English | Telugu
'యమలీల'లో హీరోయిన్‌గా చేయలేకపోయినందుకు సౌందర్య ఏడ్చారనే విషయం తెలుసా?
Updated : Jul 10, 2021
సావిత్రి తర్వాత తెలుగులో అంతటి ప్రతిభావంతురాలైన పేరు తెచ్చుకున్న తార సౌందర్య. స్వతహాగా కన్నడ అమ్మాయయినా తెలుగమ్మాయి అన్నంతగా ఆమె మారిపోయారు. పన్నెండేళ్ల కెరీర్ తర్వాత చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో విషాదకరంగా ఆమె కాలి బూడిదైపోయారు. 1992లో హీరోయిన్‌గా పరిచయమైన కొద్ది కాలంలోనే సంచలన హీరోయిన్‌గా ఆమె ఎదిగారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో చేసిన 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'మాయలోడు', 'నంబర్ వన్' లాంటి సినిమాలు ఆమె టాప్ హీరోయిన్‌గా మారడానికి దోహదం చేశాయి.
అయితే అలీ హీరోగా కృష్ణారెడ్డి రూపొందించిన 'యమలీల' సినిమాలో హీరోయిన్‌గా ఆమే నటించాల్సింది. మొదట ఆమెనే బుక్ చేసుకున్నారు. కానీ ఆమె ప్లేస్‌లో ఇంద్రజ వచ్చింది. ఆ మార్పు జరగడానికి వెనుక ఉన్నది సౌందర్య తండ్రి సత్యనారాయణ. అప్పటికే సౌందర్యకు అగ్రహీరోలతో నటించే అవకాశాలు వస్తుండటంతో కమెడియన్ అయిన అలీ పక్కన హీరోయిన్‌గా చేస్తే.. ఆమె కెరీర్‌కు ఇబ్బంది అవుతుందేమోనని ఒక తండ్రిగా సత్యనారాయణ భావించారు. అదే విషయాన్ని నిర్మాత కె. అచ్చిరెడ్డితో అన్నారు. ఆయన బాధను అచ్చిరెడ్డి అర్థం చేసుకున్నారు. పెద్ద హీరోల పక్కన సౌందర్యకు అవకాశాలు వస్తున్నప్పుడు మంచిదే కదా అని అనుకున్నారు. సౌందర్య అంటే కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు తమ కుటుంబసభ్యురాలన్నంత ప్రేమాభిమానులు ఉన్నాయి. అందుకే "వేరే అమ్మాయిని పెట్టుకుంటాం లెండి" అని సత్యనారాయణతో చెప్పారు అచ్చిరెడ్డి. ఆయన సంతోషించారు.
అప్పుడు ఇంద్రజను హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని పత్రికల్లో ప్రకటించేశారు. వారం తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి దగ్గరకు మళ్లీ వచ్చారు సత్యనారాయణ. "ఇంద్రజను హీరోయిన్ అని ప్రకటించిన విషయం తెలిసి, సౌందర్య మూడు రోజుల నుంచి భోజనం చేయట్లేదు. యమలీలలో ఇంద్రజను హీరోయిన్‌గా ఎందుకు ఫైనలైజ్ చేశారు. నేను చేస్తానని చెప్పాను కదా.. మీరేమైనా కాన్సిల్ చేశారా? అని నామీద అలిగింది. మీ దగ్గరకు తీసుకొస్తాను. మీరే తనను ఎలాగైనా కన్విన్స్ చేయాలి." అని చెప్పారు. "మేమే అమ్మాయి దగ్గరకు వస్తాం" అని కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి బంజారాహిల్స్‌లో సౌందర్య ఉంటున్న ప్రశాంత్ కుటీర్‌కు వెళ్లారు.
"ఏమైందమ్మా?" అనడిగితే, "సారీ అండి. ఆ సినిమా నేను చేస్తాను." అంటూ ఏడ్చేసింది. "నాన్నగారి తప్పేం లేదు. ఆ నిర్ణయం మాదే. నీకు పెద్ద హీరోల పక్కన ఆఫర్స్ వస్తున్నాయి కదా. వరుసగా మాతో మూడు సినిమాలు చేశావ్. బయటి హీరోయిన్ చేస్తే చేంజ్ ఉంటుంది కదా అని అనుకున్నాం." అని వాళ్లు చెప్పాక సమాధానపడ్డారు. కానీ సినిమా రిలీజయ్యాక ఆమెకు అసలు విషయం తెలిసిపోయింది. వచ్చి, "సారీ అండీ. నాకు నిజంగా తెలియదు. అలీ పక్కన చేయడం వల్లే నా కెరీర్ పోతే ఆ కెరీర్ నాకు వద్దు. డబ్బులు విపరీతంగా సంపాదించి కట్టలు కట్టాలి అని లేదు. 'యమలీల'ను రిజెక్ట్ చేశాను అన్న ఫీలింగే జీర్ణం కావడం లేదు. మరోసారి అలీ సరసన చాన్స్ ఇవ్వండి. చేస్తాను." అని చెప్పారు సౌందర్య.
అప్పుడు 'శుభలగ్నం'కు సంబంధించి స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. "అందులో అలీకి ఓ పాటనుకున్నాం. అది చేస్తావా?" అనడిగారు కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి. ఆనందంగా సరేనన్నారు సౌందర్య. అంత మంచి హృదయం ఆమెది.