయ్యాక.. కన్నడంలో యంగ్ హీరో అయిన రాజశేఖర్ ప్రేమలో పడ్డారు జయంతి. ఆమెకంటే రాజశేఖర్ వయసులో చాలా చిన్నవాడు. ఇద్దరి మధ్య ఇరవై ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉందంటారు. తన శ్రేయోభిలాషుల సహకారంతో రాజశేఖర్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం కారణంగా జయంతి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఆమె పట్టించుకోలేదు. రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఆమె చాలా డబ్బు ఖర్చుపెట్టారనే ప్రచారం జరిగింది. ఒక సినిమా తీస్తే, అది ఫెయిలై, చాలా నష్టం వచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికే వారి బంధం కూడా విచ్ఛిన్నమైంది. ఇలా మూడు పెళ్లిళ్లు ఫెయిలవడంతో జీవితంలో ఆమె ఎక్కువకాలం ఒంటరిగానే గడిపారు. మూడున్నర దశాబ్దాలకు మించి ఉబ్బస వ్యాధితో బాధపడుతూ జూలై 26 తెల్లవారుజామున బెంగుళూరులోని తన నివాసంలో ఆమె చివరిశ్వాస విడిచారు.